బెస్ట్ పోలీసింగ్‌‌లో తెలంగాణ టాప్‌‌.. స్టేట్ పోలీస్ శాఖకు నెంబర్ వన్ ర్యాంక్‌‌

బెస్ట్ పోలీసింగ్‌‌లో తెలంగాణ టాప్‌‌.. స్టేట్ పోలీస్ శాఖకు నెంబర్ వన్ ర్యాంక్‌‌
  • రాష్ట్రంలో మహిళా పోలీసులు 8.7%, మహిళా అధికారులు 7.6%
  • 6.44 పాయింట్లతో రెండో స్థానంలో ఏపీ పోలీస్  
  • ఇండియా జస్టిస్‌‌ రిపోర్ట్‌‌–2025 ర్యాంకింగ్స్‌‌ విడుదల 


హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర పోలీస్ శాఖకు మరో అరు దైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో అత్యుత్తమ పోలీసింగ్‌ నిర్వహిస్తున్న కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ నంబర్‌ వన్‌ స్థానం కైవసం చేసుకుంది. ఇండియా జస్టిస్ రిపోర్ట్–2025 ర్యాంకింగ్స్​లో 10 పాయింట్లకు గాను 6.48 పాయింట్లతో టాప్ ప్లేస్ సాధించింది. ఏపీ 6.44 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, 3.36 పాయింట్లతో వెస్ట్ బెంగాల్‌ చివరి స్థానంలో నిలిచింది. 

ఈ మేరకు ఆయా రాష్ట్రాల పోలీస్ శాఖలకు ర్యాంకింగ్స్ కేటాయించిన ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌ –2025 మంగళవారం విడుదలైంది. పోలీస్‌, న్యా యవ్యవస్థ, జైళ్లశాఖ, లీగల్‌ ఎయిడ్‌ సహా మొత్తం 32 అంశాలకు సంబంధించి10 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన తెలంగాణ, ఏపీ సహా18 పెద్ద రాష్ట్రాలు, 10 మిలియన్ల లోపు జనాభా గల సిక్కిం సహా 7 చిన్న రాష్ట్రాల్లో సర్వే చేసి ర్యాంకింగ్స్ విడుదల చేశారు. 

ఓవరాల్​గా థర్డ్ ర్యాంక్.. 

ఆయా రాష్ట్రాల్లో పోలీసింగ్​కు సంబంధించి ఉత్తమ, మధ్యంతర, ప్రతిభ లేని కేటగిరీల వారీగా ర్యాంకులను ప్రకటించారు. గరిష్టంగా 10 పాయింట్ల స్కోరింగ్‌ ప్రాతిపదికన ర్యాంకింగ్స్‌ ఇచ్చారు. ఇందులో రాష్ట్ర పోలీసులు 6.48 పాయింట్ల స్కోరింగ్‌తో దేశంలో టాప్‌ వన్‌ పోలీస్‌గా ర్యాంకింగ్‌ పొందారు. పోలీసిం గ్‌లో తెలంగాణ తొలిస్థానాన్ని దక్కించుకోగా.. పోలీ స్‌, న్యాయవ్యవస్థ, జైళ్లశాఖ, లీగల్‌ ఎయిడ్‌ అంశాల్లో కలిపి ఓవరాల్ గా చూస్తే.. జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచింది. 

అన్ని విభాగాల్లో కలిపి గత నివేదికలో11వ స్థానంలో నిలువగా ఈ ఏడాది 3వ స్థానానికి చేరింది. కాగా, జాతీయ స్థాయిలో ప్రతి లక్ష మందికి 155 మంది పోలీసులు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. ఇక తెలంగాణ పోలీస్‌ శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య 8.7 శాతం కాగా, మహిళా అధికారు ల సంఖ్య 7.6 శాతంగా వెల్లడించింది.   

జైళ్లలో ఖైదీల సంఖ్య 50 శాతం పెరిగింది 

దశాబ్దకాలంగా దేశవ్యాప్తంగా జైళ్లలో ఖైదీల సంఖ్య 50 శాతం పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. ఇందు లో అండర్‌ ట్రయల్‌ ఖైదీల సంఖ్య గతంతో పోలిస్తే 66 శాతం నుంచి 76 శాతానికి చేరినట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల బడ్జెట్‌లలో క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టంకు ఇస్తున్న​ కేటాయింపుల్లో అత్యధికంగా జీతభత్యాలు కాగా, మౌలిక వసతుల కేటాయింపునకు అతి తక్కువగా ఖర్చు చేస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. జాతీయ స్థాయిలో పోలీస్‌ శాఖలో మహిళల సంఖ్య 8 శాతం మాత్రమే ఉన్నట్టు తెలిపింది. 


పోలీసింగ్‌లో టాప్‌ 5 రాష్ట్రాలు ఇవే.. 

రాష్ట్రం         స్కోర్‌‌       ర్యాంక్‌    

తెలంగాణ        6.48         1
ఆంధ్రప్రదేశ్‌    6.44         2
కర్నాటక           6.19         3
చత్తీస్‌గఢ్‌          6.02         4
మహారాష్ట్ర         5.61         5