
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘టైగర్’ అన్న పేరును సొంతం చేసుకున్న ఏకైక నేత ఆలె నరేంద్ర. చిన్నతనం నుంచి దేశభక్తి, క్రమశిక్షణతో హైదరాబాద్ పాత నగరం నుంచి ఎదిగివచ్చిన నాయకుడు. ఆయన చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్ ప్రభావంతో హిందూత్వవాదాన్ని నరనరాన జీర్ణించుకున్న నేత. పాతబస్తీ రాజకీయాలు ఆయన కార్యక్షేత్రం అయినప్పటికీ హైదరాబాద్ నగరం మొత్తం ఆయన ప్రభావం ప్రబలంగా ఉండేది. దేశ రాజకీయాల్లో మోదీ ఎంతటి ఇమేజ్ సొంతం చేసుకున్నారో హైదరాబాద్ నగర రాజకీయాల్లో నరేంద్ర అంతటి ముద్ర వేసుకున్నారు. నరేంద్ర స్ఫూర్తితో నగర బీజేపీలో ఎంతోమంది నేతలు ఎదిగారు. బీజేపీ అంటే నరేంద్ర.. నరేంద్ర అంటే బీజేపీ అన్న స్థాయిలో ప్రచారం ఉనికిలో ఉండేది. గణేష్ ఉత్సవ సమితి వ్యవస్థాపక ముఖ్య నేతగా, ఈ రోజు హైదరాబాద్ వినాయక చవితి కేంద్రంగా మారింది అంటే ఆయన కృషి ఫలితమే. అయోధ్య రామమందిరం కోసం జరిగిన ఉద్యమంలో దక్షిణ భారతం నుంచి బలమైన గొంతుకని వినిపించిన అతి కొద్దిమంది నేతల్లో నరేంద్ర ప్రముఖుడు. కార్మిక నాయకుడిగా అనేక పోరాటాల్లో పాల్గొని, అనేక కోర్టు కేసులు ఎదుర్కొన్న పోరాట యోధుడు. 1997లో బీజేపీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తూ ‘ఒక్క ఓటు.. రెండు రాష్ట్రాలు’ కాకినాడ తీర్మానం చేయడం వెనుక నరేంద్ర కృషి మరువలేనిది. బీజేపీ నేతగా, కార్మిక నేతగా, తెలంగాణ ఉద్యమ నేతగా ఆయన జీవన యాత్ర మరువలేనిది.
కాకినాడ తీర్మానంలో కీలకపాత్ర
ఇస్త్రీ మడత చెడకుండా ఉద్యమంలో చొరబడి జాతిపితలుగా చెలామణిలో ఉన్న నేతలు.. 1997లో సమైక్య రాష్ట్ర ఆవశ్యకత, నాటి జోనల్ వ్యవస్థను అపహాస్యం చేస్తూ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న రోజులవి. అయితే, నరేంద్ర మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బీజేపీని ఒప్పించి, మెప్పించి ఒక ఓటు రెండు రాష్ట్రాలు 1997 కాకినాడ తీర్మానం చేసేలా కీలకపాత్ర పోషించిన గొప్ప నేత. అనంతరం కేంద్రంలోని వాజపేయి ప్రభుత్వం చత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పటికీ తెలంగాణను మాత్రం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి ఏర్పాటు చేయలేదు. నాటి బీజేపీ వైఖరిని తప్పు పట్టిన ఏకైక నేత ఆలె నరేంద్ర మాత్రమే. ఆయన మెదక్ ఎంపీగా1999 ఎన్నికలలో విజయం సాధించారు. కేంద్ర బీజేపీ పెద్దలు కాకినాడ తీర్మానం చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోవడంతో బీజేపీకి రాజీనామా చేసి తెలంగాణ సాధన సమితి ఉద్యమ సంస్థను ఏర్పాటు చేశారు. అనేక ప్రజాసంఘాలు, మేధావులతో తెలంగాణ సాధన సమితి పోరాటం అజరామరమైనది. 2001లో టీఆర్ఎస్ ఏర్పాటు కావడంతో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యతను బలపరుస్తూ తెలంగాణ మేధావులు ప్రొ.జయశంకర్ లాంటి మేధావుల ఒత్తిడి మేరకు తెలంగాణ రాష్ట్ర సమితిలో టీఎస్ఎస్ను విలీనం చేశారు.
బలమైన బీసీ నేతను దెబ్బతీశారు
కేసీఆర్ స్వయాన నరేంద్ర ఇంటికి వెళ్లి మరీ విలీన ప్రక్రియను పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో నెంబర్ టూగా ఉన్న ఆలే నరేంద్ర ఆ పార్టీలో కీలక బీసీ నేతగా ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో, టీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న నరేంద్ర ఇమేజ్ ను జీర్ణించుకోలేని కేసీఆర్ ఆయనపై అనేక కుట్రలు చేసి రాజకీయంగా దెబ్బతీశారు. ఆకర్షించు, ఉపయోగించుకో, వదిలేయి అన్న సిద్ధాంతాన్ని నరనరాన జీర్ణించుకున్న కేసీఆర్ నరేంద్రను రాజకీయంగా దెబ్బతీయాలని కుట్రపన్ని తప్పుడు కేసుల్లో ఇరికించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో బీసీ నుంచి ఎదిగి వచ్చిన ఆలె నరేంద్ర లాంటి సీనియర్ నేతను బలిపెట్టి తెలంగాణ బీసీ నాయకత్వాన్ని అణచివేసిన నేతలు తాజాగా బీసీ రాగం అందుకోవడం విడ్డూరం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను నమ్మిన పార్టీకి సైతం రాజీనామా చేసి ఉద్యమకారుల ఐక్యత కోసం తన పార్టీని మరో పార్టీలో విలీనం చేసిన త్యాగధనుడు ఆలె నరేంద్ర. ఆయన జీవం పోసిన గత ప్రభుత్వం ఆయన త్యాగాన్ని, చేసిన సహాయాన్ని మరచి బేయిమాన్అయింది. ఉద్యమకారులకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆయన త్యాగానికి గుర్తింపుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఆయన రాజకీయ జీవితం ఒక జాతీయవాదిగా, తెలంగాణవాదిగా సాగడం ఎవరూ మరువలేనిది.
- దొమ్మాట వెంకటేశ్,
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్