ఈ ఏడాది బీఆర్ఎస్కు కలిసొస్తది.. రాజేశ్వర సిద్ధాంతి పంచాంగ శ్రవణం

ఈ ఏడాది బీఆర్ఎస్కు కలిసొస్తది.. రాజేశ్వర సిద్ధాంతి పంచాంగ శ్రవణం

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది బీఆర్​ఎస్​కు కలిసి వస్తదని పండితుడు రాజేశ్వర సిద్ధాంతి చెప్పారు. ఎన్నికలన్నింటిలోనూ ఆ పార్టీ విజయాలు సాధిస్తదని తెలిపారు. అలాగే, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్నారు. ‘‘కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ఈ ఏడాది గ్రహాలు అనుకూల దశలో ఉన్నాయి. ఆయన పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. తెలంగాణ ప్రజలు ఎలాంటి ప్రజాపాలన కోరుకుంటున్నారో.. అలాంటి పాలన అందించేందుకు కేసీఆర్​కు ఈ ఏడాది అత్యంత అనుకూలంగా ఉంది. ఆ నరసింహస్వామి అనుగ్రహం కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై ఉంటుంది” అని తెలిపారు. ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం తెలంగాణ భవన్‌‌‌‌లో పంచాంగ శ్రవణం నిర్వహించారు. దీనికి బీఆర్ఎస్​వర్కింగ్ ​ప్రెసిడెంట్​కేటీఆర్,​ పార్టీ సీనియర్​ నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజేశ్వర సిద్ధాంతి పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది బీఆర్ఎస్ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, వార్డు మెంబర్​నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ఏ ఎన్నిక జరిగినా అన్నింట్లోనూ బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన చెప్పారు. అయితే, ప్రభుత్వం ఎన్నికలు పెట్టేందుకు జంకుతుందని.. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే పరితపిస్తుందని తెలిపారు. కోర్టులు మొట్టికాయలు వేసే వరకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించదన్నారు. ‘‘ఈ ఏడాది మీడియా నుంచి బీఆర్ఎస్​పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయి. పార్టీపై దుష్ప్రచారం చేసి అప్రతిష్టపాలు చేస్తుంది. పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి” అని సూచించారు.

పాలకుల మధ్య విభేదాలొస్తయ్..  
సీఎం రేవంత్​రెడ్డికి ఈ ఏడాది బాగాలేదని రాజేశ్వర సిద్ధాంతి తెలిపారు. మే 14 తర్వాత ఆయనను పదవీ గండాలు వెంటాడుతాయని చెప్పారు. రేవంత్‌‌‌‌ రెడ్డి బృహస్పతి అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఆరాధన చేయాల్సి ఉంటుందని సూచించారు. దేశం, రాష్ట్రంలో పరిపాలన సదాభిప్రాయంతో సాగే అవకాశాలు తక్కువగా ఉంటాయని, రాజకీయ నాయకుల్లో స్వార్థం పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలనపై దృష్టి తగ్గుతుందని పేర్కొన్నారు. పాలకుల మధ్య విభేదాలు వస్తాయని, అవి పాలనపై దుష్పరిణామాలు చూపిస్తాయని అన్నారు. ప్రభుత్వం నడిచేందుకూ ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. 

ప్రభుత్వం ప్రకటించిన హామీల అమలు నామమాత్రంగానే ముందుకు సాగుతుందని చెప్పారు. పోలీసుల అధికారాలు ఎక్కువవుతాయని, ఈ ఏడాది చివరి వరకు ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉండి అధికార దుర్వినియోగం చేస్తారని తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు కష్టాలు తప్పవని, రియల్​ఎస్టేట్​వ్యాపారులు కొత్త పెట్టుబడుల జోలికి వెళ్లొద్దని సూచించారు. ఈ ఏడాది రాష్ట్రంలో అతివృష్టి ఉంటుందని, భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పవన్నారు. పాడి పంటలు బాగుంటాయని, పత్తి పంట అనుకూలమని చెప్పారు. పప్పుధాన్యాలు ఎక్కువగా పండుతాయన్నారు. వస్త్ర పరిశ్రమకు మంచి రోజులని, చిన్న పరిశ్రమల వారికి కొంచెం నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.