తెలంగాణ వర్సిటీలో..సగానికిపైగా పోస్టులు ఖాళీ

తెలంగాణ వర్సిటీలో..సగానికిపైగా పోస్టులు ఖాళీ
  •     152 టీచింగ్‌‌‌‌ పోస్టులకు ఉన్నది 61 మందే..
  •     ఏండ్ల తరబడి భర్తీ కాని ప్రొఫెసర్ల పోస్టులు
  •     నాన్‌‌‌‌ టీచింగ్‌‌‌‌ పోస్టులు 275 ఉండగా... 12 మందే రెగ్యులర్‌‌‌‌ సిబ్బంది
  •      కనిపించని మౌలిక వసతులు

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్‌‌‌‌ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ సమస్యలకు నిలయంగా మారింది. ఓ వైపు సరిపోను ఫ్యాకల్టీ లేకపోవడం.. మరో వైపు సరైన వసతులు లేకపోవడంతో ఉన్నత విద్య కోసం యూనివర్సిటీకి వస్తున్న స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్ల పోస్టులను ఏండ్ల తరబడి భర్తీ చేయకపోవడంతో సగానికిపైగా పోస్టులు ఖాళీ అయ్యాయి. టీచింగ్‌‌‌‌, నాన్‌‌‌‌ టీచింగ్‌‌‌‌ ఉద్యోగుల జీతాలకు సరిపోను నిధులు మాత్రమే ప్రభుత్వం నుంచి విడుదల అవుతున్నాయి. దీంతో కొత్త కాలేజీల పర్మిషన్‌‌‌‌, రెన్యూవల్స్‌‌‌‌, స్టూడెంట్ల ఎగ్జామ్‌‌‌‌ ఫీజుల ద్వారా వచ్చే ఇన్‌‌‌‌కమ్‌‌‌‌తోనే యూనివర్సిటీ మెయింటెనెన్స్‌‌‌‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్రంలోనే మూడో పెద్ద వర్సిటీగా గుర్తింపు

నిజామాబాద్‌‌‌‌ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్‌‌‌‌– నాగ్‌‌‌‌పూర్‌‌‌‌ నేషనల్‌‌‌‌ హైవే పక్కన గల 577 ఎకరాల్లో 2006లో తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆర్ట్స్, సైన్స్, కామర్స్, సోషల్‌‌‌‌ సైన్స్‌‌‌‌, కంప్యూటర్స్‌‌‌‌తో పాటు ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌బీ, ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌ఎం, ఎంబీఏ, ఎంసీఏ వంటి 30 రకాల కోర్సులతో యూనివర్సిటీ నడుస్తోంది. ఇందులో బయోటెక్నాలజీ, మైక్రో బయోలజీ వంటి 12 సెల్ఫ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కోర్సులు సైతం ఉన్నాయి. వర్సిటీ పరిధిలో మొత్తం 81 పీజీ కాలేజీల్లో 5 వేల మంది, 320 డిగ్రీ కాలేజీల్లో సుమారు 50 వేల మంది స్టూడెంట్స్‌‌‌‌ ఉంటారు. యూనివర్సిటీ క్యాంపస్‌‌‌‌లోనే రెండు వేల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల తర్వాత టీయూనే మూడో పెద్ద వర్సిటీ అని గుర్తించిన యూజీసీ న్యాక్‌‌‌‌ ‘బీ’ గ్రేడ్‌‌‌‌ హోదాను ఇచ్చింది.

152 టీచింగ్‌‌‌‌ పోస్టులకు 91 ఖాళీనే...

తెలంగాణ వర్సిటీలో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మొత్తం 20 ప్రొఫెసర్లు ఉండాల్సిన ఈ యూనివర్సిటీలో ప్రస్తుతం ముగ్గురే ఉండగా మిగతా 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 43 అసోసియేట్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌ పోస్టులకు 10 మంది, 89 అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌ పోస్టులకు 48 మంది మాత్రమే ఉన్నారు. మొత్తం యూనివర్సిటీ పరిధిలో 152 ప్రొఫెసర్‌‌‌‌ పోస్టులకు 61 మంది పనిచేస్తుండగా మిగతా 91 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

దీంతో కాంట్రాక్ట్, పార్ట్​టైం ప్రొఫెసర్లతో నెట్టుకొస్తున్నారు. మరో వైపు వీసీ యాదగిరిరావు, ఫార్మసీ ప్రొఫెసర్‌‌‌‌ నర్సింహారెడ్డితో పాటు మరొకరు కూడా జనవరి నెలాఖరునే రిటైర్‌‌‌‌ కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ప్రొఫెసర్ల రిటైర్‌‌‌‌మెంట్‌‌‌‌ ఏజ్‌‌‌‌ను 65 ఏండ్లకు పెంచడంతో ఈ మూడు పోస్టులు సేఫ్‌‌‌‌ అయ్యాయి. మరో వైపు నాన్‌‌‌‌ టీచింగ్‌‌‌‌ పోస్టుల్లో 275 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 12 మంది మాత్రమే రెగ్యులర్‌‌‌‌ సిబ్బంది ఉన్నారు. ఖాళీ పోస్టుల్లో అవుట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ సిబ్బందిని భర్తీ చేసి కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు.

ఒక్కో రూమ్‌‌‌‌లో ఆరుగురు ఫీమేల్‌‌‌‌ స్టూడెంట్లు

ఉన్నత విద్య కోసం యూనివర్సిటీకి వచ్చిన యువతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు బిల్డింగ్స్‌‌‌‌లో 550 మంది మేల్‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌ ఉండగా, 600 మంది ఫీమేల్‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌ కోసం ఒకే బిల్డింగ్‌‌‌‌ను కేటాయించారు. దీంతో ఒక్కో గదిలో ఆరుగురు చొప్పున అడ్జస్ట్‌‌‌‌ అవుతున్నారు. స్టూడెంట్స్‌‌‌‌ ఎక్కువ సంఖ్యలో ఉండడంతో బాత్‌‌‌‌రూమ్‌‌‌‌ సమస్య ఎదుర్కొంటున్నారు. ఫీమేల్‌‌‌‌ స్టూడెంట్ల కోసం బిల్డింగ్‌‌‌‌ నిర్మించేందుకు రూ. 7 కోట్లు రిలీజ్‌‌‌‌ అయి, టెండర్లు ముగిసినా కాంట్రాక్టర్‌‌‌‌ ఇంకా పనులు మొదలు పెట్టడం లేదు. 

కొందరు లీడర్లు కమీషన్ల కోసం వేధిస్తుండడం వల్లే పనులు ప్రారంభించడం లేదని తెలుస్తోంది. వర్సిటీలో ఇప్పటివరకు స్టడీ రూమ్, రీడింగ్‌‌‌‌ హాల్‌‌‌‌, జిమ్, వైఫై సౌకర్యాలు లేవు. మరో వైపు వంటలు నాసిరకంగా ఉంటుండడంతో స్టూడెంట్లు గతంలో పలుమార్లు ఆందోళన చేశారు. మెస్‌‌‌‌ నిర్వహణ కోసం ప్రతి నెలా రూ. 30 లక్షలు ఖర్చు చేస్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. 

యూనివర్సిటీలో నిధుల కొరత

యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, ఇతర స్టాఫ్‌‌‌‌ జీతాలు, ఇతర వసతుల కోసం నెలకు రూ. 3 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి ప్రతి యేటా రూ. 40 కోట్లు మాత్రమే వస్తుండగా, మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత ఏర్పడుతోంది. వర్సిటీ రెగ్యులర్‌‌‌‌ నిర్వహణను సెల్ఫ్‌‌‌‌ ఇన్‌‌‌‌కమ్‌‌‌‌తోనే నెట్టుకొస్తున్నారు.  గత ప్రభుత్వం స్టూడెంట్ల ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ చెల్లింపులు ఆపేయడంతో మూడున్నరేండ్లకు సంబంధించి రూ.4 కోట్లు వర్సిటీకి అందాల్సి ఉంది. 

యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఈ ఏడాది కూడా ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రపోజల్స్‌‌‌‌ పంపారు. రూ.18 కోట్లతో వెయ్యి మంది కూర్చునేలా ఆడిటోరియం, రూ.15 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌, రూ.18 కోట్లతో అడ్మిన్‌‌‌‌ బిల్డింగ్, రూ.15 కోట్లతో ఇన్‌‌‌‌డోర్‌‌‌‌, అవుట్‌‌‌‌ డోర్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌తో పాటు ఉమ్మడి అదిలాబాద్‌‌‌‌ జిల్లాలోని అన్ని డిగ్రీ, పీజీ కాలేజీలను కాకతీయ వర్సిటీ పరిధి నుంచి టీయూకు మార్చాలని కోరారు. 

కాంట్రాక్ట్‌‌‌‌, పార్ట్‌‌‌‌టైం ప్రొఫెసర్లతో నెట్టుకొస్తున్నాం 

రెగ్యులర్‌‌‌‌ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో కాంట్రాక్ట్‌‌‌‌, పార్ట్‌‌‌‌ టైం ప్రొఫెసర్లతో నెట్టుకొస్తున్నాం. యూనివర్సిటీకి నిధులు కొరత ఉన్నది నిజమే. ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ బకాయిలు విడుదల అయితే కొంత మేలు జరుగుతుంది. వర్సిటీకి కావాల్సిన ప్రతి అవసరాన్ని ప్రభుత్వానికి నివేదించాం. ఇందులో ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల ఏర్పాటు ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. 

‌‌ - ప్రొఫెసర్‌‌‌‌ యాదగిరిరావు, వీసీ, టీయూ