సోయా కొనుగోళ్లలో తెలంగాణ టాప్​

  • కేంద్రం ఇచ్చిన టార్గెట్​లో 73 శాతం కొనుగోళ్లు
  • మార్క్​ఫెడ్ ద్వారా 43 వేల టన్నులపైనే సేకరణ
  • రైతులకు రూ.138.16 కోట్ల చెల్లింపులు

హైదరాబాద్, వెలుగు: సోయా పంట కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ టాప్​లో నిలిచింది. రాష్ట్రంలో మార్క్​ఫెడ్..​ నోడల్​ ఏజెన్సీగా సోయా పంట కొనుగోళ్లు చేస్తున్నది. ఈయేడు వానాకాలం సీజన్​లో 4.01 లక్షల ఎకరాల్లో సోయా సాగైంది. రాష్ట్రవ్యాప్తంగా మార్క్​ఫెడ్​ 7 జిల్లాల్లో 42 కొనుగోలు సెంటర్ల ద్వారా సోయా పంటను సేకరిస్తోంది. గురువారం నాటికి 25,675 మంది రైతుల నుంచి సెంట్రల్​ పూల్​ కింద ఇప్పటి వరకు 43,755.50 టన్నుల సోయాను సేకరించింది. దీని కోసం మద్దతు ధర క్వింటాల్​ రూ.4,892 చొప్పున రూ.214.05 కోట్ల విలువైన సోయాచిక్కుడును సేకరించింది. రైతులకు రూ.138.16 కోట్లు చెల్లించింది.

అత్యధికంగా ఆదిలాబాద్​ జిల్లాలో 10 సెంటర్లు  ఓపెన్​ చేసి 22,292.70 టన్నుల సోయా కొనుగోళ్లు చేసింది. తరువాత నిర్మల్​ జిల్లాలో 11కొనుగోలు సెంటర్లలో 11,567.40 టన్నుల సోయా కొనుగోళ్లు చేసింది. నిజామాబాద్​ జిల్లాలో 10 కొనుగోలు సెంటర్లలో 4,103.40 టన్నులు, కామారెడ్డి జిల్లాలో 7 సెంటర్లలో 3,891.80 టన్నులు, సంగారెడ్డి జిల్లాలో 5 సెంటర్లలో 1800.85 టన్నుల సోయాచిక్కుడును సేకరించింది. తక్కువ గడువులోనే 43,755.50 టన్నుల సోయా సేకరించామని మార్క్​ఫెడ్​ ఎండీ శ్రీనివాస్​రెడ్డి తెలిపారు.

Also Read : ఫుడ్ పాయిజన్ జరగకుండా కలెక్టర్లతో కమిటీలు వేస్తం

ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ టాప్

రాష్ట్రంలో సాగైన సోయా పంటలో 2.38 లక్షల టన్నుల సోయాబీన్​ దిగుబడి అంచనాల్లో  25 శాతం (59,508 టన్నులు) సేకరించాలని టార్గెట్​ పెట్టగా ఇప్పటికే 43,755.50 టన్నుల సేకరణ జరింది. ఇచ్చిన టార్గెట్​లో 73.52 శాతం పూర్తిచేసి  దేశంలోనే తెలంగాణ టాప్​లో నిలిచింది. మధ్యప్రదేశ్​లో వచ్చిన 52.85 లక్షల దిగుబడిలో 25 శాతం చొప్పున 13.68 లక్షల టన్నులు సేకరించాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్​ పెట్టగా 2 శాతమే సేకరించారు.

మహారాష్ట్రలో సాగైన సోయాలో 56.33 లక్షల దిగుబడి అంచనాల్లో 14.13 లక్షల టన్నులు (25 శాతం) టార్గెట్​ విధించగా 1.03 శాతం మాత్రమే సేకరించారు. రాజస్థాన్ లో 11.77 లక్షల టన్నుల దిగుబడి అంచనాల్లో 25 శాతం సేకరించాలని నాఫెడ్​ టార్గెట్​ పెట్టగా 0.48శాతం మాత్రమే సేకరించింది.  గుజరాత్​లో  4.56 లక్షల దిగుబడి అంచనాల్లో 25 శాతం సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 0.15 శాతమే సేకరణ జరిగింది.