
- ఏప్రిల్ మొదటి వారంలో పైలెట్ ప్రాజెక్ట్: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ తో పాటు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురాబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. దీంతో ప్రజలకు సమర్థవంతంగా, సులువుగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. ప్రస్తుతం ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కు కనీసం 45 నిముషాల నుంచి గంటకు పైగా సమయం పడుతున్నదని, ఈ స్లాట్ బుకింగ్ విధానం ద్వారా 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు.
దీన్ని ఏప్రిల్ మొదటివారంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుచేయబోతున్నామని వెల్లడించారు. సోమవారం సెక్రటేరియెట్‌లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిషేధిత జాబితాలో ఉన్న గజం స్థలం రిజిస్ట్రేషన్ చేసినా కఠిన చర్యలు తప్పవని సబ్ రిజిస్ట్రార్లను హెచ్చరించారు. భూ భారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను ఏర్పాటు చేసి, నిషేధిత ఆస్తుల వివరాలను అందులో పొందుపరచి రెవెన్యూశాఖకు అనుసంధానం చేయాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.