
- రాష్ట్రంలో లెన్స్ కార్ట్ తయారీ ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్దది: మంత్రి శ్రీధర్ బాబు
- మరో రెండేండ్లలో ఉత్పత్తి ప్రారంభం.. నాలుగేండ్లలో పూర్తి స్థాయి ఆపరేషన్స్
- ప్లాంట్ ఏర్పాటుతో రూ.1,500 కోట్ల పెట్టుబడులు.. 2 వేల మందికి ఉద్యోగాలు
- తుక్కుగూడలో లెన్స్ కార్ట్ తయారీ ప్లాంట్‌కు శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కళ్లద్దాల తయారీ పరిశ్రమ లెన్స్ కార్ట్ ప్లాంట్ ఏర్పాటుతో తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం అవుతుందని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాజస్థాన్‌లో ఇప్పటికే ఆ సంస్థకు తయారీ ప్లాంట్ ఉన్నా.. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న ప్లాంట్ మాత్రం ప్రపంచంలోనే అతిపెద్దదని, ఇక్కడ తయారయ్యే కళ్లద్దాలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయని ఆయన తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని తుక్కుగూడలో లెన్స్ కార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌కు ఆయన శంకుస్థాపన చేసి, మాట్లాడారు. రూ.1,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న లెన్స్ కార్ట్ ప్లాంట్‌తో 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. గతేడాది డిసెంబర్8న రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు విషయంలో ఆ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు.
అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటవుతున్న ఈ ప్లాంట్ తెలంగాణకే తలమానికమవుతుందని చెప్పారు. లెన్స్ కార్ట్ సంస్థకు తుక్కుగూడ సమీపంలోని రావిర్యాలలో 50 ఎకరాల స్థలాన్ని కేటాయించామని, రెండేండ్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని, నాలుగేండ్లలో పూర్తిగా కార్యకలాపాలు మొదలవుతాయని ఆయన తెలిపారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు జపాన్, సింగపూర్, థాయ్‌లాండ్, తైవాన్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, మలేసియా, వియత్నం, యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలకు ఎగుమతి అవుతాయని వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తూ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఆర్ అండ్ డీ సెంటర్ పెట్టండి..
రాష్ట్రంలో సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గురువారం మినిస్టర్ క్వార్టర్స్‌లో ఎన్‌ఎక్స్‌పీ సెమీ కండక్టర్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌లోని స్టార్టప్‌లు, యూనివర్సిటీలు, రీసెర్చ్ సంస్థలతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఏఐ సిటీలో భాగస్వాములు కావాలని కోరారు.
త్వరలో బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తం
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ఓడించేందుకు బీజేపీ.. బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన రంజాన్ గిఫ్ట్ వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు స్పందిస్తూ.. త్వరలోనే బీజేపీకి తాము కూడా మరో గిఫ్ట్ ఇస్తామన్నారు.