అడవి గొంతు మోగుతుంది

తరతరాల వారసత్వ కళలను నిలబెట్టేందుకు తెలంగాణ రచయితల వేదిక తొలి అడుగు వేస్తోంది. సాహిత్యాన్ని, సమాజాన్ని రెండు కళ్లుగా భావించే ఈ వేదిక తనతో కలిసొచ్చే అడుగుల ఆలంబనతో రాష్ట్ర వాస్తవిక చిత్ర పటాన్ని జనం ముందు ఆవిష్కరిస్తోంది. ఇందులో భాగంగా ‘మూలధ్వని’ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేసింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో రేపు, ఎల్లుండి ‘ఆదివాసీ, జానపద సంగీత వాద్యాల ప్రదర్శన, కచేరి’ ఏర్పాటు చేసింది.

మూలధ్వని చేపట్టిన సంగీత సమారోహం విలక్షణమైంది. గతంలో ఎన్నడూ జరగని విశేష ప్రదర్శనగా దీని గురించి చెప్పుకోవచ్చు. కనుమరుగవుతున్న ఆదివాసీ, జానపద సంగీత పరికరాలను, వాటిని పలికించే కళాకారులను వెలుగులోకి తెచ్చే ప్రయత్నిమిది. ఎంతో శ్రమ పడి, తెలంగాణరాష్ట్రం నలుమూలల్లో ఉన్న 66 రకాల ప్రాచీన సంగీత వాద్యాలను గుర్తించి, సేకరించారు. వాద్యాల సేకరణ అంటే వాద్యకారుల జీవన దైన్యాన్ని కళ్లారా చూడటమే. ఆలనాపాలనా లేని ఈ వాద్యాలు.. అతీగతీలేని వాద్యకారుల బతుకులు పెళ్లలు పెళ్లలుగా కూలిపోతున్న మన సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు కడతాయి. వాద్యాలు మిగిలి న చోట వాద్యకారులు అంతరించిపోవటం మరో విషాదం. తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యం లో మూలధ్వని బాధ్యులు సేకరించిన ఈ 66 వాద్యాల్లో 52 పరికరాలను తొలిసారి గా ఒకే వేదికపై ప్రదర్శించనున్నారు . ఈ అపూర్వ సమ్మేళనానికి ఉస్మానియా యూనివర్సి టీలోని ఠాగూర్ ఆడిటోరియం ఆతిథ్యమిస్తోంది.

ఈ నెల 17, 18 తేదీల్లో (ఆదివారం, సోమవారం) రోజంతా వీటి ప్రదర్శన, వాద్యగానం ఉంటాయి. సంగీత పరికరాల మధ్య జుగల్ బందీ నిర్వహిస్తారు. వేర్వేరు వాద్యాలు కలిసి ఒకే రాగాన్ని పలికించే వినూత్న ప్రయోగం జరగబోతోంది. ‘మూలధ్వని’ సేకరించిన సంగీత పరికరాల్లో చర్మ వాద్యాలు, ఊదే వాద్యాలు, తంత్రి వాద్యాలు, ఘన వాద్యాలు ఇలా భిన్నమైనవి ఎన్నో ఉన్నాయి. బుర్ర వీణ, గిరి జన కిన్నెర, కడ్డీ వాద్యం, తితి వాద్యం, పంబ, రుంజ తదితర పేర్లతో పిలిచే వాద్యాలు అపురూప శబ్దాలతో శ్రోతలను సరికొత్త అనుభూతికి లోను చేస్తాయి. డోలు, తుడుం, కిన్నెర, సన్నాయి. కోలికోర, వెట్టి, కనక డప్పు, కిక్రి, గుమ్మోల.. ప్రతి వాద్యమూ గిరి జనులు సొంత నైపుణ్యంతో తయారుచేసిందే. అడవిలోని చెట్లు, పుట్టల్లోంచి సేకరించిన సామగ్రితో రూపకల్పన చేసిందే. సంగీత కోర్సులు చదివే విద్యార్థులు, పరిశోధకులు ఇప్పటికే ఈ ‘మూలధ్వని’కి చేరువయ్యారు. వారికితో డు గోండు లిపి అధ్యయన వేదిక, సంఘటిత వేదిక తెలంగాణ రచయితల వేదికతో కలిసి నడుస్తున్నాయి.

ఉస్మానియా యూనివర్సిటీలోని సోషి యాలజీ, తెలుగు, ఇంగ్లీష్​, జర్నలిజం విభాగాలు ఈ కార్యక్రమాన్ని తమదిగా భావించి ముందుకొచ్చాయి. 19వ తేదీన (మంగళవారం) ‘భారతీయ ఆదివాసీ, జానపద సంగీత వారసత్వం’పై జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిలో భాగమై ప్రస్తుతం కనుమరుగవుతున్న వాద్యాలను, వాటి శబ్దాలను నేటి తరానికి పరిచయం చేయటం ద్వారా వాటికి ఆదరణ, ప్రచారం కల్పించటమే మూలధ్వని ముఖ్యోద్దే శం. గ్రహణం పడుతున్న కళలను, అంతరించిపోతున్న సంగీత వాద్యాలను కాపాడుకోవటం మనందరి బాధ్యత. ‘వాద్యాల భద్రత–కళాకారులకు ఆదరణ’పై చర్చ జరగాలి. ‘మూలధ్వని’ కార్యక్రమం దానికి పునాది వేయాలి.

‘జయధీర్ ’ సారథ్యంలో..
మూలధ్వని సంస్థకు కన్వీనర్ గా ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు వ్యవహరిస్తున్నారు. కవి, రచయిత, జానపద పరిశోధకుడు అయిన జయధీర్ గతంలో కూడా పలు ప్రాచీన కళల పరిచయ కార్యక్రమాలను నిర్వహించారు. మూలధ్వని నిర్వహణలో పలు సంస్థలు పాలుపంచుకుంటున్నాయి.