నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి తెలంగాణ వర్సిటీ విద్యార్థులు ఆకలితో రోడ్డుపై ఎక్కారు..ఖాళీ ప్లేట్లతో యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదుట నిరసన తెలిపారు. పరిపాలన భవనం ఎదుట ఔట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగస్థుల నిరసన నాలుగోరోజుకు చేరింది. దీంతో విద్యార్థులకు భోజనం లేక పస్తులతో అలమటిస్తున్నారు..
బుధవారం ( జూన్ 14) వీసీ చెప్పడంతో వార్డెన్ బయట నుండి భోజనం తెప్పించారు.. ఈరోజు ( జూన్ 15) నుండి విద్యార్థులు తమ మెస్ కోట నుండి భోజన ఖర్చులు చెల్లిస్తేనే భోజనం తెప్పిస్తానని.. నోటీసులు ఇవ్వడంతో విద్యార్థులు నిరసన తెలిపారు. వసతి గృహాల్లో రోజుకి రూ.60 చెల్లించే తాము.. పూటకి రూ.150 ఎలా భరిస్తామని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పొరుగు సేవలు, నాన్‌టీచింగ్ సిబ్బంది నిరసన విరమించకపోవటంతో.. విద్యార్థులు ఆహారం కోసం బిక్షాటన చేశారు. వర్సిటీ సమీపంలోని నడిపల్లి తండాలో ఆహారం అడుక్కున్నారు. డబ్బులిస్తేనే ఆహారం తెప్పిస్తామని వార్డెన్ నోటీసులివ్వటం దారుణమని వారు మండిపడ్డారు..
వీసీ, రిజిస్ట్రార్, తెలంగాణ వర్సిటీ పాలక వర్గాలు, ప్రొఫెసర్ల రాజకీయాల వల్ల తాము ఆకలితో అలమటిస్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆకలి కేకలు ప్రభుత్వానికి ఎందుకు వినిపించట్లేదని వారు వాపోయారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు