ఇరుకుగా సూర్యాపేట కొత్త కలెక్టరేట్‌!

ఇరుకుగా  సూర్యాపేట కొత్త కలెక్టరేట్‌!
  • 35 శాఖలు ఉండేలా డిజైన్... 46 శాఖలకు కేటాయింపు
  • ఒక్కో గది మూడు నుంచి ఆరు శాఖలకు అలాట్
  •  ఆఫీసర్లు ఒక చోట.. సిబ్బంది మరోచోట
  •  పెండింగ్‌లోనే ఉన్న ఇంకా కొన్ని పనులు  

సూర్యాపేట, వెలుగు : ఆగస్టు 20న సీఎం కేసీఆర్‌‌‌‌ అట్టహాసంగా ప్రారంభించిన సూర్యాపేట కొత్త కలెక్టరేట్‌‌లో స్పేస్ సరిపోవడం లేదు. 35 శాఖలు ఉండేలా డిజైన్‌‌ చేసిన కలెక్టరేట్‌‌లోని రూములను 46 శాఖలకు కేటాయించడంతో ఆఫీసర్లు, సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు.  కొన్ని గదులను మూడు నుంచి ఐదు డిపార్ట్‌‌‌‌‌‌మెంట్లకు అలాట్‌‌ చేసి టేబుళ్లు, డెక్స్‌‌, చాంబర్లు ఏర్పాటు చేశారు.  

అయితే ఇక్కడ హెచ్‌‌వోడీలు, ఆఫీసర్లు విధులు నిర్వహిస్తుండగా.. సిబ్బందికి మరోచోట చాంబర్లు అలాట్ చేయడంతో వీరి మధ్య కోఆర్డినేషన్‌‌ దెబ్బతింటోంది. కొన్ని శాఖల కేటాయించిన గదులు ఇరుకుగా ఉండడం కూడా సమస్యగా మారింది.  దీనికి తోడు విద్యుత్, ఇంటర్‌‌నెట్‌‌ పనులు ఇంకా కొనసాగుతుండడం, పార్కింగ్‌‌ సౌకర్యం కూడా లేకపోవడంతో ఉద్యోగులు తిప్పులు పడుతున్నారు.

ఆరేళ్ల పాటు పనులు

ప్రభుత్వం సూర్యాపేట కొత్త కలెక్టరేట్‌‌లో 35 శాఖలు ఉండేలా డిజైన్‌‌ చేసి 2017లో పనులు మొదలు పెట్టింది.  ఆరేళ్ల పాటు పనులు చేసిన అధికారులు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇటీవల హడావుడిగా ఓపెనింగ్‌‌కు ఏర్పాట్లు చేశారు. దీంతో ఆగస్టు 20న రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌‌‌ కలెక్టరేట్‌‌ను ప్రారంభించారు. అన్ని ప్రభుత్వ శాఖలు కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లోనే ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో 46 శాఖలను కొత్త కలెక్టరేట్‌‌కు తీసుకొచ్చారు. అయితే ఆయా శాఖలకు సరిపడా గదులు లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కలెక్టరేట్ లోని మొదటి అంతస్తు  రూమ్ నెంబర్ 27లో డ్రగ్, హార్టికల్చర్, ఎస్సీ వెల్ఫేర్‌‌‌‌, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్‌‌‌‌, మైనారిటీ వెల్ఫేర్‌‌‌‌ శాఖలకు చెందిన ఆఫీసర్లకు,  సిబ్బందికి మరో చోట చాంబర్లను ఇచ్చారు.  అలాగే రెండవ అంతస్తులో రూమ్ నెంబర్ 1లో గ్రౌండ్ వాటర్, లేబర్, కో ఆపరేటివ్ డిపార్ట్‌‌మెంట్లకు కేటాయించారు. ఇదే ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 4లో ఫుడ్ ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌, తూనికలు కొలతలు, యూత్ వెల్ ఫేర్ శాఖలకు అలాట్ చేశారు. అంతే కాకుండా కొన్ని డిపార్ట్‌‌మెంట్లకు కేటాయించిన రూముల్లో సమాన్లు పట్టక పోవడంతో కలెక్టరేట్‌‌ బయటే ఉంచారు.

పార్కింగ్, తాగునీటి సమస్య

కలెక్టరేట్‌నిర్మాణం పూర్తయినా విద్యుత్, ఇంటర్‌ నెట్‌ పనులు పూర్తి కాలేదు. భవనం పారంభమైనప్పటి నుంచి ఒక్కో డిపార్ట్‌మెంట్‌ కొత్త కలెక్టరేట్‌లోకి షిఫ్ట్ అయినా.. విద్యుత్,  నెట్‌ సౌకర్యం లేక పోవడంతో ఆఫీసర్లు, సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. అంతేకాదు కలెక్టరేట్‌లో ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలకు  తాగునీటి సౌకర్యం లేదు.  మధ్యాహ్న భోజన సమయంలో  సిబ్బంది వాష్‌ చేసుకునేందుకు కూడా బాత్‌రూంలపై ఆధారపడాల్సి వస్తోంది. అలాగే పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా తమ వాహనాలను ఎండలోనే రోడ్డుపై పార్క్‌ చేయాల్సి వస్తోంది.