హ్యామ్ విధానంలో 12వేల కి.మీ. రోడ్లు.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఫేజ్లలో వేయాలని నిర్ణయం

హ్యామ్ విధానంలో 12వేల కి.మీ. రోడ్లు.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఫేజ్లలో వేయాలని నిర్ణయం
  • ఫస్ట్ ఫేజ్లో 4,600 కిలోమీటర్లు.. రెడీ అవుతున్న డీపీఆర్లు
  • రూ.15 వేల కోట్లు అవసరం.. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధుల సమీకరణ
  • టోల్పై ఎమ్మెల్యేల వ్యతిరేకతతో బడ్జెట్లోనే నిధుల కేటాయింపులు

హైదరాబాద్, వెలుగు: ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో 12 వేల కిలోమీటర్ల రోడ్లను హ్యామ్ విధానంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పనులను చేపట్టేందుకు డీపీఆర్ లు రెడీ అవుతున్నాయి. దాదాపు రూ.15 వేల కోట్లతో 30 నెలల నిర్మాణ సమయంతో 12 వేల కిలోమీటర్లు మూడు ఫేజ్​లలో నిర్మించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఫేజ్1లో 4,600 కిలో మీటర్లు నిర్మించనున్నారు. నిధులను సేకరించేందుకు కార్పొరేషన్ల ఏర్పాటు పైనా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఇందుకోసం రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.

వాస్తవానికి టోల్ విధానంలో నిధులను వసూలు చేయాలని భావించింది. అయితే ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం టోల్​పై వెనక్కి తగ్గింది. బడ్జెట్​లో కేటాయింపు, కార్పొరేషన్లతో నిధులు సమకూర్చుకోవడం ద్వారా హ్యామ్ విధానంలో రోడ్లను వేయాలని నిర్ణయించింది. అయితే భవిష్యత్​లో ఎప్పుడైనా టోల్​ వేసేలా మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలుస్తున్నది. దానికి అనుగుణంగా చెల్లింపుల్లో మార్పులు చేసే చాన్స్ ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు.

దశల వారీగా ఇలా..
ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కొత్తగా రెండు వరుసల రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. రాష్ట్ర రహదారులు, ముఖ్య జిల్లా రహదారులు, ఇతర జిల్లా రహదారుల విస్తరణ 10,550 కిలో మీటర్లు, మండల కేంద్రాల నుంచి జిల్లాల కేంద్రాలకు రెండు వరుసల రోడ్లు నిర్మాణం 1,054 కిలోమీటర్లు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్​కు ఫోర్ లేన్ రోడ్లు 820 కిలోమీటర్లు వేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మొదటి ఫేజ్​లో 4,600 కిలో మీటర్లు, రెండో ఫేజ్​లో 4,600 కిలో మీటర్లు, మూడో ఫేజ్​లో మరో 2,800 కిలో మీటర్లు నిర్మించనున్నారు.

హ్యామ్​లో చెల్లింపులు ఇలా
హ్యామ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఇచ్చేందుకు.. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి రూ.1,600 కోట్ల చొప్పున ఐదు ఈక్వల్ ఇన్ స్టాల్మెంట్లను చెల్లించాలనుకుంటున్నది. ఏడాది ఇన్ స్టాల్మెంట్స్ రూ.300–800 కోట్ల రూపాయలను 15 ఏండ్ల వరకు నిర్మాణ దశ పూర్తయిన తర్వాత ప్రతీ ఆరు నెలలకు ఒకసారి చెల్లించనున్నారు. హ్యామ్ కూడా బిల్డ్ ఆపరేట్ అండ్​ ట్రాన్స్ ఫర్ (బీవోటీ) మోడ్ లాంటిదేనని అధికారులు చెబుతున్నారు. 

40 శాతం నిధులను ప్రాజెక్ట్ లో 10%, 30%, 50%, 75%, 90% భౌతిక పురోగతిని సాధించినప్పుడు, ఒక్కొక్కసారి ఎనిమిది శాతం చొప్పున ఐదు సమాన ఇన్స్​స్టాల్మెంట్లుగా ఇచ్చేలా ఒప్పందాలు ఉంటాయి. ప్రభుత్వానికి ఓకే అయితే, ఒక్కొక్కసారి నాలుగు శాతం చొప్పున పది ఇన్​స్టాల్మెంట్లలో కూడా ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. ప్రాజెక్ట్ పూర్తయిన ఆరు నెలల తరువాత యాన్యుటీ చెల్లింపులు మొదలవుతాయని అధికారులు వెల్లడించారు.  

గతంలో జీహెచ్ఎంసీలో ఇదే విధానం
హ్యామ్ మోడ్ రోడ్లను 2016 నుంచి నేషనల్ హైవేస్​ అథారిటీ ఆఫ్ ​ఇండియా(ఎన్​హెచ్​ఏఐ) అమలు చేస్తున్నది. మహారాష్ట్ర, కర్నాటకతో పాటు మరో ఆరు రాష్ట్రాలు హ్యామ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో 40 శాతం ప్రభుత్వం ఈక్వల్ విధానంలో చెల్లిస్తుంది. మిగతా 60 శాతం కాంట్రాక్టు సంస్థ భరిస్తుంది. అయితే, కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం 15 ఏండ్ల కాలవ్యవధిలో ఆరు నెలలకు ఒకసారి చెల్లింపులు చేస్తుంది.

ఈ 15 ఏండ్ల కాలవ్యవధిలో కాంట్రాక్టు సంస్థ రోడ్డును మొయింటెన్ చేస్తుంది. హ్యామ్ విధానం పీపీపీ విధానం కాదని.. ఇది దానికి భిన్నమైన యాన్యూటీ మోడ్ అని అధికారులు చెబుతున్నారు. ఇందులో టోల్స్ అనేవి ఆప్షనల్ అని స్పష్టం చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో జీహెచ్ఎంసీ లో ఈ విధానాన్ని అనుసరించారు.