అమ్మ రూపం ఇస్తే అభాండాలా: విగ్రహ శిల్పి ఎంవీ రమణారెడ్డి ఆవేదన

అమ్మ రూపం ఇస్తే అభాండాలా: విగ్రహ శిల్పి ఎంవీ రమణారెడ్డి ఆవేదన
  • తెలంగాణ తల్లి విగ్రహం కోసం నేను ఒక్క రూపాయి కూడా తీస్కోలే
  • కోట్లు తీస్కున్నట్లు సిధారెడ్డి అనడం బాధించింది
  • గత సర్కార్​ టైమ్​లో శకటాలు, లోగోలు చేసినా ఒక్క రూపాయీ ఇయ్యలే
  • అమరజ్యోతిని నిర్మిస్తే ఇప్పటికీ 40% బిల్లులు రాలే.. కాంట్రాక్టర్​కు మాత్రం 98% ఇచ్చేశారు
  • ఏడేండ్లు కష్టపడి నిర్మిస్తే  ప్రారంభం రోజు కనీసం కళాకారుడిగానైనా గుర్తించలే
  • నాడు పదవుల్లో ఉన్నప్పుడు సిధారెడ్డికి రాష్ట్ర గీతం ఎందుకు యాదికి రాలే
  • ఆయనో పెయిడ్​ బానిసలా వ్యవహరిస్తున్నడు.. 
  • చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్

సిద్దిపేట, వెలుగు:  తెలంగాణ తల్లికి ‘అమ్మ’ రూపం ఇవ్వడమే తాము చేసిన తప్పా? అని తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి, చిత్రకారుడు ఎంవీ రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కోట్లు ఉన్నవాళ్ల తల్లులకు కిరీటాలు పెడతారేమోగానీ మాలాంటి సామాన్యుల తల్లులకు కిరీటాలు పెట్టలేం. సామాన్యులుగా, కళాకారులుగా తెలంగాణ తల్లిలో మా తల్లులను చూసుకోవాలనుకున్నం తప్ప దేవతామూర్తులను కాదు.

ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి తీసుకోకుండా తెలంగాణ తల్లి విగ్రహం తయారుచేస్తే కోట్ల రూపాయలు తీసుకున్నట్లు నందిని సిధారెడ్డిలాంటి వ్యక్తి  నాపై అభాండాలు వేయడం బాధించింది’’  అని ఆయన అన్నారు. గురువారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఎంవీ రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. కొత్తగా తయారుచేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు నయా పైసా తీసుకోలేదని.. కానీ సెక్రటేరియెట్​ఎదుట అందరి సమక్షంలో సీఎం తమను ఘనంగా సన్మానించడం కళాకారులుగా తమకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. 

తొలి శకటాన్ని నిర్మిస్తే.. రూపాయి కూడా ఇయ్యలే

గత సర్కారు హయాంలో తాను ప్రభుత్వం కోసం చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ పెండింగ్​లోనే ఉన్నాయని శిల్పి రమణారెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా నుంచి నాడు ఉన్నత పదవుల్లో కొనసాగిన నాయకుల్లో ఏ ఒక్కరూ తనకు బిల్లులు ఇప్పించకపోగా, ఇప్పుడు కోట్లు తీసుకున్నానంటూ ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు. ‘‘2015 లో రిపబ్లిక్​ డే వేడుకలకు తెలంగాణ తొలి శకటాన్ని (బోనాలు) నేను డిజైన్ చేశాను. ఇందుకోసం నేటికీ ఒక్క రూపాయి కూడా రాలేదు. ఈ విషయాన్ని నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్ లాంటివాళ్ల దృష్టికి తీసుకెళ్లినా.. నాటి ప్రభుత్వం స్పందించలేదు.

ఆ శకటాన్ని ఢిల్లీ అధికారులు ఆమోదించకపోవడంతో నా సొంత డబ్బులతో కోర్టును ఆశ్రయించి చివరికి తెలంగాణ శకటాన్ని ప్రదర్శించాం. అప్పట్లో గ్రామజ్యోతి లోగోనూ నేనే డిజైన్ చేశాను. దీనికీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. 2018 లో మొదలైన తెలంగాణ అమరవీరుల స్మారక నిర్మాణం (అమరజ్యోతి) కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను. దేశం గర్వించేలా ప్రపంచంలోనే  ఎక్కడా లేని విధంగా అతిపెద్ద అతుకులులేని స్టెయిన్​లెస్​ స్టీల్ నిర్మాణాన్ని డిజైన్ చేసి నా పర్యవేక్షణలో నిర్మించాం.

