World Tourism Day 2024 : తెలంగాణ గడ్డపై అద్భుత పర్యాటక ప్రాంతాలు ఇవే

World Tourism Day 2024 : తెలంగాణ గడ్డపై అద్భుత పర్యాటక ప్రాంతాలు ఇవే

సెప్టెంబర్​ 27.. వరల్డ్​ టూరిజం డే ( ప్రపంచ పర్యాటక దినోత్సవం) . టూరిస్టులు ఆనందంగా గడుతపుతారు.  ప్రతీయేటా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని వేర్వేరు థీమ్‌లతో నిర్వహిస్తుంటారు.  ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పర్యాటకులు ఉత్సాహంగా జరుపుకుంటారు.  దగ్గర్లోని పర్యాటక ప్రదేశానికి వెళ్లి ఎంజాయి చేస్తారు.  ఈ సందర్భంగా తెలంగాణ గడ్డపై.. మంచిర్యాల జిల్లాలో ఉన్న గాంధారీ ఖిల్లా విశేషాలపై ఓ లుక్కేద్దాం. . 

చుట్టూ కొండలుకొండలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రాగాలు, ఎన్నో పురాతన కట్టడాలు.. అన్నీ ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? గాంధారి ఖిల్లాకి వెళితే ఈ దృశ్యాన్ని చూచొచ్చు. ప్రకృతి అందాలకు పెట్టింది.  పేరు ఈ చోటు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివార్ల నుంచి దట్టమైన అటవీ ప్రాంతానికి వెళితే గాంధారీ ఖిల్లాతో పాటు ఇంకెన్నో ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. 

ఇక్కడ అబ్బురపరిచే కట్టడాలెన్నో...1200 ఏళ్ల క్రితం కాకతీయులు, పద్మనాయక రాజులు నిర్మించిన గాంధారి ఖిల్లా.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. ఎన్నో అబ్బురపరిచే కట్టడాలు, నిర్మాణాలతో కళా నైపుణ్యానికి నిదర్శనంగా ఉంది . .300 మీటర్ల ఎత్తయిన గుట్టపై నిర్మించిన కోటలో అనేక కళారూపాలు, శిల్పసంపద, విగ్రహాలు, ఆలయాలను చూడొచ్చు. అద్భుతమైన శిల్ప సౌందర్యం కనిపిస్తుంది. ఎత్తయిన గుట్టపైన ఉన్న కోటకు వెళ్లేందుకు ఉన్న మెట్లు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.

ఎత్తయిన ఖిల్లాలో నాయక్​ పోడ్ గిరిజన ఆరాధ్య దైవం గాంధారీ మైసమ్మ తల్లి కొలువై ఉంది. ఆలయానికి వెళ్లే మార్గంలో రాజుల ఇళ్లలో పనిచేసే దాసీల ఇళ్లు, అప్పట్లో రాజుల ఆయుధాలు దాచిన ఆనవాళ్లున్నాయి. గాంధారీ మైసమ్మ, కాల భైరవుడు, శివుడు, సదర్ల భీమన్న, విఘ్నేశ్వరుడు, పది అడుగుల ఎత్తైన ఆంజనేయుడు, భీముని పాదాలు, భోగం గుళ్లు, ఏకశిలా నాగశేషుడు, ఏనుగుల విగ్రహాలున్నాయి.

ఏకశిలా నాగశేషుని విగ్రహం

గాంధారీ ఖిల్లాపై కొండపైభాగంలో బండను తొలచి నిర్మించిన నాగశేషుడి ఆలయం ఉంది. ఎనిమిది అడుగుల ఎత్తుతో 12పడగల ఏకశిలా నాగశేషుడి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని మలిచిన తీరు అద్భుతం. ఆలయానికి ఎదురుగా అప్పటి రాజుల శిలా శాసనం కనిపిస్తుంది. మరో ఆలయం పైభాగంలో భారీ ఆకారంలో మూడు బావులున్నాయి.

ఎలా చేరుకోవాలి?

