పోలీసుల దిగ్బంధంలో యూనివర్సిటీలు : పేర్వాల నరేష్, కాకతీయ యూనివర్సిటీ

ఉ ద్యమాలు అనగానే గుర్తుకు వచ్చేది యూనివర్సిటీలు. తెలంగాణలో ఉన్నటువంటి 11 యూనివర్సిటీలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయి. అటువంటి యూనివర్సిటీలు నేడు పోలీసుల దిగ్బంధంలో ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఏదైనా జరగరాని సంఘటన జరిగినా కూడా పోలీసులు యూనివర్సిటీలలో అడుగు పెట్టాలంటే వీసీ అనుమతి తీసుకొని మరీ లోపలికి వచ్చేవారు. నేడు అవే యూనివర్సిటీల గేట్ల దగ్గర పోలీసులను దాటుకొని విద్యార్థులు వెళ్లవలసి వస్తుంది. ఇటీవల టీఎస్ పీ ఎస్ సీ పేపర్ లీకేజీ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. న్యాయం కోసం విద్యార్థుల పక్షాన నిలబడుతున్న విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులను, ప్రజాసంఘాలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు.

మొన్నటికి మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి సంఘాలను పోలీసులు  కేసులు పెట్టి అరెస్టు చేయడం జరిగింది. అదే కాకుండా ఎన్​సీసీ గేటు నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వరకు ప్రతి డిపార్ట్​మెంట్ వద్ద పదుల సంఖ్యలో పోలీసులు పహారా కాస్తున్నారు. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టగా రిజిస్ట్రార్ మరియు వీ సీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎనిమిది సెక్షన్ల కింద విద్యార్థులను అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది. అప్పటినుంచి  కేయూ ఫస్ట్ గేట్ నుంచి రెండవ గేటు వరకు వందల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. పదిమంది గ్రూపుగా ఏర్పడ్డా కూడా పోలీసులు అనుమానిస్తూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించడం జరుగుతోంది. నిరుద్యోగుల కోసం ఏ ధర్నా కార్యక్రమం చేపట్టకుండా, ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు.

దీని కోసమేనా మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదని మేధావులు, విద్యార్థి సంఘాలు, ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల చదువుల కోసం వేదిక కావలసిన విశ్వవిద్యాలయాలు నేడు పోలీసుల దిగ్బంధంలో ఉం టున్నాయి. ఏ ప్రతిపక్ష నేత, ఏ విద్యార్థి సంఘం నేత, యూనివర్సిటీ లోపలికి రావాలన్నా పోలీసులు కట్టడి చేస్తున్నారు. సభలు, సమావేశాలు జరగనివ్వటంలేదు. టీఎస్ పీఎస్ సీ అంశం మీద విద్యార్థి సంఘాలు కోరుతున్నది ఏమిటంటే, ఇంతకుముందు జరిగిన నయీమ్ అక్రమాస్తుల మీద, కోకాపేట్ భూముల మీద, ఎంఎల్ఏల కొనుగోలు మీద విచారణ కోసం వేసిన  సిట్​లు ఏమి తేల్చాయి?  కాబట్టి సిట్ విచారణపై విద్యార్థులు, అభ్యర్థులకు నమ్మకం లేనందువల్ల, ప్రశ్నపత్రం లీకేజీ కేసు నీరుగార్చే ప్రమాదం ఉన్నది. దీని వెనక రాజకీయ పెద్దల హస్తం ఉందని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్నంతటిని న్యాయపరంగా సీబీఐ చేత, లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. అందుకు ప్రభుత్వం అంగీకరించాల్సిన అవసరం ఉంది. కానీ న్యాయాన్ని పక్కన పెట్టి అణచివేతలకు పూనుకుంటున్నది.

మేధావులు ఎక్కడున్నారంటే యూనివర్సిటీలలో ఉన్నారని గర్వంగా చెప్పుకునే ప్రజలు నేడు ఆ మేధావులను అణగదొక్కే ప్రయత్నం  చేస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. టీ ఎస్ పీ ఎస్ సీ అంశం పైన విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరగకపోతే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో లాగా మరో పోరాటానికి అన్ని యూనివర్సిటీల ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు సిద్ధం కాక తప్పేటట్లు లేదు. 

–పేర్వాల నరేష్, కాకతీయ యూనివర్సిటీ