- ఇటీవలి వేలంలో రూ.55 లక్షల ఆదాయం
- రూ.11.11 లక్షలు వెచ్చించినంబర్ కొన్న పారిశ్రామికవేత్త
- కారు ఖర్చుకు అదనంగా 15 నుంచి20 శాతం ఫ్యాన్సీ నంబర్ కోసమే
హైదరాబాద్, వెలుగు: రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లు కాసుల పంట పండిస్తున్నాయి. సాధారణంగా ఒక సిరీస్ ముగియగానే ఇంకో సిరీస్ ప్రారంభమయ్యే సమయంలో ఆ సిరీస్ లోని ఫ్యాన్సీ నంబర్ల కోసం సెలబ్రిటీలు పోటీపడుతుంటారు. తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ ఉంటే తమకు కలిసి వస్తుందని, దాన్ని తమకు లక్కీ నంబర్ గా భావిస్తారు. అందుకోసం ఎన్ని లక్షలు ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఒక్కో ఫ్యాన్సీ నంబర్ కు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చుచేసి వేలంలో దక్కించుకున్న సంఘటనలు అనేకం.
ఇది రవాణా శాఖపై కాసుల వర్షం కురిపిస్తోంది. వాహనం ఖరీదు ధరతో పోలిస్తే అదనంగా కనీసం 15 నుంచి 20 శాతం వరకు ఫ్యాన్సీ నంబర్ మీదే ఖర్చుచేస్తున్నారు. ఇటీవల ఖైరతాబాద్ రవాణా శాఖలో జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఒక పారిశ్రామికవేత్త తన రూ.80 లక్షల కారుకు రూ.11 లక్షలు ఖర్చుచేసి ఫ్యాన్సీ నంబర్ ను దక్కించుకున్నాడు. రవాణా శాఖకు ఒక సంవత్సరంలో సమకూరే ఆదాయంలో 20 శాతం ఫ్యాన్సీ నంబర్ల ద్వారానే వస్తోందని అధికారులు తెలిపారు. ఆ శాఖకు అత్యధికంగా సమకూరే ఆదాయంలో మొదటి వరసలో లైఫ్ ట్యాక్స్ ఉండగా, తర్వాతి స్థానం ఫ్యాన్సీ నంబర్లదే.
ఖైరతాబాద్ జోన్ నంబర్ వన్
హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లోని కొన్ని ఆర్టీఏ ఆఫీసుల్లో ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతోంది. అందులో ఖైరతాబాద్ ఆర్టీఏ జోన్ రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంది. దీని పరిధిలో అత్యంత సంపన్నులు, సెలబ్రిటీలు నివాసం ఉండే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలు ఉండడంతో రవాణా శాఖకు కాసుల పంట పండుతోంది. 3 రోజుల క్రితం ఆర్టీఏ ఆఫీసులో ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహించగా రూ.55 లక్షల ఆదాయం సమకూరింది. ఇందులో అత్యధికంగా 0001 నంబర్ ను ఓ పారిశ్రామికవేత్త రూ.11,11,111 చెల్లించి దక్కించుకున్నారు. ఖైరతాబాద్ తర్వాత కొండాపూర్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం ఆర్టీఏ ఆఫీసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇతర జిల్లాల్లో ఫ్యాన్సీ నంబర్లకు అంతగా డిమాండ్ ఉండడం లేదు.