
- టన్నెల్‌లోని తాజా పరిస్థితులపై పీఎంవో ఆరా
- రెస్క్యూ ఆపరేషన్‌లోకి
- సెంటర్ ఫర్ సిస్మాలజీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిజం సంస్థలు
- సీఎం సూచనలతో టీమ్‌లు
- అవుట్‌లెట్ నుంచే తవ్వకాలకు ప్రయత్నాలు
నాగర్‌కర్నూల్, వెలుగు : ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగి పది రోజులు కావస్తున్నా.. గల్లంతైన ఎనిమిది మందిని జాడను రెస్య్యూటీమ్లు కనిపెట్టలేకపోతున్నాయి. సోమవారం కూడా టన్నెల్లోపల నుంచి ఎలాంటి ఆచూకీ లభించలేదు. భారీగా వస్తున్న నీటి ఊటల కారణంగా తవ్వకాలు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. టన్నెల్‌లోని తాజా పరిస్థితులపై సోమవారం ప్రధాన మంత్రి కార్యాలయం ఆరా తీసినట్లు తెలిసింది. సోమవారం ముగ్గురు సైంటిస్టులతో ఎన్జీఆర్ఐ బృందం టన్నెల్వద్దకు వచ్చి పరిశీలించగా, ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలతో భూమి లోపల అమరికలు, రాతి పొరలు, నీటి జాడలు, కదలికలను పసిగట్టే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిజం సంస్థలకు చెందిన నిపుణులు ఒకటి రెండురోజుల్లో చేరుకొని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొననున్నట్లు చెప్తున్నారు. టన్నెల్ వద్ద యాక్సిలో మీటర్, డేటా అక్సిజిషన్ సిస్టంతో టెంపరరీ అబ్జర్వేటరీ క్యాంపును ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నట్లు తెలిసింది.
సీఎం సూచనలతో ముందుకు..
సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదివారం ఎన్ఎల్బీసీని సందర్శించి, మంత్రులు, ఆఫీసర్లు, నిపుణులు, రెస్క్యూ టీములతో సమీక్ష అనంతరం పలు కీలక సూచనలు చేశారు. ప్రాజెక్టును కొనసాగించాలా? వద్దా? తర్వాత ఆలోచిద్దామని, ముందు మృతదేహాల ఆనవాళ్లు గుర్తింపు, నీటి ఊటకు కారణాలు అన్వేషించాలని సీఎం ఆదేశించారు. లోపల చిక్కుకున్నవారు జీవించే అవకాశాలు లేవని కల్నల్ పరిక్షిత్ మెహ్రా సీఎంకు స్పష్టంగా వివరించారు. మట్టి, రాళ్లు, బురద తరలింపుకు13.6 కిలోమీటరు నుంచి 12వ కిలోమీటరు వరకు తరలించడమే సమస్యగా మారిందన్నారు. టీబీఎం విడి భాగాలను కట్ చేసి 13 కిలోమీటర్ల టన్నెల్ బయటికి తీసుకొచ్చేందుకు ఏడాది టైం పడుతుందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఇంకా చాలా టైం పడ్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక అవుట్‌లెట్ నుంచే తవ్వకాలు
ప్రస్తుతం ఇన్‌లెట్‌వైపు నుంచి ప్రమాదం జరిగి పనులు నిలిచిపోవడంతో సీఎం ఆదేశాల మేరకు ఔట్లెట్ వైపు 22వ కిలోమీటరు నుంచి తవ్వుకుంటూ రావాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంత పరిసరాల్లో పది మీటర్ల వ్యాసార్థంతో కాకుండా ఐదు మీటర్ల డయాతో 200 మీటర్ల దూరం వరకు రెండు టన్నెల్స్ తవ్వి ఇన్లెట్ సైడ్13వ కిలోమీటరు వద్ద కలపాలని భావిస్తున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం లోపల చిక్కుకున్నవారిని బయటకు తేవడంపైనే తాము దృష్టి సారించామని ఆఫీసర్లు చెప్తున్నారు.