నగర శివార్లలో 2 ఐటీ పార్కులు : మంత్రి శ్రీధర్​బాబు

నగర శివార్లలో 2 ఐటీ పార్కులు : మంత్రి శ్రీధర్​బాబు
  • పెట్టుబడులు పెట్టే సంస్థలకు భూ కేటాయింపులపై ప్రత్యేక పాలసీ: మంత్రి శ్రీధర్​బాబు
  • రాష్ట్రంలో డ్యూ సాఫ్ట్​వేర్​ సంస్థ రూ.వంద కోట్ల పెట్టుబడి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ శివార్లలో రెండు కొత్త ఐటీ పార్కులను ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు చెప్పారు. హైటెక్​ సిటీ తరహాలోనే ఈ రెండు ఐటీ పార్కులను నిర్మిస్తామని తెలిపారు. మంగళవారం సెక్రటేరియెట్​లో డ్యూ సాఫ్ట్​వేర్​ కంపెనీ ప్రతినిధులు, అలెరియా ఏఐ టెక్నీలజీ ప్రతినిధులు మంత్రి శ్రీధర్​ బాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రూ.వంద కోట్లతో పెట్టుబడులు పెడతామని డ్యూ సాఫ్ట్​వేర్​ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. 

ఈ సందర్భంగా శ్రీధర్​ బాబు మాట్లాడారు. ఐటీ పార్కులను ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలి.. ఏ ప్రాంతాల్లో నెలకొల్పాలి అన్న అంశాలపై అధికారులు స్టడీ చేస్తారని పేర్కొన్నారు. ‘‘ఈ పార్కుల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సాఫ్ట్ వేర్  కంపెనీలకు అవకాశం కల్పిస్తాం. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పరిశ్రమలకు భూకేటాయింపులపై ఇప్పటిదాకా ప్రత్యేక పాలసీ అంటూ ఏదీ లేదు. 

దీని వల్ల పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రత్యేక పాలసీని రూపొందించాలని నిర్ణయించాం. పెట్టుబడి, కల్పించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా భూమిని కేటాయిస్తాం’’ అని తెలిపారు. డ్యూ సంస్థకు అన్ని విధాలుగా సహకరిస్తామని, 900 మందికి ఈ సంస్థ ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. 

పన్నుల వసూలుకు అలెరియా ఏఐ 

రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వసూలు, ఇతర రాబడి మార్గాల్లో ఆదాయం నష్టపోకుండా చూసే ‘అలెరియా ఏఐ’ టెక్నాలజీ పనితీరు ఆసక్తికరంగా ఉందని శ్రీధర్​బాబు అన్నారు. ఆఫ్ లైన్​లో పనిచేసే ఈ టూల్ ను వివిధ శాఖలకు అనుసంధానిస్తే రాబడిలో నష్టపోతున్న 30 శాతాన్ని తిరిగి పొందవచ్చని సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు.  ఫ్రాన్స్, యూఏఈల్లో హెడ్​క్వార్టర్స్​ ఉన్న ఈ సంస్థ టెక్నాలజీని దేశంలో మార్కెట్ చేసేందుకు ఐబీటీ ఇన్నోవేషన్స్, ఇన్నోలాజిక్ టెక్నాలజీస్ అనుమతి పొందాయి.

ఉద్యోగుల రిటైర్​మెంట్​ వయస్సు పెంచే ఆలోచన లేదు

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్​మెంట్​ వయస్సును పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చామని, ఇప్పుడు వాటిని గ్రౌండ్​ ఎలా చేయాలనే దానిపై ఫోకస్​ పెట్టినట్టు తెలిపారు. మంగళవారం సెక్రటేరియెట్​లో మంత్రి శ్రీధర్​ బాబు మీడియాతో చిట్ చాట్​ చేశారు. ‘‘బీఆర్‌ఎస్‌ పదేండ్ల కాలంలో వచ్చిన పెట్టుబడుల కంటే ఈ ఒక్క ఏడాదిలో ఎక్కువే వచ్చాయి. ఈ పెట్టుబడులను గ్రౌండ్ చేయడానికి ఇప్పటికే వర్క్ మొదలు పెట్టాం. 

రాబోయే ఏడాదిపై  ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. భవిష్యత్తు అంతా ఏఐ, సైబర్ సెక్యూరిటీ పైనే.. దానిపై మేం ఫోకస్ పెట్టాం. గత బీఆర్‌ఎస్‌ ఐటీ పాలసీని మార్చి..  ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త ఐటీ పాలసీ తెస్తాం. ట్రిపుల్ ఆర్ చుట్టూ ఇండస్ట్రీలను విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఔట్ లుక్స్ మాల్స్ తరహాలో హైదరాబాద్ చుట్టూ మాల్స్ తెచ్చే యోచనలో ఉన్నం. 

గత ప్రభుత్వం లెక్క భవనాలు చూపించి అభివృద్ధి అని చెప్పం. అసలైన అభివృద్ధి ఏంటో రాబోయే ఐదేండ్లలో చూపిస్తం. ఫిబ్రవరి 7న ఐటీ, ఇండస్ట్రీ సెక్టార్​లో ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన ఉండబోతున్నది” అని వెల్లడించారు. కాగా, దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై శ్రీధర్​ బాబు ప్రశంసల వర్షం కురిపించారు.