జగిత్యాల... ఈ పేరు వినగానే రైతాంగ పోరాటం గుర్తుకొస్తుంది. కవులు, కళాకారులకు విలయమైన ఈ జిల్లాలో చరిత్రకు సాక్ష్యంగా నిలిచే కట్టడాలు, దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే ఒకప్పటి తెలుగాణలోని పకడ్బంది కోటల్లో ఒకటిగా పేరొందిన జగిత్యాల కోటని చూడొచ్చు. రాముడి నమ్మిన బంటు అంజనేయుడు కొలువైన కొండగట్టు ఈ జిల్లాలోనే ఉంది. అంతేకాదు. మనదేశంలోనే రెండోదైన పంచముఖ లింగేశ్వరుడిగా శివుడు పూజలందుకునే గుడిని చూడాలంటే జగిత్యాలకు వెళ్లాల్సింది.
తెలంగాణలోని పురాతన దేవాలయాల్లో "కేశవర్ధన పంచముఖ లింగేశ్వర ఆలయం" ఒకటి మూడుగుళ్లు మధ్యలో లింగేశ్వర స్వామి కుడివైపు సూర్యనారాయణ స్వామి ఎడమవైపు కేశవనాథ స్వామి గుడి ఉంటుంది.
మూడు గుళ్లు ఉన్నాయి గనుకనే త్రికుట అంటారు. ఇది రాయికల్ మండలంలో ఉంది. రాళ్లతో కట్టిన ఈ గుడిని గుడికోట అని కూడా విలుస్తారు. 13వ శతాబ్దంలో కాకతీయులు ఈ ఆలయాన్ని కట్టించారని చరిత్ర చెబుతోంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వరము శివుడు 'పంచముఖ లింగేశ్వరస్వామిగా పూజలందుకుంటాడు. మనదేశంలో వారణాసి తర్వాత ఐదు ముఖాలున్న శివాలయంగా ఈ గుడి పేరుగాంచింది. మూడు గోపురాలతో ఉన్న గుడిలో నంది విగ్రహం ఉంటుంది.
ద్విముఖ ఆంజనేయుడు
కొండగట్టు గుడికి ఐదొందల ఏండ్ల చరిత్ర ఉంది. ఇక్కడ ఆంజనేయుడు స్వయంభువుగా వెలిసినట్టు చెప్తారు. ఈ గుడి వెనక ఒక కథ ప్రచారంలో ఉంది. మాల్యాల మండలం ముత్యంపేట గ్రామ శివారులో ఉంది ఈ దేవాలయం. ముత్యంపేటకు చెందిన సింగం సంజీవుడు అనే పశువుల కాపరికి ఆంజనేయుడు కలలో కనిపించి తప్పిపోయిన నీ ఆవు ఫలానా చోట ఉంది. నాకు గుడి కట్టించు అని చెప్పాడట. దాంతో సంజీవుడు ఈ గుడి కట్టించాడని చెప్తారు. ఈ గుడిలో ఆంజేయుడు రెండు ముఖాలతో కనిపిస్తాడు. ఈ ఆలయంలో హనుమాన్ జయంతిని ఈ ఏడాదిలో రెండు సార్లు నిర్వహిస్తారు. అంతేకాదు హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులు దీక్ష విరమించేందుకు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వెళ్తారు.
20 ఎకరాల్లో..
ఇక్కడి కోటను జగిత్యాల ఖిల్లా అంటారు. చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోన్న ఈ కోటని టాల్ జాక్ అనే ఫ్రెంచ్ ఇంజినీర్లు పదిహేడో శతాబ్ధంలో కట్టించారు. సున్నపురాయితో కట్టిన ఈ కోట నిర్మాణంలో యూరోపియన్ శిల్పకళ ఆనవాళ్లు కనిపిస్తాయి. అప్పట్లో ఈ కోటలో సైనికులు ఉండేవాళ్లట. అంతేకాదు శత్రువులెవరూ ఈజీగా చొరబడకుండా కోట చుట్టూ లోతైన కందకాలు తవ్వించారు. నక్షత్రం ఆకారంలో ఉండే ఈ కోట దాదాపు 20 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఒకప్పుడు ఇందులో 90 ఫిరంగులు, కొయ్యతో చేసిన పెద్ద గేటు ఉండేవి. కోట లోపల మందుగుండు సామగ్రిని దాచిపెట్టడానికి కట్టిన రహస్య గదుల్ని చూడొచ్చు. కోటలో మంచినీళ్లకోసం తప్పించిన బావిలో ఇప్పటికీ నీళ్లున్నాయి. ఒకప్పుడు సైనికస్థావరంగా ఉన్న ఈ కోట ఇప్పుడు బాగా పాడైపోయింది.
ALSO READ :బొజ్జ గణపయ్యకు కొత్త ముస్తాబు
ఇలా వెళ్లాలి
హైదరాబాద్ నుంచి 162 కిలోమీటర్ల దూరంలో ఉంది జగిత్యాల. హైదరాబాద్ నుంచి మంచిర్యాల హైవే మీదుగా 175 కిలోమీటర్లు జర్నీ చేస్తే కొండగట్టు వస్తుంది. రాయికల్ మండలంలోని పంచముఖ లింగేశ్వర గుడికి వెళ్లాలంటే జగిత్యాల నుంచి 16 కిలోమీటర్ల జర్నీ చేయాలి.