- నలుగురు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
- రంగారెడ్డి జిల్లా ఆలూరు గేట్ వద్ద ఘోర ప్రమాదం
- క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్‌ను జేసీబీతో బయటకు తీసిన పోలీసులు
- చెట్టును ఢీకొట్టి ఆగిన లారీ.. 40 మందికి తప్పిన ప్రాణాపాయం
- సీఎం దిగ్భ్రాంతి.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గేట్ వద్ద బీజాపూర్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి హైవే పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ చెట్టును ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. ఒకవేళ అలాగే ముందుకు వెళ్లి ఉంటే, భారీగా ప్రాణనష్టం జరిగేది. చెట్టును ఢీకొని లారీ ఆగడంతో అక్కడున్న మరో 40 మంది ప్రాణాలతో బయటపడ్డారు. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, తీవ్ర గాయాలైన వారితో ఘటనా స్థలం భయానకంగా కనిపించింది. కాగా, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడినోళ్లకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
బస్సు, కారును తప్పించబోయి..
చేవెళ్ల మండలం ఆలూరు, నాంచేరు అనుబంధ గ్రామం ఇంద్రారెడ్డి నగర్‌కు చెందిన 25 మంది రైతులు ఆలూరు స్టేజీ పక్కన కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు.ఎప్పటిలాగే సోమవారం కూడా చెట్ల కింద కూరగాయలు అమ్ముకుంటున్నారు. సాయంత్రం 4 గంటల టైమ్‌లో ఆలూరు స్టేజీ వద్ద ఓ ఆర్టీసీ బస్సు ప్రయాణికులను దించుతుండగా, దాని వెనుక ఓ కారు ఉంది. అదే టైమ్‌లో హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వెళ్తున్న లారీ. . వేగంగా బస్సు, కారును తప్పించే క్రమంలో అదుపు తప్పి కూరగాయలు అమ్ముకుంటున్నోళ్లపైకి దూసుకెళ్లింది. దీంతో కూరగాయలు అమ్ముతున్న ఆలూరుకు చెందిన నక్కలపల్లి రాములు (40), దామరిగిద్ద కృష్ణ (22), ఇంద్రారెడ్డి నగర్‌కు చెందిన ఎస్.సుజాత (42) అక్కడికక్కడే చనిపోయారు.
టీ తాగడానికి వచ్చిన పరిగి మండలం ఎర్రగడ్డపల్లికి చెందిన ఎండీ జమిల్ (26) తీవ్రంగా గాయపడగా చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆలూరుకు చెందిన శ్యామల అలియాస్ బాలమణి (40), బండ్లగూడకు చెందిన లారీ డ్రైవర్ ఎండీ అమీర్ (27), ఏపీకి చెందిన వాచ్మెన్చల్ల మొగులయ్య (60) తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్అమీర్క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. పోలీసులు జేసీబీ సాయంతో అతణ్ని బయటికి తీసి ఉస్మానియాకు తరలించారు. కూరగాయలు కొనడానికి వచ్చిన వారు పరుగులు పెట్టడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చెట్టును ఢీకొని లారీ ఆగిపోగా, దానికి అవతలివైపు ఉన్న 40 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
భారీగా ట్రాఫిక్ జామ్..
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, నార్సింగి సీఐలు, 10 మందికి పైగా ఎస్సైలు, 50 మందికి పైగా సిబ్బంది.. 8 అంబులెన్స్‌లు, రెండు క్రేన్లు, రెండు జేసీబీలతో గంటల తరబడి శ్రమించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ప్రమాద విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామస్తులు వందలాదిగా అక్కడికి చేరుకోవడంతో హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు హైదరాబాద్–చేవెళ్ల వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. చిట్టెంపల్లి, అంతారం మీదుగా హైదరాబాద్ పంపించారు.
కలెక్టర్ కు నివేదిక..
చేవెళ్ల ప్రభుత్వ దవాఖానలో బాధిత కుటుంబాలను పలువురు లీడర్లు పరామర్శించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం తదితరులు ఆస్పత్రికి చేరుకుని మృతుల కుటుంబసభ్యులను ఓదార్చారు. కాగా, రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ కిషన్, ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ కృష్ణయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక అందించారు.