కొలువులపై యువత ఫోకస్

సర్కార్ కొలువు సాధించడమే లక్ష్యంగా యువత కష్టపడుతున్నారు.ఎన్నో యేళ్లుగా కొలువుల నోటిఫికేషన్లకు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించడంతో యువత పూర్తిగా ప్రిపరేషన్ పై దృష్టిపెట్టింది. పేద, మధ్య తరగతి కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల యువతకు లైబ్రరీలే శిక్షణా కేంద్రాలుగా మారాయి. ఏ పోటీ పరీక్ష రాయాలన్నా వాటిల్లోనే సిద్దమవుతారు. ఉద్యోగ సాధన కోసం నిరుద్యోగుల కసరత్తులు చేస్తున్నారు. 

వరంగల్: జిల్లాలో లైబ్రరీలు అడ్డాగా ఉద్యోగ సాధన కోసం యువతీ, యువకులు కష్టపడుతున్నారు. నిన్నా మొన్నటి దాకా ఖాళీగా కనిపించిన కాకతీయ యూనివర్శిటీ, జిల్లా కేంద్రంలోని రీజనల్, సెంట్రల్ లైబ్రరీలు  సందడిగా మారాయి. ఇప్పటికే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్ధులతో పాటు కొత్తగా ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ లాంటి కోర్సులు పూర్తి చేసిన యువత కూడా గ్రంథాలయాల్లో చదువుకుంటున్నారు. తాము ప్రిపేరవుతున్న ఉద్యోగాల సిలబస్ కు తగ్గట్టుగా  పుస్తకాలు చదువుకుంటూ నోట్స్ తయారు చేసుకుంటున్నారు. గత ప్రశ్నాపత్రాలను పరిశీలిచండంతో పాటు ఆన్ లైన్ లోనూ సమాచారం వెతుకుతున్నారు. టైమ్ వేస్ట్ చేయకుండా వచ్చిన ఛాన్స్ తో.. కొలువు సాధించి జీవితంలో స్థిరపడాలన్న లక్ష్యంతో  ఉన్నారు.
 

లైబ్రరీలే ప్రిపరేషన్ కేంద్రాలు 

ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండేట్టుగా నిరుద్యోగులు రోజులో ఎక్కువ భాగం లైబ్రరీలు, స్టడీ సెంటర్లలోనే గడుపుతున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలు కోచింగ్ తీసుకోవడం ఆర్థిక భారం అవుతోంది.  అందుకే  చాలా మంది తమ అకడమిక్ స్టడీస్ తో పాటు గ్రూప్స్, ఇతర ఉద్యోగాల కోసం లైబ్రరీల్లో చదువుతున్నారు. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ దగ్గర్లోని డిస్ట్రిక్ట్ లైబ్రరీలో నిరుద్యోగులు మెటీరియల్, పుస్తకాలు తీసుకొని చదువుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నిరుద్యోగులు ప్రైవేట్ హాస్టల్స్ తో ఉంటూ కొందరు... అద్దెకు గదులు తీసుకొని మరికొందరు వరంగల్ సిటీలో చదువుకుంటున్నారు. రోజూ 300 నుంచి 400 మంది యువత లైబ్రరీకి వస్తున్నారు. ఇక్కడ తమకు మరిన్ని వసతులు సమకూర్చాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు.
 

ఇంటర్నెట్, వైఫై సదుపాయాలు కల్పించాలి 

ఇక్కడే కాదు జిల్లాలోని అనేక లైబ్రరీల్లో సరైన సౌకర్యాలు లేవు. అప్ డేట్ తో కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉండట్లేదు. ఆన్ లైన్ లో మెటీరియల్ చూసుకోడానికి ఇంటర్నెట్, వైఫై లాంటి సౌకర్యాలు కావాలని అడుగుతున్నారు.వేలు ఖర్చుపెట్టి శిక్షణ తీసుకునే పరిస్థితి లేదనీ... అందుకే తాము లైబ్రరీలపై ఆధారపడుతున్నామని అంటున్నారు అభ్యర్థులు. 

పోలీసుల ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్

ఇప్పటి వరకూ వరంగల్ కమిషనరేట్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గత కొద్దిరోజులుగా నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్ నడుస్తోంది. పోలీస్ ఉద్యోగాల కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల యువతను దృష్టిలో పెట్టుకుని ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బీసీ స్డడీ సర్కిల్ లాంటివి పూర్తిగా అందుబాటులోకి తేవాలని అడుగుతున్నారు.

త్వరగా నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి

నోటిఫికేషన్లు తొందరగా వేయడంతో పాటు నిరుద్యోగ యువతకు అవసరమైన పుస్తకాలు, మెటీరియల్ ను లైబ్రరీల్లో అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం...

రా రైస్ పై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిస్తలె

తెలంగాణను బెంగాల్‎గా మార్చొద్దు

పెట్రో రేట్ల పెరుగుదల బీజేపీ ఆడుతున్న గేమ్