
- మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్‌గా గుర్తింపు
- 12 గంటలు శ్రమించి టీబీఎంను కట్ చేసిన రెస్క్యూ సిబ్బంది
- ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో మృతదేహం
- నాగర్‌కర్నూల్ జిల్లా హాస్పిటల్‌కు డెడ్‌బాడీ తరలింపు
- మిగిలిన ఏడుగురి ఆచూకీ కోసం కొనసాగుతున్న రెస్క్యూ
- మృతుడి కుటుంబానికి 25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి వెలుగు టీం: ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఒక డెడ్‌బాడీని గుర్తించి రెస్క్యూ బృందాలు బయటికి తీసుకొచ్చాయి. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డీ-2 పాయింట్‌లో మనుషుల ఆనవాళ్లను కేరళ కెడావర్ డాగ్స్ గుర్తించాయి. దీంతో ఆ ప్రాంతంలో రెస్క్యూ సిబ్బంది మట్టిని తొలగించి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు రాబిన్స్ కంపెనీ టీబీఎం ఎరక్టర్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ (40)గా గుర్తించారు. శనివారం అర్ధరాత్రి టీబీఎం ఏసీ క్యాబిన్ కింద గురుప్రీత్ సింగ్ శరీరభాగాలను గమనించిన రెస్క్యూ బృందాలు.. 12 గంటల పాటు శ్రమించి టీబీఎం గడ్డర్, 7 వరుసల స్టీల్ షీట్లను కట్ చేశాయి.
సింగరేణి మైన్స్ అండ్ రెస్క్యూ టీమ్ జీఎం వైద్య ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ టీమ్ కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించాయి. డెడ్‌బాడీ ఛిద్రం కాకుండా ఎంతో జాగ్రత్తగా షీట్లను కట్ చేశాయి. ప్రమాదం జరిగిన 16 రోజుల తర్వాత ఆదివారం సాయంత్రం 6 గంటలకు లోకో ట్రైన్ ద్వారా గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని సింగరేణి బృందం బయటికి తీసుకొచ్చి మార్చురీ వెహికల్లోని ఫ్రీజర్‌లో భద్రపర్చింది. ‘గురుప్రీత్ సింగ్ అమర్ రహే’అంటూ రెస్క్యూ బృందాలు నినాదాలు చేశాయి. అనంతరం పోలీస్ ఎస్కార్ట్‌తో డెడ్‌బాడీని నాగర్‌కర్నూల్ జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం డెడ్‌బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఉస్మానియాకు చెందిన నలుగురు సభ్యుల ఫోరెన్సిక్ బృందం పోస్టుమార్టం కోసం నాగర్‌కర్నూల్ జిల్లా హాస్పిటల్‌కు చేరుకున్నది. మిగిలిన ఏడుగురి ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
గురుప్రీత్ సింగ్‌ది పంజాబ్
పంజాబ్ రాష్ట్రంలోని తరణ్ జిల్లా చీమకలాన్ గ్రామానికి చెందిన గురుప్రీత్ సింగ్.. రాబిన్స్ కంపెనీలో టీబీఎం ఎరక్టర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. మృతుడికి భార్య ఉంది. గురుప్రీత్ సింగ్ సోదరుడు సత్పాల్ సింగ్ 15 రోజులుగా జేపీ కంపెనీ క్యాంప్ దగ్గరే ఉంటున్నాడు. గత నెల 22న ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగింది. వరద ధాటికి 200 మీటర్ల పొడవు, 1,500 టన్నుల బరువున్న టీబీఎం ముందు భాగం 50 మీటర్లు వెనక్కి వచ్చింది. అయితే, మొత్తం 8 మంది డెడ్‌బాడీలు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు ఎన్జీఆర్ఐజీపీఆర్ స్కానర్, కేరళ క్యాడవర్ డాగ్ స్క్వాడ్ ఇప్పటికే గుర్తించాయి. డెడ్‌బాడీలను గుర్తించిన రెండు ప్రదేశాల్లో ఒకటి చాలా ప్రమాదకరమని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే ఇంజినీరింగ్ డివిజన్ టీబీఎంను కట్ చేయగా.. డీ2 ప్రాంతంలో ర్యాట్ హోల్ మైనర్స్ టీమ్ తవ్వకాలు జరిపింది.
రెస్క్యూ కొనసాగిస్తాం: సింగరేణి జీఎం వైద్య
రెస్క్యూ ఆపరేషన్‌లో ఆశించిన స్థాయిలో రిజల్ట్ రావడం లేదని తమను పిలిపించిన ప్రభుత్వం.. 48 గంటల్లో చిక్కుకున్నవారి ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించినట్లు సింగరేణి జీఎం వైద్య తెలిపారు. గురుప్రీత్ సింగ్ డెడ్‌బాడీ బయటికి తీసుకొచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారం పని చేస్తున్నామని తెలిపారు. రెండు రోజుల కింద టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ చార్జ్ తీసుకోగానే.. టన్నెల్ లోపల 70 మీటర్ల వరకు కొట్టుకొచ్చిన స్టీల్, ఇతర విడిభాగాలను కట్ చేసి బయటికి తీసుకొచ్చామన్నారు. కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ తర్వాత ఎస్కవేటర్లను లోపలికి తీసుకెళ్లామని తెలిపారు.
రూ.25 లక్షల నష్ట పరిహారం ప్రకటన
గురుప్రీత్ సింగ్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం తెలియజేశారు. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. డెడ్‌బాడీని పంజాబ్‌లోని స్వగ్రామానికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.