సచివాలయానికి తెలంగాణ తల్లి విగ్రహం : సీఎం రేవంత్​ రెడ్డి

  • పనులను పరిశీలించిన సీఎం రేవంత్​ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పనులు వేగవంతం అయ్యాయి. ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు.  అక్కడ జరుగుతున్న పనులు, ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. ఫౌంటేన్ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది.సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటయ్యే స్థలానికి ఆగస్టు 8న భూమిపూజ చేశారు. 

విగ్రహం చుట్టూ అదనపు హంగులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. రాత్రి కాగానే లేజ‌‌‌‌‌‌‌‌ర్ లైట్ల వెలుగులు విరజిమ్మేలా విగ్రహం చుట్టూ  పెద్ద ఫౌంటెయిన్‌‌‌‌‌‌‌‌ రాబోతోంది. ట్యాంక్ బండ్ పైకి, ఎన్టీఆర్ మార్గ్ లోకి వ‌‌‌‌‌‌‌‌చ్చే సంద‌‌‌‌‌‌‌‌ర్శకుల‌‌‌‌‌‌‌‌కు సైతం తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసేందుకు అనుమ‌‌‌‌‌‌‌‌తి ఇస్తారు. పోరాట పటిమ, తెలంగాణతనం ఉట్టిపడేలా విగ్రహం రూపుదిద్దుకుంటున్నది. 

ఇప్పటి యువతకు వారి నానమ్మ, అమ్మమ్మల రూపు తీరు తెలంగాణ తల్లి కనిపించనున్నది. చెవులకు వేలాడే గంటీలతో   విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలిసింది. ఇక  అప్పట్లో తెలంగాణలో చీరకట్టు, రవిక ఎలా ఉంటుందో అచ్చం అలానే తెలంగాణ తల్లి విగ్రహానికి ఉండనుంది. దాదాపు లక్షమందితో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.