రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో దాడులు నిర్వహిస్తున్నది. డ్రగ్స్ సప్లై చేస్తూ పట్టుబడిన పాత నేరస్తులపై నిఘా పెంచడం, పీడీ యాక్టులు నమోదు చేసి జైలుకు పంపడంతోపాటు వరుస సోదాలతో డ్రగ్ వినియోగదారులు, పెడ్లర్లలో వణుకు పుట్టిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలై, ఎన్నికలు ముగిసే నాటికి రాష్ట్రంలో వివిధ చోట్ల రూ.29.31 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు జనవరి 21న శంషాబాద్ ఎయిర్ పోర్టులో జాంబియాకు చెందిన లూసాకా నుంచి రూ. 41 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత ఫిబ్రవరిలో హైదరాబాద్ పంజాగుట్టలో నైజీరియన్ వద్ద రూ. 8 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. మార్చి నెలలో ఐడీఏ బొల్లారం ప్రాంతంలో నిషేధిత డ్రగ్స్‌తయారు చేస్తున్న పరిశ్రమపై డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు దాడులు నిర్వహించి.. రూ.9 కోట్ల విలువైన 90 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 2023 డిసెంబర్ 31న హైదరాబాద్‌లో బ్రౌన్ షుగర్ డ్రగ్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 100 గ్రాముల ఎండీఎంఏతో పాటు 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్టూడెంట్లను అరెస్ట్ చేశారు. ఈ నెల 1న రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం కాటేదాన్ లో ఓ గోదాంలో 1.60 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.