బిల్డింగ్లు, లే అవుట్లకు ఇక అనుమతులు ఈజీ.. ‘బిల్డ్ నౌ’ యాప్ ప్రత్యేకతలేంటంటే..

బిల్డింగ్లు, లే అవుట్లకు ఇక అనుమతులు ఈజీ.. ‘బిల్డ్ నౌ’ యాప్ ప్రత్యేకతలేంటంటే..

హైదరాబాద్, వెలుగు: బిల్డింగ్లు, లే అవుట్లకు అనుమతులు ఇచ్చేందుకు మున్సిపల్ శాఖ ‘బిల్డ్ నౌ’ అనే కొత్త ఆన్​లైన్​ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు రోజులపాటు పడుతున్న పర్మిషన్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహకారంతో నిమిషాల్లో ఇచ్చే అవకాశం ఉన్న ఈ ‘బిల్డ్ నౌ’ యాప్​ను మంగళవారం సెక్రటేరియెట్​లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రారంభించారు.

అపార్ట్ మెంట్, కమర్షియల్ కాంప్లెక్స్​లను బయట, లోపల ప్లాన్ చూడటంతోపాటు వాటి కొలతను లెక్కకట్టే 3డీ విజువలైజేషన్ పరికరాన్ని మంత్రి లాంచ్​ చేసి, స్వయంగా పరిశీలించారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ విధానంపై షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఏకీకృత ఏఐతో భవన లే అవుట్స్​ను కొత్త గా స్టార్ట్ చేస్తున్నామని, ఏఐతో బిల్డ్ నౌ  లో అన్ని సేవలు ఒకే దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్పారు.  ఒక బిల్డింగ్, కమర్షియల్ కాంప్లెక్స్ లో బ్లాక్ లు,  హాల్, కిచెన్, బెడ్ రూమ్ లను 3 డి లో చూడొచ్చని తెలిపారు.  అపార్ట్ మెంట్ల   దగ్గర కియోస్క్ లు ఏర్పాటు చేస్తామని,  ఎంత ఎస్ఎఫ్ టీ , మీటర్లు ఉందో తెలిసిపోతుందని చెప్పారు. వినియోగదారులు మోసపోవద్దు అనేదే తమ ప్రభుత్వ ఉద్దేశం అని,  ఐఐటీ గ్రాడ్యుయేట్స్​ ఈ యాప్ ను అభివృద్ధి చేశారని శ్రీధర్ బాబు తెలిపారు. రెరా తో ఈ సిస్టమ్ లింక్ అయి ఉంటుందని చెప్పారు. ఆర్కిటెక్స్​, అపార్ట్ మెంట్ అసోసియేషన్లు, ప్రభుత్వ అధికారులకు వచ్చే రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చి, వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ‘బిల్డ్ నౌ’ ను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

మున్సిపల్​శాఖలో కొత్త ఆవిష్కరణలు
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖలో కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నామని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. రాష్ట్రంలో 60 శాతం జనాభా పట్టణాల్లోనే ఉన్నదని, గత 2,3 దశాబ్దాలుగా హైదరాబాద్ శరవేగంగా డెవలప్ అవుతున్నదని, రియల్ ఎస్టేట్ గ్రోత్ పెరుగుతున్నదని చెప్పారు. రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ నంబర్– 1 గా ఉన్నదని అన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. జీడీపీ 11 శాతం నమోదు అవుతున్నదని, సాఫ్ట్ వేర్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు.  రాజకీయ విభేదాలు ఉన్నా గత ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలు ఆపకుండా వాటిని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. వ్యాపారాలకు మంచి అనువైన వాతావరణం కల్పిస్తున్నామని, కొత్తగా కంపెనీలు, స్టార్టప్స్​ ఏర్పాటు చేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నదని చెప్పారు.

“ హైదరాబాద్ లో రూ. 250 కోట్ల ఎక్కువ నెట్ వర్త్ ఉన్న వాళ్లు హైదరాబాద్లో 467 మంది ఉన్నారు. ఇది బెంగళూరు కంటే ఎక్కువ.  రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ టాప్లో ఉన్నది. ఇందుకు వాతావరణం, ప్రభుత్వ పాలసీలు కారణం. చాలామంది కొత్తగా అపార్ట్​మెంట్స్,  గేటెడ్ కమ్యూనిటీలో ఇళ్లు కొంటున్నారు. హోమ్ లోన్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. హైదరాబాద్లో 9.5 లక్షల కంటే ఎక్కువ మంది సాఫ్ట్​వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు.  హైదరాబాద్లోనే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఎక్కువగా ఏర్పాటవుతున్నాయి. రాబోయే రోజుల్లో హైదరాబాద్లో 34 మిలియన్ల ఎస్ ఎఫ్ టీ ఆఫీస్ స్పేస్ , 1. 30 లక్షల ఇండ్లు అవసరం అని రిపోర్ట్స్​ చెబుతున్నాయి. 2024 లో ప్రపంచంలో టాప్ 5 సిటీలో హైదరాబాద్ ఉందని పలు నివేదికల్లో తేలింది ” అని శ్రీధర్​బాబు తెలిపారు. ఇవి దేశంలో, ప్రపంచంలోనే పేరుగాంచిన సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్​ అని,  తమ పార్టీ నేతలు గాంధీ భవన్ లో తయారు చేసినవి కాదని అన్నారు.

మూసీ ప్రక్షాళన, హైడ్రా ఆగవు
తమ ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రక్షాళన, హైడ్రా ఆగవని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పేదలకు అన్యాయం జరగనివ్వబోమని చెప్పారు. రూల్స్ ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మూసీపై హైకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పారు.  జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మెట్రో రైల్ ఫేజ్ –2 , మున్సిపల్ శాఖ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి స్కీములను మంత్రి మీడియాకు వెల్లడించారు. 

బిల్డ్ నౌ ప్రత్యేకత
నూతన సమగ్ర భవనాలు,  లేఅవుట్ల ఆమోదానికి సంబంధించిన వ్యవస్థ బిల్డ్ నౌ.  దేశంలోనే వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూట్నీ వ్యవస్థ ఇది. ఇది ప్రాసెసింగ్​ సమయాన్ని వారాలనుంచి నిమిషాలకు తగ్గిస్తుంది. పెద్ద బిల్డింగ్ లు, అపార్ట్ మెంట్ల పర్మిషన్లను  కూడా 5 నిమిషాల్లో ప్రాసెస్ చేయగల వేగంతమైన స్క్రూట్నీ ఇంజిన్. అనుమతి ప్రక్రియ అంతా ఒకే చోట పూర్తి చేయగల ఏకీకృత సింగిల్ విండో ఇంటర్ ఫేస్ ఇది.

ప్రజలు తమ భవనాలను నిర్మాణానికి ముందే వాస్తవికంగా అగ్మెంటెడ్​ రియాలిటీ 3డీ విజువలైజేషన్ ద్వారా చూడొచ్చు. భవన నిబంధనలపై తక్షణం, కచ్చితమైన మార్గదర్శకాలను ఏఐ ఆధారిత పవర్డ్ అసిస్టెంట్ అందిస్తుంది. ప్రతి దరఖాస్తును ధృవీకరించి ట్రాక్ చేసేందుకు  బ్లాక్ చైన్ టెక్నాలజీ అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం 2 నుంచి 30 రోజుల్లో పర్మిషన్లు ఇస్తుండగా బిల్డ్ నౌ పద్ధతిలో 6 నిమిషాల్లో పర్మిషన్స్​ రానున్నాయి.