పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి

పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి
  • పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి.. 
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి
  • ఒకటో తరగతి నుంచి పదో తరగతి టెక్ట్స్​ బుక్స్​లో ముద్రణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి ఫొటోను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం (2025–26) నుంచి పుస్తకాల్లో ఈ చేర్పులు చోటుచేసుకోనున్నాయి. త్వరలోనే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పుస్తకాల ముద్రణ ప్రారంభం కానుంది. ఈ పుస్తకాల్లో రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’, ఇటీవల ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన తెలంగాణ తల్లి ఫొటోను ముద్రించాలని నిర్ణయం తీసుకున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి మంగళవారం వెల్లడించారు.

ప్రస్తుతం పుస్తకాల్లో ప్రతిజ్ఞతో పాటు జాతీయ గీతం, జాతీయ గేయం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లయినా గత సర్కారు రాష్ట్ర గీతాన్ని అధికారంగా నిర్ణయించలేదు.ఏడాది కింద వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం.. ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో అందెశ్రీ రాసిన ఈ పాట.. అప్పట్లో ఉద్యమానికి ఊపిరులూదింది. పూర్తి గీతం 13.30 నిమిషాల నిడివితో ఉండగా.. అధికారిక కార్యక్ర మాల్లో పాడేందుకు వీలుగా దానిని 2.30 నిమిషాల నిడివితో మూడు చరణాలతో రూపొందించారు.

Also Read:-పులి సంకటం! గోదావరి వెంట పెరిగిన పెద్దపులుల సంచారం..

తాజాగా ఏడాది పాలన పూర్తయిన సందర్బంగా సోమవారం సెక్రటేరియెట్​లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో రాష్ట్ర గీతంతోపాటు  తెలంగాణ తల్లి ఫొటోను రాష్ట్రంలోని విద్యార్థులందరికీ తెలిసేలా పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

2026-27 నుంచి సిలబస్​లో మార్పులు

వచ్చే 2025–26 విద్యా సంవత్సరంలోనూ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు బైలింగ్వల్ బుక్స్​ను ముద్రించాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది. నాలుగైదేండ్ల నుంచి ఇట్ల ముద్రిస్తున్నారు. అయితే, ఈ సారి ముద్రిస్తారా? లేదా? అనే అనుమానాల నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ సారి కూడా బైలింగ్వల్ బుక్స్​ ముద్రణ ఉంటుందని ఆయన చెప్పారు.

మరో వైపు పుస్తకాలలోని సిలబస్ మార్పుపైనా విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. 2026- –27 విద్యా సంవత్సరంలో సిలబస్​లో మార్పులు చేయాలని నిర్ణయించింది. నేషనల్ కర్రికులమ్ ఫ్రేమ్ వర్క్ (ఎస్ సీఎఫ్)కు తగ్గట్టు రాష్ట్ర స్థాయిలోనూ పాఠ్యాంశాలను రూపకల్పన చేస్తామని డైరెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉండే ప్రత్యేకతలు, చరిత్ర, సాంస్కృతిక అంశాలను చేర్చే అంశాలపై స్టడీ చేస్తున్నామని వివరించారు.