
సిజేరియన్లు మనదగ్గర్నే ఎక్కువ
రాష్ట్రంలో 60.7 శాతం పెద్దాపరేషన్లే .. సర్కార్ దవాఖాన్లలోనూ పెరిగినయ్
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో వెల్లడి
41.7 శాతంతో ఏపీ సెకండ్
హైదరాబాద్, వెలుగు: దేశంలో సిజేరియన్ ఆపరేషన్లు మన రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతున్నయ్. రాష్ట్రంలో జరుగుతున్న డెలివరీల్లో 60.7 %మందికి పెద్దాపరేషన్లు చేస్తున్నారు. మన తరువాతి ప్లేస్‌లో 41.7 శాతంతో ఏపీ నిలిచింది. దేశవ్యాప్తంగా చేసిన ఐదో రౌండ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో ఈ మేరకు వెల్లడైంది. సర్వే వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. మన రాష్ట్రంలో 2015–16 నాటికి సిజేరియన్ డెలివరీలు 57.7%, 2019–20 నాటికి అది 60.7 శాతానికి పెరిగిందని సర్వేలో తేలింది. అప్పట్లో ప్రభుత్వ దవాఖాన్లలో 40.3 శాతం సిజేరియన్లు చేయగా, ఇప్పుడది 44.5 శాతానికి పెరిగింది. ఇక ప్రైవేట్ లోనూ సిజేరియన్లు 74.5 శాతం నుంచి 81.5 శాతానికి పెరిగినట్లు సర్వేలో వెల్లడైంది. రాష్ర్టంలోని రూరల్ ఏరియాల్లో (58.4 శాతం) కంటే అర్బన్ ఏరియాల్లోనే (64.3 శాతం) సిజేరియన్ల శాతం ఎక్కువగా ఉంది. మరోవైపు ప్రభుత్వ దవాఖాన్లలో డెలివరీ చేయించుకున్నా.. కనీసం రూ.3,846 ఖర్చు చేయాల్సి వస్తోందని సర్వేలో తేలింది. రాష్ర్టంలో సిజేరియన్ డెలివరీలను తగ్గించి, నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలన్న ఉద్దేశంతో సర్కార్ 2017లో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించింది. అప్పట్లో మొత్తం డెలివరీల్లో కేవలం 30.5 శాతం మాత్రమే ప్రభుత్వ దవాఖాన్లలో జరిగితే, ఇప్పుడు అది 49.7 శాతానికి పెరిగింది. కానీ సిజేరియన్లను తగ్గించాలన్న ప్రభుత్వ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. మన రాష్ట్రంలో 57.4 శాతం మంది మగవాళ్లు ఇంటర్నెట్ (కనీసం ఒక్కసారైనా) వినియోగిస్తుండగా, 26.5 శాతం మంది మహిళలు మాత్రమే వినియోగిస్తున్నట్టు సర్వే పేర్కొంది.
‘నార్మల్’ కోసం కేంద్రం ఇన్సెంటివ్
తెలంగాణలో సిజేరియన్ డెలివరీలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని గతంలోనే కేంద్రం సూచించింది. ఇందుకోసం నిధులు కూడా కేటాయిస్తోంది. ఈ నిధులతోనే ‘మిడ్ వైఫరీ’ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభించింది. ఇందులో భాగంగా కొంతమంది నర్సులను ఎంపిక చేసుకుని లేబర్ రూమ్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. లండన్, సౌతాఫ్రికా వంటి దేశాల నుంచి నిపుణులను పిలిపించి నార్మల్ డెలివరీలు చేయడంలో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఇప్పటివరకూ 30 మందికి 18 నెలలపాటు శిక్షణ ఇచ్చారు. ఒక్కో హాస్పిటల్లో ముగ్గురు చొప్పున వివిధ జిల్లాల్లోని పది హాస్పిటళ్లలో వీరికి పోస్టింగులు ఇచ్చారు. మరో 60 మందికి ట్రైనింగ్ కొనసాగుతోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ బ్యాచ్ ట్రైనింగ్ ముగియనుంది. వీరితో పాటు మరో 1,400 మందికి ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. 2022 నాటికి ట్రైనింగ్ ముగించి, అన్ని హాస్పిటళ్లలో వీరిని నియమించాలని టార్గెట్ పెట్టుకున్నారు. నార్మల్ డెలివరీలకు కృషి చేస్తున్న నర్సులకు కేంద్రం స్పెషల్గా నెలకు రూ.15 వేల ఇన్సెంటివ్స్ కూడా అందజేస్తోంది.
ఆగని భ్రూణ హత్యలు!
రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. గత ఐదేండ్లలో ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు, 894 మంది ఆడపిల్లలు మాత్రమే పుట్టినట్టు సర్వేలో తేలింది. స్కానింగ్ సెంటర్లపై దాడులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తున్నా… వాటిని వినియోగించుకోవడంలో, భ్రూణ హత్యలను నిరోధించడంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ విఫలమవుతోంది. మరోవైపు ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నట్టు సర్వే వెల్లడించింది. సర్వే కోసం కలిసిన ప్రతి వంద మందిలో (19 ఏండ్లలోపు) ఆరుగురు(5.8శాతం) తాము ప్రెగ్నెంట్ లేదా బాలింతలమని చెప్పారు. దీన్ని బట్టి బాల్య వివాహాలు జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది.
For More News..