
- ఆర్టీసీ సిబ్బందిని డ్రైవర్లుగా అనుమతించే విషయంపై స్పష్టత ఇవ్వని కేంద్రం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని రోడ్లపై త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి. ఇందులో భాగంగానే పీఎంఈ డ్రైవ్ పథకం కింద రాష్ట్రానికి 2,800 ఈవీ బస్సులను అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఆరు నెలల క్రితం కేంద్రాన్ని అభ్యర్థించింది. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఇటీవలే ఆమోదముద్ర వేసింది. తెలంగాణకు కోరినన్ని ఈవీ బస్సులను 30 శాతం సబ్సిడీపై అందించేందుకు సిద్ధమైంది.
అన్ని బస్సులకు సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని కూడా విడుదల చేసింది. ఈవీ బస్సుల వినియోగంతో ఆర్టీసీ డ్రైవర్లకు ఉపాధి పోతుందని సంస్థ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈవీ బస్సులలో ప్రైవేట్ సంస్థకు చెందిన వారు కాకుండా ఆర్టీసీ సిబ్బందిని డ్రైవర్లుగా కొనసాగించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అయితే దీనిపై కేంద్రం ఇంకా రాష్ట్రానికి స్పష్టత ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం ఈవీ బస్సులను ఆర్టీసీకి అద్దెకిచ్చే సంస్థ నుంచే డ్రైవర్లు ఉంటారు. దీంతో రేవంత్ చేసిన వినతికి కేంద్రం నుంచి రాష్ట్రానికి వెసులుబాటు లభించకపోవచ్చని అంటున్నారు.