
- 9 మీటర్ల లోతు బురదలో నలుగురి మృతదేహాలు
- రాడార్ సెన్సార్ తో గుర్తించిన బృందాలు
- రేపు రాత్రి వరకు వీళ్ల డెడ్ బాడీస్ బయటికి..
- రెస్క్యూ లో పాల్గొంటున్న 11 బృందాలు
మహబూబ్ నగర్/నాగర్ కర్నూల్: ఎస్ ఎల్బీసీ టన్నెల్ లో శిథిలాల కింద గత శనివారం చిక్కుకున్న వారిలో నలుగురి ఆచూకీ లభ్యమైంది. 9 మీటర్ల లోతు బురదలో వీళ్ల డెడ్ బాడీస్ ఉన్నట్టు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. మిగతా నలుగురు టీబీఎం ముందు భాగంలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ఇందుకు సంబంధించిన ఓ ఊహా చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ఆ చిత్రంలో నలుగురు వెనుకవైపు ఉండగా.. మిగతా నలుగురిలో ఇద్దరు ఒక దగ్గర, మరో ఇద్దరు కొంచం ముందుకు ఉన్నట్టుగా ఉంది. కొట్టుకు వచ్చిన టీబీఎం ను కటింగ్ చేసే పనులు కొనసాగుతున్నాయి.
నలుగురు టీబీఎం వెనుక భాగంలో ఉండటంతో రాడార్ సెన్సార్ సాయంతో వారి మృతదేహాలను గుర్తించగలిగారు. ముందు వైపు నలుగురు ఉన్నట్టు గా రెస్క్యూ టీం భావిస్తోంది. దీంతో అక్కడికి చేరుకొని శిథిలాలను తొలగిస్తేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మిస్సయిన వారిలో ముందు భాగంలో ఎవరెవరున్నారు.. వెనుక వైపు ఎవరున్నారు అనేది క్లారిటీ రాలేదు. శిథిలాల కింద ఉన్న తమ వారి కోసం కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీ ఆఫీసు వద్ద పడిగాపులు కాస్తున్నారు.