జ్ఞానజ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి

జ్ఞానజ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి

‘మనకున్నది ఒకే ఒక శత్రువు, ఆ శత్రువే అజ్ఞానం. విద్యావంతులమై ఆ శత్రువుని తుదముట్టించడమే మన లక్ష్యం’ అని  సావిత్రిబాయి ఫూలే  చేసిన వ్యాఖ్యలు విద్యకు ఆమె ఇచ్చిన  ప్రాముఖ్యతను తెలుపుతున్నాయి. సావిత్రిబాయి ఫూలే 1831వ సంవత్సరం జనవరి 3న మహారాష్ట్రలోని  సతారా  జిల్లా నయాగావ్ గ్రామంలో జన్మించారు.  ఆమెకు 9వ ఏటనే 14 సంవత్సరాలున్న జ్యోతిరావు ఫూలేతో వివాహమైంది.  జ్యోతిరావు ఫూలే అడుగుజాడల్లో నడిచి, సమసమాజ స్థాపన కోసం అనునిత్యం ప్రజలను చైతన్యం చేసిన వ్యక్తి సావిత్రిబాయి ఫూలే.  ఒక్క మాటలో చెప్పాలంటే భర్త జ్యోతిరావు ఫూలే వెలిగించిన జ్ఞానజ్యోతి  సావిత్రిబాయి. 

సమాజంలోని శూద్రులకు, అంటరానివాళ్లకు, స్త్రీలకు విద్యను అందించాలని ఏకైక లక్ష్యంతో  విద్యాసంస్థలు స్థాపించారు. ఇదే లక్ష్యంతో 1848లో జనవరి 14న పుణేలోని బుధవార్ పేటలో తాత్యా సాహెబ్ భీడే అనే బ్రాహ్మణుడి ఇంట్లో బాలికల పాఠ శాలను స్థాపించారు. పాఠశాల ప్రారంభించిన మొదట్లోనే అన్నపూర్ణ జోషి, సుమతి మోకాశి, దుర్గా దేశముఖ్, మాధవి దత్తే, సోనూ పవర్ అనే 6 మంది బాలికలు చేరారు. సావిత్రిబాయి పాఠశాలకి వచ్చినవారికి చదువు విలువచెప్పి వారిని చైతన్యవంతులను చేసింది.   స్త్రీల జీవితాలలో విప్లవాత్మకమైన చైతన్యం తీసుకువచ్చిన ధీశాలి సావిత్రిబాయి. 1848లో మొదటి పాఠశాల తెరిచాక 1851 సెప్టెంబర్ 18న పూణేలో రస్తాపేటలో  బాలికల కోసం మరో పాఠశాలను ప్రారంభించారు ఫూలే దంపతులు. దీనిని గమనించిన  ప్రజలు తమ పిల్లలను బడికి పంపడం మొదలుపెట్టారు. 

మహిళల్లో  చైతన్యం

సావిత్రిబాయి సమాజంలోని పురుష ఆధిపత్య వర్గాల నుంచి ప్రతిరోజు ఎన్నో విమర్శలు, దాడులను  ఎదుర్కొంటూనే  పాఠశాలకు వెళ్లి బోధనచేసి బాలికల్ని , మహిళలను  చైతన్యం చేసేది.  తన ఉపన్యాసాలతో  మహిళలను నిత్యం చైతన్యపరిచేది. 1852లో  ఆమె  ‘తిల్ గుడ్ సమారోత్సవ్’ (నువ్వులు బెల్లం సమావేశం) ఏర్పాటు చేసింది.  ఈ సమావేశంలో కులమత భేదాలు పాటించకుండా అందరినీ ఒకే వరుసలో సమావేశపరుస్తాం. ఒకే రీతిలో  పసుపు కుంకుమ పంచుతాం అని ఒక  ఆహ్వానపత్రిక అచ్చువేసి, మహిళలందరినీ ఆహ్వానించింది.  ఆనాటి పరిస్థితుల్లో ఈ ఆహ్వాన పత్రిక అందరిలోనూ విప్లవాత్మకమైన చర్చకు దారితీసింది. కుల మత భేదాలు లేని సమాజం గురించిన ఆలోచనలు ప్రజలు చేశారు. అంతే కాకుండా మహిళల స్థితిగతులు మార్చే ప్రక్రియలో భాగంగా మహిళా సేవా మండల్ స్థాపించి మహిళా సాధికారతకు ప్రయత్నం చేసింది. 

జయంతిని అధికారికంగా నిర్వహించాలి

1873లో భర్త జ్యోతిరావు ఫూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్​లో చురుకుగా పనిచేస్తూ, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, సతీసహగమనం అలాంటి సాంఘిక  దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసింది.  వితంతువులకు  పునర్వివాహం జరిపించింది. 1890లో భర్త జ్యోతిరావు ఫూలే మరణం తరువాత సత్యశోధక్ సమాజ్ పూర్తిస్థాయి  బాధ్యతలు చేప్పట్టి కార్యకర్తలకు,  అనుచరులకు మనోధైర్యాన్ని నింపింది. 1897లో  ప్లేగు వ్యాధి పుణే నగరాన్ని పట్టి పీడించింది. 66 ఏండ్ల వయసులో  దత్తపుత్రుడు యశ్వంత్​తో కలిసి ప్లేగు వ్యాధి సోకిన రోగులకు సేవ చేస్తూ మార్చి10న  ఆమె మరణించింది. తాను అనుకున్న లక్ష్యం కోసం చివరిశ్వాస వరకు  శ్రమించిన  సామాజిక పోరాట యోధురాలు సావిత్రిబాయి ఫూలే.  భవిష్యత్ తరాలకు నిరంతరం స్ఫూర్తినిచ్చే మార్గదర్శకురాలు సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని కోరుకుంటూ ఆమెకి నివాళి అర్పిద్దాం. 

-  డా. శివశంకర్ మఠం