
- డీ2 పాయింట్ లో కనిపించని మృతదేహాల జాడ
- ఎన్జీఆర్ఐ, కేడావర్ డాగ్స్ గుర్తించినా ఫలితం లేదు
- ఏడుగురి శవాల కోసం కొనసాగుతున్న రెస్క్యూ
- ఏడు రోజులుగా ఇదే చోట తవ్వకాలు
- ఎస్ఎల్బీసీలో పని ప్రారంభించని రోబోలు
నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన ఏడుగురి కోసం వెతకులాట కొనసాగుతోంది. వారి మృతదేహాలు కనుగొనేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. మొత్తం 8 మంది చిక్కుకోగా ఒక్క గురు ప్రీత్ సింగ్ డెడ్ బాడీ మాత్రమే దొరికింది. టన్నెల్ లో కొన్ని ప్రదేశాలను ఎన్జీఆర్ఐకి చెందిన జీపీఆర్ స్కానర్ గుర్తించింది. అదే స్థలాలను కేరళకు చెందిన కేడావర్ డాగ్స్ సైతం సూచించడంతో డీ1, డీ2గా మార్కింగ్ చేశారు. అక్కడి చేరుకునేందుకు టీబీఎం మెషిన్ ను కటింగ్ చేశారు. ప్రమాదం జరిగిన చోటు నుంచి డి2 పాయింట్ 70 మీటర్ల దూరంలో ఉంది.
ఇక్కడ 8 మీటర్ల ఎత్తులో గట్టిపడి సిమెంట్ కాంక్రీట్ లా మారిన మట్టిని తవ్వి తీశారు. 200 మీటర్ల దూరం వరకు కొట్టుకొచ్చిన మిషన్ విడిభాగాలు, పైపులు, ఆక్సిజన్ ప్లాంట్ సామగ్రిని కట్ చేసి తీశారు. 200 మీటర్ల దూరం వరకు కొట్టుకొచ్చిన మిషన్ విడిభాగాలు, పైపులు, ఆక్సిజన్ ప్లాంట్ సామగ్రిని కట్ చేసి తొలగించారు. డీ1, డీ2 ప్రాంతాల్లో కలిపి నలుగురి మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే డీ2 తవ్వకాల్లో ఏమీ కనిపించకపోవడంతో ప్రస్తుతం తవ్వకాలు స్టాప్ చేశారు. 14వ కిమీ నుంచి 43.5 మీటర్ల దూరంలో ఉన్న డి 1 పాయింట్ లో తవ్వకాలు జరపాలని నిర్ణయించారు.
ఇక్కడ దాదాపు 8.85 మీటర్ల ఎత్తులో మట్టి సిమెంటు కాంక్రీట్ లాగా మారింది. దాదాపు టీబీఎం ముందు భాగంలో ఉండే ఈ ప్రదేశంలో తవ్వకాలు , తరలింపు రెండు హై రిస్క్ చాలెంజ్ తో కూడుకున్నవి. డీ1 పాయింట్ కు కొద్ది దూరంలో ఉన్న డెడ్ ఎండ్ లో పై నుంచి నీరు జలపాతంలా దుంకుతోంది. తీవ్రంగా కష్టపడ్డా రిజల్ట్ ఎలా ఉండబోతోందో అనే టెన్షన్ ఉంది. పని ప్రారంభించని రోబో మనుషులకు రిస్క్ లేకుండా డీ 2,డీ1 పాయింట్స్ లో రెస్క్యూ ఆపరేషన్ కోసం తెప్పించిన రోబో ఇంకా పని ప్రారంభించ లేదు.
మెయిన్ రోబో టన్నెల్ బయట కంట్రోల్ రూంలో ఉండగా రెండు రోజుల కింద టన్నెల్ లోకి వెళ్లిన ఒక రోబో ఆపరేషన్ లోకి దిగలేదు. ఆ రోబో ఎందుకు పని ప్రారంభించలేదన్నది తెలియడం లేదు. ఇదిలా ఉండగా మరో రెండు రోబోలు రావడానికి టైమ్ పడుతుందని అంటున్నారు.