- కొత్తకొండ, పీవీస్మారకం, భద్రకాళి ఆలయం, త్రికూటాలయాన్ని కలిపి టూరిజం హబ్ చేస్తాం
- మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి, వెలుగు : కొత్తకొండ వీరభద్రస్వామి ఉత్సవాల కోసం ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పోలీస్, జిల్లా యంత్రాంగం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని, ఎక్కడైనా పొరపాట్లు జరిగితే భక్తులు క్షమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామిని మంత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గెస్ట్‌హౌజ్ వద్దకు వెళ్లగా.. అక్కడ ఆఫీసర్లు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో మంత్రి నేలపై కూర్చొని మాట్లాడారు. రైతులంతా పాడిపంటలు, ఆయురారోగ్యాలతో బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు.
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. కొత్తకొండ జాతరను మరింత విస్తృతం చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. కొత్తకొండ వీరభద్రస్వామి టెంపుల్, పీవీ స్మారకం, వరంగల్‌లోని భద్రకాళి ఆలయం, ముత్తారంలోని త్రికూటాలయాన్ని కలుపుకొని టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గుట్ట పైకి వెళ్లే మెట్ల మార్గాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
కొత్తకొండ మండల ఏర్పాటు ప్రపోజల్స్‌ను ప్రభుత్వానికి పంపామని, రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడిన టైంలో కొత్తకొండ మండలం కూడా ఏర్పడుతుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో దివంగత మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు స్వగ్రామం వంగరలో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు పాల్గొన్నారు.