- కొత్త వీసీలు వచ్చి 2 నెలలు
- ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ లేక ఆగిన కీలక నిర్ణయాలు
హైదరాబాద్, వెలుగు: సర్కారు యూనివర్సిటీలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ (ఈసీ) నియామకంపై విద్యా శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. వర్సిటీ ఈసీల కాలపరిమితి ముగిసి 10 నెలలు పూర్తయినా ఇప్పటికీ, కొత్త వాటి నియామకంపై దృష్టి సారించలేదు. దీంతో పలు కీలక నిర్ణయాలు ఆగిపోయాయి. పలు వర్సిటీలకు రెండు నెలల క్రితమే కొత్త వీసీలు వచ్చారు. అయినా కొత్త ఈసీలను మాత్రం ఇప్పటి వరకూ ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో విద్యా శాఖ పరిధిలో 12 వర్సిటీలు ఉన్నాయి.
ఆయా వర్సిటీల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వర్సిటీ ఈసీలు కీలకం. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈసీల నియామకంపై విద్యా శాఖ దృష్టిపెట్టడం లేదు. యూనివర్సిటీల యాక్ట్ 1991 ప్రకారం ఈసీ గడువు మూడేండ్లు. కాకతీయ యూనివర్సిటీ మినహా మిగిలిన వర్సిటీలకు ఈసీలు లేవు. వాస్తవానికి 2023లోనే వాటి మూడేండ్ల కాలపరిమితి ముగియగా, అప్పటి ప్రభుత్వం ఏడాది గడువు పెంచింది. ఆ గడువు కూడా ఫిబ్రవరిలోనే ముగిసింది.
దీంతో సుమారు పది నెలలుగా ఈసీలు లేకుండానే వర్సిటీలు కొనసాగుతున్నాయి. అక్టోబరులో పలు వర్సిటీలకు కొత్త వీసీలు వచ్చారు. అయితే.. ఈసీలు లేకపోవడంతో అడ్మినిస్ర్టేషన్ సాఫీగా సాగడం లేదు. ఈసీలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శి, కళాశాల విద్యా శాఖ/ టెక్నికల్ విద్యా శాఖ కమిషనర్లు, సర్కారు ఉన్నతాధికారులతో పాటు సర్కారు, ప్రైవేటు కాలేజీల ప్రతినిధులు, వర్సిటీ ప్రతినిధులు మెంబర్లుగా ఉంటారు. దీంతో అన్ని రకాల అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆ కమిటీలు లేకపోవడంతో వర్సిటీలు, కాలేజీల డెవలప్ మెంట్ పై చర్చే లేదు.
ఈసీలను త్వరగా నియమించాలి
వర్సిటీలో తీసుకునే ప్రతి నిర్ణయానికి ఈసీల ఆమోదం తప్పనిసరి. వర్సిటీ వీసీ రూ.10 లక్షలకు మించి ఖర్చు చేయడానికి లేదు. ఎక్కువ మొత్తం ఖర్చు చేయాలంటే తప్పనిసరిగా ఈసీ అనుమతి ఉండాల్సిందే. దీంతో వర్సిటీల్లో రిపేర్లు, బిల్డింగులు, ఇతర నిర్మాణాలు చేయలేకపోతున్నామని వీసీలు చెప్తున్నారు. ఆర్థిక సమస్యలతో పాటు లీగల్ అంశాలు, విజిలెన్స్ కేసులపైనా ఎలాంటి ముందడుగు పడడం లేదని తెలిపారు. అలాగే, కోర్టు కేసుల అమలుపై తప్పనిసరిగా ఈసీ అనుమతితోనే ముందుకు పోవాల్సి ఉంటుంది.
దీనికితోడు కొత్తగా వచ్చిన వీసీలు.. ఆయా వర్సిటీల్లో రిజిస్ర్టార్లతో పాటు కాలేజీలకు ప్రిన్సిపాల్స్, డిపార్ట్ మెంట్ హెడ్ లను నియమించుకున్నారు. ఆ నియామకాలను ఈసీలు రాటిఫై చేయాల్సి ఉంటుంది. ప్రతి మూడు నెలలకోసారి జరగాల్సిన ఈసీ సమావేశాలు.. పది నెలలైనా జరగడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, వర్సిటీల్లో ఈసీలను నియమించాలని విద్యార్థులు, విద్యావేత్తలు కోరుతున్నారు.