
ఇంటికి దీపం ఇల్లాలు. ఇల్లాలు వెలుగుతోనే ఆ కుటుంబం అన్నిరంగాల్లో అభివృద్ధిపథంలో పయనిస్తుంది. ఈ విషయాన్ని నమ్మిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు అన్నివిధాల ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి పథకం మహిళల పేరు మీద ఇచ్చేందుకు రూపకల్పన చేస్తోంది. ఇప్పటికే మహిళా సంఘాలకు రూ.2 లక్షల రూపాయల వరకు రుణ బీమా, రూ.10 లక్షలవరకు ప్రమాద బీమా పథకాలను ప్రవేశపెట్టింది.
మహిళా సంఘం సభ్యురాలు దురదృష్టవశాత్తు మరణిస్తే.. ఆమె పేరున ఉన్న రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే.. వారికి రూ.10 లక్షల వరకు బీమాను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఈ ఏడాదికాలంలో రుణ బీమా కింద మొత్తం 2276 మంది సభ్యులకు రూ.20.24 కోట్లను చెల్లించింది. ప్రమాద బీమా కింద 192 మందికి రూ.19.18 కోట్లు ప్రజాప్రభుత్వం చెల్లించింది. ఇప్పటివరకు మొత్తం రూ.40 కోట్లు చెల్లించింది.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 17 రకాల వ్యాపారాలను గుర్తించి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తోంది. సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళలకు అప్పగించింది. పొరుగు రాష్ట్రం ఏపీలో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ఆదాని కంపెనీకి కట్టబెడితే.. తెలంగాణ రాష్ట్రంలో 1000 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ విద్యుత్ ప్లాంట్లను 'ఆమెకే' (మహిళకు) కట్టబెడుతోంది. పెట్రోల్ బంకులను మహిళా సంఘాల చేత ప్రారంభింపచేస్తోంది. మహిళా సంఘాలకు రిటైల్ ఫిష్ వెహికిల్స్ ను జిల్లాకొకటి పంపిణీ చేసింది.
మహిళలకు వడ్డీ లేని రుణాలు
మహిళలకు సెర్ప్ ద్వారా రూ.21,466 కోట్ల వడ్డీ లేని రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించడం జరిగింది. ఈ ఐదేళ్లలో లక్ష కోట్ల బ్యాంకు రుణాలను అందిస్తోంది. వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మహిళలకు స్త్రీనిధి ద్వారా రూ.2022 కోట్ల లోన్లు ఇప్పించి వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. 150 ఆర్టీసీ అద్దె బస్సులను మొదటి విడతలో మహిళా సంఘాలకు అప్పగించింది.
మరో 450 బస్సులను మహిళా సంఘాలకు కేటాయించేలా ఒప్పందాలు జరుగుతున్నాయి. 22 జిల్లా మహిళా సమాఖ్యలకు ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మిస్తోంది. ఒక్కో భవనానికి రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.110 కోట్లు మంజూరు చేసింది. స్వయం సహాయక బృందాల మహిళా సభ్యులకు స్కూల్ యూనిఫాం కుట్టు పనులు అప్పగించింది. యూనిఫాంల కుట్టు చార్జీలను జతకు రూ.50 రూపాయల నుంచి రూ.75 రూపాయలకు పెంచింది. స్కూల్ పిల్లలకు పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాంలు అందించిన చరిత్ర ప్రజా ప్రభుత్వానికి దక్కింది. స్కూల్ యూనిఫాం కుట్టు పనులతో మహిళా సంఘాలకు రూ.80 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది.
శిల్పారామంలో మహిళా శక్తి బజార్
శిల్పారామంలో రూ.9 కోట్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేసింది. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్
కాంప్లెక్సులు, టూరిస్ట్ ప్లేస్ ల్లో 100 వరకు మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. పాలనకు గుండెలాంటి రాష్ట్ర సచివాలయంలో కూడా రెండు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. మహిళలు ఆత్మగౌరవంతో తలెత్తుకునేవిధంగా ముందుకు వెళుతోంది. 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు రెండు చీరలు ఇవ్వబోతోంది. ఇది తెలంగాణ చరిత్రలో మొదటిసారి కావడం విశేషం.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది. తద్వారా ఇప్పటికే రూ. 5 వేల కోట్లను ఆర్టీసికి చెల్లించింది. ఉపాధి కూలీల కోసం ఉద్దేశించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను మహిళ బ్యాంకు ఖాతాల్లోనే వేస్తోంది. ఇందిరమ్మ ఇళ్లకు ఇటుకలు సప్లై చేసే కాంట్రాక్టులను కూడా పొదుపు మహిళలకే కట్టబెట్టబోతోంది. అంతేకాకుండా ఇటుక తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ఒక్కొక్క సంఘానికి రూ.6 లక్షల నుంచి 20 లక్షల వరకు బ్యాంక్ లోన్
సౌకర్యం కూడా కల్పిస్తోంది.
దేశానికి ఆదర్శంగా తెలంగాణ మహిళలు
వరికి బోనస్‌ను ఇస్తూ గత ప్రభుత్వం హయాంలో మహిళా సంఘాల ద్వారా చేసిన ధాన్యం సేకరణ బకాయిలను కూడా చెల్లిస్తూ.. ఇంకా మెరుగ్గా అన్ని వసతులతో ధాన్యం సేకరణ సెంటర్లను కొనసాగిస్తోంది. ఇలా అనేక పథకాలను మహిళల పేరిట ప్రజా ప్రభుత్వం ఇస్తోంది. ఇంకా భవిష్యత్‌లో చేపట్టబోయే పథకాలను కూడా మంత్రి సీతక్క ఆధ్వర్యంలో మహిళల పేరు మీద ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. మహిళలకు ఆర్థిక బాధ్యతలు అప్పగిస్తే కుటుంబాన్ని సక్రమంగా నడుపుతుంది.
దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా రాష్ట్ర ఆదాయం పెరిగి అభివృద్ధి వైపు పరుగులు పెట్టే అవకాశం ఉంది అని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. దీంతో ఆ దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణలో మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు.
దేశానికి ఆదర్శంగా నిలిచేవిధంగా ముందుకు సాగుతున్నారు. మొత్తంమీద ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ మహిళలు ఆర్థిక స్వాలంబన దిశగా వేగంగా పయనిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహిళలను మహారాణులుగా ఎదిగేందుకు చేయూతనిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మహిళల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
- ఇందిరా
శోభన్ పోశాల,
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు