
- అదే రోజు విగ్రహావిష్కరణ
- సెక్రటేరియట్ లోనూ ఏర్పాటు
- సచివాలయంతోపాటు అన్ని ఆఫీసుల్లో ఫెస్టివల్
- ఈ సారి సోనియా గాంధీకి ఆహ్వానం
- చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తొలి ప్రకటన వెలువడిన డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మీడియాతో జరిగిన చిట్ చాట్ లో తెలిపారు. సచివాలయంతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు. అదే రోజున సచివాలయం ఆవరణలో కొత్త విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. ఈ సారి ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఆహ్వానించనున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహించనున్నామని సీఎం వెల్లడించారు. కేసీఆర్ చెప్పినట్టుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ బయట కాదు.. సెక్రటేరియట్ లోపలనే ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించేందుకు బాధ్యతలు అప్పగించామని గతంలోనే చెప్పారు.
2009లో డిసెంబర్ 9నే తొలి ప్రకటన
తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాటాన్ని చూసి చలించిన యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి హోం మంత్రి చిదంబరం ఈ ప్రకటన చేశారు. సోనియా గాంధీ బర్త్ డే రోజున తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ఒక రూపం వచ్చింది. ఆ తర్వాత సీమాంధ్ర నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఆ ప్రకటన కార్యరూపం దాల్చలేదు. తర్వాత 2014లో సోనియా గాంధీ చొరవతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆ రోజున తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో ఆవిష్కరించడంతోపాటు, రాషష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం సంకల్పించారు.