- గతంలో రూ. 100కు పైగా పలికిన కిలో టమాట.. ప్రస్తుతం రూ. 5 లోపే...
- జనాల వద్దకు వచ్చే సరికి రూ. 15కు పెరుగుతున్న రేటు
- భారీగా లాభపడుతున్న వ్యాపారులు.. పెట్టుబడులూ రావడం లేదంటున్న రైతులు
వరంగల్, వెలుగు : ఆరేడు నెలల కింద రూ. 100కు పైగా పలికి రైతులకు కాసులు కురిపించిన టమాటా ప్రస్తుతం నష్టాలను చూపిస్తోంది. ఈ సీజన్‌లో ఎక్కువ విస్తీర్ణంలో టమాటా సాగు చేయడంతో దిగుబడి పెరిగింది. దీంతో రేటు అమాంతం పడిపోయింది. ప్రస్తుతం కిలో టమాట రూ. 10 నుంచి రూ. 15 మధ్యే పలుకోంది. దీంతో కూలీ, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు నష్టాలను భరించలేక టమాటలు తెంపకుండా మొక్కలపైనే వదిలేస్తున్నారు.
25 కిలోల పెట్టెకు రూ. 100 మాత్రమే...
గతేడాది జూన్, జులై నెలల్లో కిలో టమాట రూ.100 నుంచి రూ. 140 వరకు పలికింది. దీంతో 25 కిలోల బరువు ఉంటే టమాట పెట్టెకు వ్యాపారులు రూ.2 వేల వరకు చెల్లించారు.
ఆపై వర్షాకాలం పంట చేతికి రావడంతో రేటు క్రమేపీ తగ్గుతూ పెట్టె ధర రూ.1500లకు వచ్చింది. ఏడాది చివర్లో రూ.వెయ్యి వరకు పలికింది. ప్రస్తుతం రేటు మరింత పడిపోవడంతో 25 కిలోల టమాట పెట్టెకు వ్యాపారులు కేవలం రూ.100 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో కిలో టమాట నాలుగు రూపాయలే పడుతోంది.
జనాలకు చేరే సరికి రూ. 15 అవుతున్న రేటు
రైతుల వద్ద 25 కిలోల టమాట పెట్టెను రూ. 100కు కొనుగోలు చేసిన వ్యాపారులు గంటల వ్యవధిలోనే హోల్‌సేల్ కస్టమర్లకు రూ. 220 చొప్పున అమ్ముతున్నారు. అదే చిల్లర ధర అయితే రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‍కు టమాట తీసుకొచ్చిన రైతులకు 25 కిలోల పెట్టెకు రూ. 100 చెల్లించిన వ్యాపారులు వెంటనే 10 కిలోలను రూ. 100కు అమ్మేశారు.
ఇలా 25 కిలోలకు రూ. 250 వసూలు చేశారు. ఈ టమాటను తీసుకెళ్తున్న లోకల్ వ్యాపారులు కిలో రూ. 15 చొప్పున జనాలకు అమ్ముతున్నారు. టమాట పండించిన రైతుకు కిలోకు రూ. 3 నుంచి రూ. 4 గిట్టుబాటు అవుతుండగా.. జనాలకు చేరే సరికి రేటు రూ. 15 అవుతోంది. వ్యాపారులు మాత్రం భారీ స్థాయిలో లాభపడుతున్నారు.
టమాట తెంపట్లే.. మార్కెట్‍కు తేవట్లే
ఒక్క ఎకరంలో టమాట సాగు చేసేందుకు రైతులు రూ. 30 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాల్లోనే టన్నుల కొద్దీ లోకల్ టమాట మార్కెట్లకు వస్తోంది. దీంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ప్రస్తుతం వస్తున్న రేటుతో ఎకరంలో పండిన పంటకు రైతులకు రూ. 20 వేలు మాత్రమే గిట్టుబాటు అవుతుంది. ఈ లెక్కన ఎకరానికి రూ. 10 వేల వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. దీంతో రైతులు టమాటను తెంపడమే మానేశారు.
దీంతో మార్కెట్‍కు వస్తున్న టమాట క్రమేపీ తగ్గుతోంది. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‍కు గడిచిన వారంలో ప్రతిరోజు సుమారు 60 నుంచి 70 క్వింటాళ్ల టమాట వచ్చింది. గిట్టుబాటు ధర దక్కట్లేదన్న బాధతో రైతులు టమాట తీసుకురావడం మానేశారు. దీంతో గురువారం మార్కెట్‌కు 44 క్వింటాళ్ల టమాట రాగా, శుక్రవారం కేవలం 20 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది.
దిగుబడి పెరగడంతో ధరలు తగ్గినయ్
ఆరేడు నెలల కిందట ఇదే మార్కెట్‌లో కిలో టమాట రూ. 120 చొప్పున అమ్మిన. ఇప్పుడు దిగుబడి ఎక్కువగా రావడంతో ధరలు తగ్గాయి. దీంతో హోల్‌సేల్ రేటు కిలో 10 చొప్పున అమ్ముతున్నా. మా దగ్గర తీసుకువెళ్తున్న చిన్న చిన్న వ్యాపారులు బయట కిలో టమాట రూ.15కు అమ్ముతున్నారు.– దేవేంద్ర, మహిళా వ్యాపారి, బాలసముద్రం మార్కెట్, హనుమకొండ
కూలీ, ఆటో చార్జీలు కూడా వస్తలేవు
టమాట ఏరినప్పుడల్లా ఒక్కో ఎకరానికి 10 నుంచి 15 పెట్టెలు వస్తాయి. మార్కెట్‌లో పెట్టెకు రూ. 100 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో కూలీ ఖర్చులు, ఆటో చార్జీలు కూడా రావడం లేదు. దీంతో టమాట ఏరకుండా అలాగే వదిలేసిన.– రాజమల్లు, రాయపర్తి, వరంగల్