
- 30న వాహన సారథి వెబ్‌సైట్‌లోకి తెలంగాణ
- సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రారంభించనున్న మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేంద్రీకృత పోర్టల్ ‘‘వాహన్ సారథి’’లోకి ఈ నెల 30న తెలంగాణ చేరనున్నది. సికింద్రాబాద్ తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వాహన్ సారథి పోర్టల్ రాష్ట్రవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన రిజిస్ట్రేషన్‌లను సులభతరం చేయడంతో పాటు ఆర్టీఓ కార్యకలాపాలను ఆటోమేట్ చేస్తుంది. ఇందులో పర్మిట్‌లు, పన్నులు, డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్‌లు వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ పోర్టల్ తో అనుసంధానమైనా..గత బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా మన రాష్ట్రం దూరంగా ఉండిపోయింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ప్రభుత్వం ఈ జాతీయ పోర్టల్ లో చేరాలని నిర్ణయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ సమాచార కేంద్రం ( నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ) ద్వారా ఇటు వాహనాలకు, అటు డ్రైవింగ్ లైసెన్స్ లకు సంబంధించిన అన్ని రకాల వివరాలన్నింటిని ఈ పోర్టల్ నమోదు చేసుకుంటుంది. దేశంలోని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వాహన రిజిస్ట్రేషన్ బదిలీ, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, అడ్రస్ మార్పు వంటివి చేసుకునే అవకాశం ఉంటుంది.