ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్ శుక్రవారం(ఫిబ్రవరి 15)తో ముగియనుంది. ఈ గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన విషయం తెలిసిందే. మొదట జనవరి 10ని ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్‌కు చివరి తేదీగా నిర్ణయించగా.. ఆ తరువాత జనవరి 31 వరకు, మరోసారి ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. ఆ గడువు నేటితో ముగియనుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ట్రాఫిక్ చలాన్ డిస్కౌంట్ ఆఫర్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆయా వాహనాలను బట్టి 50 నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించడంతో.. వాహనదారులు పోటెత్తారు. తొలి వారంలోనే భారీ సంఖ్యలో పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయి.
ట్రాఫిక్ చలాన్లపై తగ్గింపులు ఇవే..
ట్రాఫిక్ చలాన్లపై కేటగిరీల వారీగా తగ్గింపులు ఉన్నాయి.
- ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 20 శాతం చలాన్ చెల్లిస్తే మిగిలిన 80 శాతం మాఫీ అవుతుంది.
- పుష్ కార్ట్‌లు మరియు చిన్న వ్యాపారులు (39బి కేసులు), ట్రాఫిక్ చలాన్‌లో 10 శాతం చెల్లిస్తే మిగిలిన 90 శాతం మాఫీ అవుతుంది.
- తేలికపాటి మోటారు వాహనాలు (LMVలు), కార్లు, జీపులు మరియు భారీ వాహనాలకు 40 శాతం చెల్లిస్తే మిగిలిన 60 శాతం మాఫీ అవుతుంది.
- రోడ్డు రవాణా సంస్థ (ఆర్‌టీసీ) డ్రైవర్లకు, ట్రాఫిక్ చలాన్‌లో 10 శాతం చెల్లిస్తే మిగిలిన 90 శాతం మాఫీ అవుతుంది.