కానీ, ఇప్పటికీ 40 శాతం డబ్బులు  ఇవ్వకుండా నిర్మించిన కాంట్రాక్టర్ కు మాత్రం 98 శాతం చెల్లింపులు చేశారు. ఏడేండ్లపాటు శ్రమించి ఒక అద్భుత నిర్మాణాన్ని చేపడ్తే ప్రారంభం రోజు కనీసం కళాకారుడిగా నాకు సన్మానం కూడా చేయలేదు. కళాకారుడికి ఇదా పరిస్థితి?’’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. 

సిధారెడ్డిది ఊడిగపు రాజకీయం

నందిని సిధారెడ్డి ఆరోపణలు అర్థరహితమని, కళను డబ్బుతో ముడిపెట్టి డబ్బుల కోసమే కళాకారుడు పనిచేస్తారన్నట్లుగా ఆయన ఆరోపణలు చేయటం సిగ్గుచేటని ఎంవీ రమణారెడ్డి అన్నారు. ‘‘గత ప్రభుత్వంలో అధికారహోదాలను అనుభవించి, ఆస్వాదించి,  డబ్బుల్లో మునిగిన ఆయన.. అదే అహంకారంతో మాట్లాడుతున్నారు. మూడేండ్లపాటు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గా పనిచేసిన ఆయన రాష్ట్ర గీతం ఉండాలన్న ప్రయత్నం చేశారా? తెలంగాణ తల్లికి అధికారికంగా ఒక విగ్రహం ఉండాలని ఏనాడైనా ప్రయత్నించారా? ఉద్యమానికే స్ఫూర్తిదాయకంగా నిలిచిన గన్ పార్క్  అమరుల స్మారక శిల్పిని గౌరవించాలనే ఆలోచన ఆయనకు ఎప్పుడైనా  వచ్చిందా? రాష్ట్రంలో ఉన్న కవులు, రచయితలను గౌరవించాలని ఏనాడైనా అనుకున్నడా?” అని ప్రశ్నించారు. 

‘‘పాత శిల్పంలో నందిని సిధారెడ్డికి పోచంపల్లి చీర కనిపించిందట. ఈయన కళారాధనకు జోహార్లు’’ అని విమర్శించారు. నందిని సిధారెడ్డి సాహిత్య అకాడమీ చైర్మన్ గా ఉన్నకాలంలో ప్రపంచ తెలుగు మహాసభల బడ్జెట్ దుర్వినియోగమైందని, అందులో ఆయన వాటా ఎంతో చెప్పాలని డిమాండ్​ చేశారు. ‘‘మేం  మేధావులుగా భావిస్తున్న సిధారెడ్డిలాంటి వాళ్లు కొందరు పెయిడ్ బానిసల్లాగా వ్యవహరిస్తున్నారు.

అమరుల త్యాగాలను, బహుజనుల ఉద్యమ భాగస్వామ్యాన్ని త్యజించి.. బోనాలు, సమ్మక్క – సారలమ్మ, సదర్ లాంటి పండుగలను కించపరిచే ఈ పెద్దమనిషి(సిధారెడ్డి) చేసేది ఊడిగపు రాజకీయం”అని శిల్పి రమణారెడ్డి ఘాటుగా విమర్శించారు.  ‘‘నేను ఒక కళాకారుడిగా ఆత్మగౌరవంతో,  ఆత్మాభిమానంతో, నిజాయితీగా పనిచేస్తా.  తెలంగాణ తల్లి శిల్పానికి కళాకారుడిగా కోట్లు తీసుకున్నాననే ఆరోపణను మీరు రుజువుచేయాలి.. లేదంటే పత్రికాముఖంగా క్షమాపణ చెప్పాలి’’ అని నందిని సిధారెడ్డికి రమణారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లిపై కొందరు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొడ్తామని, ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. మీడియా సమావేశంలో జి.శ్రీనివాస్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.