
- ఇక నాన్ క్లినికల్ వ్యవస్థల నిర్వహణకు స్పెషల్ ఆఫీసర్లు
- క్లినికల్ సేవలకే పరిమితం కానున్న సూపరింటెండెంట్లు
- వంద బెడ్లకుపైగా ఉన్న ఆస్పత్రుల్లో అమలుకు కసరత్తు
- ప్రైవేట్ హాస్పిటళ్ల నిర్వహణపై స్టడీ చేసిన ప్రభుత్వ కమిటీ!
- ఇటీవలే ప్రభుత్వానికి అధ్యయన నివేదిక సమర్పణ
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులంటేనే అపరిశుభ్రతకు కేరాఫ్ అనే విమర్శలున్నాయి. అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నా..సరైన శానిటేషన్, సెక్యూరిటీ నిర్వహణ లేకపోవడంతో చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. ఈ సమస్యలపై ప్రభుత్వం ఇప్పుడు ఫోకస్ పెట్టింది. శానిటేషన్, సెక్యూరిటీ, డైట్, పార్కింగ్ తదితర నాన్ క్లినికల్ వ్యవస్థల నిర్వహణ కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో త్వరలో ప్రత్యేక వ్యవస్థను తీసుకురానుంది.
ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం కూడా నిర్వహించింది. ఇటీవలే ఆ కమిటీ ప్రభుత్వానికి రిపోర్టును సమర్పించినట్లు తెలుస్తుంది. త్వరలోనే జిల్లాల్లోని వంద పడకలకు పైగా ఉన్న హాస్పిటళ్లలో ఈ ప్రత్యేక వ్యవస్థను తీసుకురానున్నట్లు సమాచారం. ఇక ఆస్పత్రుల్లో నాన్ క్లినికల్ వ్యవస్థల పరంగా ఏ సమస్య ఉత్పన్నం అయినా... ఈ ప్రత్యేక వ్యవస్థే బాధ్యత వహించేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, గత ప్రభుత్వ హయాంలో ఆస్పత్రుల్లో అడ్మినిస్ట్రేషన్ నిర్వహణ ఆర్డీవోలకు అప్పగించారు. వేరే డిపార్ట్మెంట్ ఆఫీసర్ల పెత్తనం వైద్య, ఆరోగ్య డిపార్ట్ మెంట్ లో ఎందుకని అప్పట్లో పలువురు వ్యతిరేకించారు. దీంతో అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఉద్యోగులనే ప్రత్యేక అధికారులుగా నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన కమిటీ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆస్పత్రులకు బ్రాండింగ్ తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో శానిటేషన్ ఇతర వ్యవస్థలను ఏవిధంగా నిర్వహిస్తున్నారో తెలుసుకోవడానికి రెండు నెలల క్రితం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ ఢిల్లీ ఏయిమ్స్ తో పాటు, సిటీలోని పలు కార్పోరేట్ ఆసుత్రుల్లో నాన్ క్లినికల్ వ్యవస్థల నిర్వహణ, హైరార్కీ వ్యవస్థ ఎలా ఉందో స్టడీ చేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వానికి ఇటీవలే నివేదిక సమర్పించినట్లు తెలుస్తుంది. ఈ నివేదిక సూచించిన మార్పులను ప్రభుత్వం త్వరలోనే కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయనున్నది.
సూపరింటెండెంట్లు ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణ
గతంలో కామారెడ్డి, యాదాద్రి, హన్మకొండ, వరంగల్ ఎంజీఎం తదితర జిల్లా ఆసుపత్రుల్లో ఎలుకల స్వైర విహారం, పేషెంట్లను కరచిన ఘటనలు వెలుగుచూశాయి. బొద్దింకలు, ఈగలు, దోమలు... ఎన్నో సమస్యలు దర్శనమిచ్చాయి. ఇక గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ వంటి పెద్దాసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ సమస్య వర్ణనాతీతం. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు క్లినికల్, నాన్ క్లినికల్ వ్యవస్థల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.
ఈ రెండు వ్యవస్థలను తామే చూస్తుండటం వల్ల... ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అభిప్రాయాలు పలువురు సూపరింటెం డెంట్లు వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దీంతో వారిని క్లినికల్ నిర్వహణకే పరిమితం చేసి, సూప రింటెండెంట్ల ఆధ్వర్యంలోనే పనిచేసేలా నాన్ క్లినికల్ వ్యవస్థల నిర్వహణ కోసం స్పెషల్ ఆఫీసర్ వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఆసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ, పార్కింగ్ నిర్వహణ, డైట్ పరిశీలన, పేషెంట్ అటెండెంట్ల నిర్వహణ అంతా ఈ స్పెషల్ ఆఫీసర్ పరిధిలోకి రానుంది. ఈ విభాగాల్లో ఏ సమస్యా రాకుండా సూపరింటెండెంట్లు ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారు.