నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ ఐటీ టవర్ ద్వారా ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ ఇస్తామని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా అన్నారు. గురువారం నల్గొండలోని ఐటీ టవర్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ టవర్ చాలా బాగుందన్నారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు.
ఇందుకోసం ఉద్యోగులను 20 బ్యాచ్ లుగా విభజించి శిక్షణ ఇవ్వాలన్నారు. ఐటీ టవర్ లో 500 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో జపాన్ కు చెందిన ఒక కంపెనీ తన కార్యకలాపాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐటీ టవర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారి వెంట జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, ఐటీ టవర్ మేనేజర్ నాగరాజు, ఆర్డీవో అశోక్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.