హాట్​హాట్​గా​ టీయూ వ్యవహారం!

  • వీసీపై ఏసీబీ విచారణకు ఈసీ లెటర్​
  • ఆ అధికారం ఏసీబీకి లేదన్న వీసీ రవీందర్ ​గుప్తా
  • భయపడుతున్న అకౌంట్స్​ఆఫీసర్లు..!

నిజామాబాద్,వెలుగు: తెలంగాణ యూనివర్సిటీలో గత పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. వీసీ రవీందర్​ గుప్తా అవినీతి వ్యవహారాలపై విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్ణయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. వారికి ఈసీ మెంబర్లు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. రిజిస్ట్రార్​ హోదాలో పనిచేసిన విద్యావర్ధినిని సస్పెండ్​చేసి,  ఏడాది కాలానికి చెందిన మొత్తం బడ్జెట్, ఖర్చులపై ఏసీబీ ద్వారా విచారణ చేయించాలని ఈసీ  తీర్మానించడం అక్రమాలకు పాల్పడిన వారి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 

ఒక్క యాడాది బడ్జెట్ విచారణ వ్యూహమే..​  

నవంబర్​ 2021 తరువాత వీసీ రవీందర్​ ఈసీ మీటింగ్ నిర్వహించకుండా పాలనాపరమైన ప్రతి అంశాన్ని క్యాష్​ చేసుకున్నారని ఆరోపణలున్నాయి. 2021–22, 2022–23 అకడమిక్​బడ్జెట్​ల  రూపకల్పన అదే రీతిలో చేశారని విమర్శ  ఉంది. ఇందులో గతేడాది బడ్జెట్​కు మాత్రమే ఏసీబీ విచారణను ఈసీ సభ్యులు కోరారు. ఒక ఏడాది బడ్జెట్​ ఆమోదం లేకుండా రెండో  ఏడాది బడ్జెట్​ ప్రస్తావనే ఉండదు. అందులో ముగిసిన ఏడాది ఆర్థిక అంశాలలో అవినీతి జరిగిందని గట్టిగా నమ్ముతున్నారు. 

 పీఏలలో భయం.. భయం

వీసీతో పాటు అకౌంట్స్​ ఆఫీసర్​గా పనిచేసిన వ్యక్తి నియమించుకున్న పీఏలు ఆరుగురు ఉన్నారు. వారి బ్యాంకు అకౌంట్లకు పైసలు ట్రాన్స్​ఫర్​చేసి నగదు డ్రా చేయించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వారందరూ భయపడుతున్నారు. విచారణ సమయంలో డబ్బులు తామే డ్రా చేసినట్టు నిర్ధరణ అవుతుందని, పై ఆఫీసర్ల ఆదేశాలు మాత్రమే పాటించిన తాము ఎలా బయటపడాలని ఆందోళన చెందుతున్నారు. తమ ఖాతాల నుంచి డ్రా చేయించిన డబ్బును డిపాజిట్​ చేయమని పీఏలుగా పనిచేసిన వారు తాజాగా డిమాండు పెట్టినట్టు సమాచారం.   

ఆ ముగ్గురు సూత్రధారులు

యూనివర్సిటీ ఆదాయ వ్యయాలపై స్పష్టమైన అవగాహన ఉన్న అకౌంట్స్​ ఆఫీసర్​​పై పెద్ద ఆఫీసర్లు గుర్రుగా ఉన్నారు. 11 ఏళ్లకు పైగా ఇక్కడ పనిచేస్తున్న ఆయనకు ప్రతి అకౌంట్​పై సంపూర్ణ మైన అవగాహన ఉంది. టెక్నికల్​గా ఎక్కడా దొరక్కుండా జాగ్రత్తలు తీసుకొని వీసీ అవినీతికి సహకారం అందించారని ఈసీ సభ్యులు బుధవారం నాటి మీటింగ్​లో ఓపెన్​గా చెప్పారు. ఆయనను అక్కడి నుంచి తప్పించాలని ప్రతిపాదించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్సిటీ ఇంజినీర్ ప్లేస్​లో ఆల్టర్నేట్​ ఇంజినీర్​ను  నియమించాలని  సిఫారసు చేశారు. ఒక మహిళా ఎంప్లాయ్​గురించి కూడా చర్చించారు. ఈ ముగ్గురూ అవినీతి వ్యవహారాల్లో ప్రధాన పాత్ర పోషించినట్టు ఉన్నత స్థాయిలో ఆధారాలు సేకరించారు.

ఏసీబీ విచారణ చెల్లదు

26న తాను లేకుండా నిర్వహించిన ఈసీ మీటింగ్​ చెల్లదని వీసీ రవీందర్​ గుప్తా అన్నారు. వీసీపై చర్యలు తీసుకునే అధికారం ఒక్క గవర్నర్​కు మాత్రమే ఉంటుందన్నారు. ఏసీబీ విచారణ ప్రస్తావనే హాస్యాస్పదమన్నారు. మీటింగే వింత అని, అందులో తీసుకున్నట్లుగా చెబుతున్న నిర్ణయాలు మరింత వింతగా ఉన్నాయన్నారు. తాను హాజరుకాని ఈసీ మీటింగ్​ ఎవరి అధ్యక్షతన నిర్వహించాలనే విషయాన్ని కూడా యూనివర్సిటీ చట్టం–191 ప్రకారం తానే చెప్పాల్సి ఉంటుందన్నారు. మీటింగ్​లో తీసుకున్న నిర్ణయాల కాపీ ఇంకా తనకు అందలేదని  వీసీ చెప్పారు.