మంచిర్యాల మందమర్రి జాతీయ రహదారిలోని బొక్కలగుట్ట ఊరి బస్టాఫ్​లో  దిగి మూడు కిలోమీటర్లు నడిస్తే గాంధారి ఖిల్లా వస్తుంది.
వీటిని 'సవతుల బావులు' అని ఈ ప్రాంతప్రజలు  పిలుస్తుంటారు. వేసవి కాలంలో కూడా ఇందులో నీళ్లు ఎండిపోవు. కింది భాగంలో మరో బావి ఉంది. శిథిలావస్థకు చేరిన కోట భాగంలో అప్పటి చరిత్రకు ఆనవాళ్లుగా ఆ రాజులు వాడినట్లు చెబుతున్న. వస్తువులెన్నో కనిపిస్తాయి.

ప్రకృతి అందాల కనువిందు

దట్టమైన అడవిలోని కొండ లోయల ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గుట్టపై కొలువున్న గాంధారీ మైసమ్మ తల్లిని దర్శించుకునేందుకు వెళ్లే మార్గంలో నడవడం గొప్ప అనుభూతినిస్తుంది. మూడు కిలోమీటర్ల పొడవున ఎత్తయిన కొండపై నడవాల్సిందే. ఒకవైపు గుట్టలు.. మరోవైపు ఎత్తయిన లోయ. ఈ మార్గంలో అప్పటి రాజులు నిర్మించిన శిథిలావస్థకు చేరుకున్న మెట్లు... అంతా ఒక అద్భుతమైన దృశ్యం.ఖిల్లా కింది భాగంలోని గుట్ట మధ్య జలాశయం. ఉంది. చుట్టూ ప్రకృతి అందాల నడుమ నిండు కుండలా నీటితో కళకళలాడుతూ ఉంటుంది. గుట్టలమధ్యలోంచి ఊరే నీళ్లు టూరిస్టుల దాహాన్ని కూడా తీరుస్తున్నాయి.

ట్రెక్కింగ్ కు సూపర్
గాంధారీ ఖిల్లాపై చాలామంది ట్రెక్కింగ్​ కు  వెళ్తుంటారు. ఎత్తయిన ఏకశిల కొండలు ఇందుకు అనుకూలంగా ఉన్నాయి. పలు ప్రాంతాల నుంచే వచ్చే టూరిస్టులు పెద్దసంఖ్యలో  ట్రెక్కింగ్ చేస్తుంటారు.  ప్రకృతి రమణీయతకు నిలయమైన గాంధారి ఖిల్లా, గాంధార్ వనంలో సినిమా షూటింగ్​లు  కూడా జోరుగానే జరిగాయి. 

గాంధారీ వనం అర్బన్ పార్క్

గాంధారి ఖిల్లాకు వెళ్లే మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన గాంధారీవనం అర్బన్ పార్క్ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటోంది. మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి మందమర్రికి వెళ్లే జాతీయ రహదారిలోని బొక్కలగుట్ట బస్టాప్ వద్ద నేచురల్ ఫారెస్టీ ప్రాంతంలో 'గాంధారీ వనం' నిర్మించారు. సుమారు 400 ఎకరాల రిజర్వు ప్రాంతాన్ని పార్కుగా మార్చారు. జాతీయ రహదారికి ఇరువైపుల వనాన్ని ఏర్పాటు చేశారు. పిల్లల పార్కు, 'జింకల కేంద్రం" ఉన్నాయి. పర్యాటకులు సేదతీరేందుకు పిల్లల పార్కును అటవీశాఖ ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతం పర్యాటకుల విందు, వినోదాలతో నిత్యం పార్కు రద్దీగా ఉంటుంది. వనంలో మరోవైపు నేచురల్ ఫారెస్ట్ లో వేలాది జాతుల మొక్కలు, చెట్లతో నర్సరీ, స్మృతివనం, రాశివనం, నక్షత్రవనం, ఔషధవనం, యోగా కేంద్రం, రాష్ట్రీయ చిహ్నం జింక, పాలపిట్ట. జమ్మి ఆకారంలో పార్కు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సరస్సులో బోటు విహారం చేసే వీలుంది. మూడు కిలోమీటర్ల పొడవు వాకర్స్ ట్రాక్ ఉంది. వనం ఆవరణలోనే గాంధారీ మైసమ్మ ఆలయం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. గాంధార్ వసం దాటి బొక్కలగుట్టకు వెళ్తే రుష్యమూక పర్వతంపై వెంకటేశ్వరస్వామి ఆలయం దర్శనమిస్తుంది..

--–వెలుగు, లైఫ్​..