ఫార్ములా రేస్​తో సంబంధం ఉన్నోళ్లందరికీ నోటీసులు ఇస్తం : భట్టి

ఫార్ములా రేస్​తో సంబంధం ఉన్నోళ్లందరికీ నోటీసులు ఇస్తం : భట్టి

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా–ఈ రేస్​ అక్రమాలతో సంబంధం ఉన్నోళ్లందరికీ నోటీసులు ఇస్తామని, ఇందులో మాజీ మంత్రి ప్రమేయం ఉంటే ఆయనకూ నోటీసులు పంపిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఈవెంట్​కు సంబంధించిన పేమెంట్ బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా జరిగిందని, దీనిపై న్యాయ విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫిబ్రవరిలో నిర్వహించాలనుకున్న ఈ ఈవెంట్ కోసం గతంలో ఉన్న ట్రై పార్టీ అగ్రిమెంట్​ను కాదని, ఎన్నికల కోడ్ ఉన్న టైమ్ లో బై పార్టీ అగ్రిమెంట్  ఎలా చేశారని ప్రశ్నించారు. 


 మంగళవారం సెక్రటేరియెట్ లోని మీడియా సెంటర్​లో భట్టి మీడియాతో మాట్లాడారు. ఫార్ములా–ఈ రేస్​తో రాష్ట్రానికి నష్టమే తప్ప, ఎలాంటి ఆదాయం రాలేదని ఆయన తెలిపారు. గత పాలకులు వారి కోరికలు తీర్చుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, గత పదేండ్లు రాష్ట్రాన్ని వారి అవసరాల కోసం వాడుకున్నారని మండిపడ్డారు. కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వాడుకున్నారని ఫైర్ అయ్యారు. ‘‘ఫార్ములా–ఈ రేస్ ను రద్దు చేయడం వల్ల హైదరాబాద్ ఇమేజ్ తగ్గిందంటూ మాజీ మంత్రి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టిన వాళ్లు ఈ మాటలు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఈ రేస్​వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కలిగిన ప్రయోజనం, వచ్చిన ఆదాయం గురించి చెప్పకుండా నష్టం జరిగిందని గగ్గోలు పెట్టడం సరికాదు” అని అన్నారు. ఫార్ములా–ఈ రేస్ టిక్కెట్లు అమ్ముకుని అగ్రిమెంట్ నుంచి వైదొలిగిన నెక్ట్స్ జెన్ సంస్థ ఎవరిదని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నారనేది తర్వాత చెబుతామన్నారు. ‘‘రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం.. ఎవరికీ తలవంచం. రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన సొత్తును ఎవరికీ ధారాదత్తం చేయనివ్వం. ఈ రేస్ అగ్రి మెంట్, నిధుల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై న్యాయపరంగా ముందుకెళ్తాం” అని చెప్పారు. సంపద సృష్టించి, ప్రజలకు పంచుతామన్నారు. 

110 కోట్లకు ఒప్పందం..

ఈ ఈవెంట్ కు రూ.110 కోట్లతో ఒప్పందం చేసుకున్నారని.. ఆ డబ్బులు ప్రభుత్వం చెల్లించి, అనుమతులు ఇప్పించాలని ఒప్పందంలో ఉందని భట్టి తెలిపారు. ఇందులో ఇప్పటికే రూ.55 కోట్లు చెల్లించారని, మిగతా రూ.55 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి నోటీసులు వచ్చాయని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిజినెస్​రూల్స్​కు విరుద్ధంగా చేసిందని, రాష్ట్ర వనరులను తాకట్టు పెట్టిందని విమర్శించారు. ఈ రేస్ ట్రాక్​ కోసం రూ.20 కోట్లు ఖర్చు చేశారని, హైదరాబాద్​రేసింగ్ లిమిటెడ్ రూ.35 కోట్లు ఖర్చు పెట్టిందని పేర్కొన్నారు. 

‘ప్రజాపాలన’ అప్లికేషన్లపై ఆందోళన అక్కర్లే..

కాంగ్రెస్ వాళ్లు హామీలు అమలు చేయకపోతే బాగుండని బీఆర్ఎస్ వాళ్లు అనుకుంటున్నారని భట్టి అన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు మళ్లీ అసత్య ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాపాలన సభలు అద్భుతంగా జరిగాయని, ప్రభుత్వం స్వీకరించిన అప్లికేషన్ల విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని చెప్పారు. ‘‘దళితులకు మూడెకరాల భూమి,  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు అదనంగా ఆయకట్టు.. బీఆర్ఎస్ ఇలా ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ పదేండ్లు అధికారంలో ఉండి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కానీ నెల రోజులు కూడా కాకుండానే మా ప్రభుత్వంపై బీఆర్ఎస్ వాళ్లు విమర్శలు చేస్తుంటే జనం నవ్వుతున్నారు” అని అన్నారు. విడతల వారీగా రైతుబంధు డబ్బులు రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నామన్నారు. ప్రజాభవన్ లో ఎవరైనా తనను ప్రతి రోజు ఉదయం 8:30 గంటల నుంచి 9:30  గంటల వరకు కలవొచ్చునని తెలిపారు.

సోలార్ సిస్టమ్స్ పెట్టుకుంటే.. రాయితీలు ఇస్తం

రెసిడెన్షియల్, కమర్షియల్ ఆఫీస్ బిల్డింగ్​లపై సోలార్ సిస్టం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్​మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ రెడ్కో) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై సెక్రటేరియెట్​లో రివ్యూ చేపట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. సోలార్ ప్యానెల్స్​తో సొంతంగా సిస్టమ్‌‌ ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు. కిలో వాట్ నుంచి మూడు కిలో వాట్​ల దాకా కిలో వాట్ కు రూ.18 వేల చొప్పున సబ్సిడీ ఇస్తామని తెలిపారు. మూడు కిలో వాట్‌‌ నుంచి పది కిలో వాట్ ల వరకు కిలో వాట్ కు రూ.9వేల చొప్పున రాయితీ ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి గృహ వినియోగదారులకు ఈ పథకంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సొంతంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహించాలని సూచించారు. భవిష్యత్తులో కరెంట్ కొరత రాకుండా ఉండేందుకు సోలార్ విద్యుత్ ను పెద్ద మొత్తంలో వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రివ్యూ మీటింగ్​లో విద్యుత్ శాఖ సెక్రటరీ ఎస్‌‌ఏఎం రిజ్వీ తో పాటు టీఎస్ రెడ్కో అధికారులు పాల్గొన్నారు.