
- గతేడాదితో పోలిస్తే తగ్గిన పాస్ పర్సంటేజీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్ 1లో 59.48 శాతం, పేపర్ 2లో 31.21 శాతం మంది క్వాలిఫై అయ్యారు. గత టెట్ పరీక్షతో పోలిస్తే పాస్ పర్సంటేజీ ఈసారి తగ్గింది. బుధవారం సెక్రటేరియేట్‌లో విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహా రెడ్డి తదితరులు టెట్ ఫలితాలను విడుదల చేశారు. టీజీ టెట్ పరీక్షలు జనవరి 2 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈ ఎగ్జామ్స్‌కు 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,35,802 మంది మాత్రమే పరీక్షలు రాశారు. వీరిలో 83,711 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఫలితాలను www.schooledu.telangana.gov.inలో అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టెట్ కన్వీనర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
పాస్ పర్సంటేజీ తగ్గింది..
గతేడాది జూన్‌లో విడుదలైన టెట్ పరీక్షా ఫలితాలతో పోలిస్తే.. ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. పేపర్ 1కు 69,476 మంది అటెండ్ కాగా, దానిలో 41,327 మంది అర్హత సాధించారు. పేపర్ 2లో 1,35,802 మంది హాజరైతే.. 42,384 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్2 మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో 69,390 మంది అటెండ్ అయితే 23,755 మంది క్వాలిఫై అయ్యారు. సోషల్ సైన్స్‌లో 66,412 మందికి గాను 18,629 మంది అర్హత సాధించారు. గతేడాది టెట్ పరీక్షల్లో పేపర్1లో 67.13 శాతం మంది క్వాలిఫై అయితే.. ఈసారి అది 59.48 శాతానికి తగ్గింది. పేపర్2లో 34.18 శాతం మంది అర్హత సాధించగా.. ఈసారి 31.21శాతం మందే పాస్ అయ్యారు.