2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి : డిప్యూటీ సీఎం భట్టి

2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి : డిప్యూటీ సీఎం  భట్టి
  • ఇతర రాష్ట్రాల్లో జాయింట్ వెంచర్లు: డిప్యూటీ సీఎం  భట్టి
  • త్వరలో న్యూ ఎనర్జీ పాలసీ
  • కేబినెట్ ఆమోదం తర్వాత అమల్లోకి
  • గ్రీన్​ఎనర్జీ  పాలసీపై  స్టేక్ హోల్డర్స్ సమావేశంలో వెల్లడి

హైదరాబాద్/సంగారెడ్డి, వెలుగు: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా 2030 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్​ పవర్​ జనరేషన్​ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం హెచ్ఐసీసీలో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2024 పేరుతో స్టేక్​ హోల్డర్లతో సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా రెనెవబుల్​ ఎనర్జీ  ఉత్పత్తిదారులు, ఇండస్ట్రీస్​ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో పీక్​ విద్యుత్​ డిమాండ్​ 15,623 మెగావాట్లు నమోదైందని తెలిపారు. ఇది 2035 నాటికి 31,809 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశామన్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణా చర్యల్లో భాగంగా గ్రీన్​ ఎనర్జీపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు.

దానిలో భాగంగా రాష్ట్రంలో 2030 నాటికి 20వేల మెగావాట్ల పునరుత్పాదక, క్లీన్ అండ్ గ్రీన్ ఇంధనాన్ని తెచ్చేలా కొత్త విద్యుత్ పాలసీని రూపొందిస్తున్నామని వివరించారు. దానికోసం అన్ని వర్గాల ప్రజలు, పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను సేకరిస్తున్నామని చెప్పారు.

ఈ పాలసీని త్వరలోనే కేబినెట్​లో సమావేశంలో అమోదించి ఆ తర్వాత అమల్లోకి తెస్తామన్నారు. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా జాయింట్ వెంచర్లుగా గ్రీన్​ ఎనర్జీ  ప్రాజెక్టులను ఏర్పాటు చేసేలా విధివిధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే, 20 వేల గ్రీన్​ ఎనర్జీ ఇంధన ప్రాజెక్టుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎమ్ కుసుమ్ పథకం ద్వారా 4వేల మెగావాట్ల వరకు మహిళా స్వయం సహాయక బృందాలకు కేటాయిస్తూ ఒప్పందం జరిగిందని చెప్పారు. కొన్ని గ్రామాల్లో రూఫ్​ టాప్​ సోలార్​ ప్రాజెక్ట్​ ను పైలెట్​ ప్రాజెక్ట్​గా చేపడుతున్నామని తెలిపారు. సమావేశంలో ఎనర్జీ ప్రిన్సిపల్​సెక్రటరీ సందీప్​ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ట్రాన్స్​కో సీఎండీ  కృష్ణభాస్కర్, సదరన్​ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, నార్తర్న్​ డిస్కం సీఎండీ వరుణ్ రెడ్డి, టీజీరెడ్కో వీసీఎండీ వావిళ్ల అనీల తదితరులు పాల్గొన్నారు. 

గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా రాష్ట్రం

తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మారుస్తామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.  భవిష్యత్తు ఇంధనం గ్రీన్ హైడ్రోజన్ అని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో శుక్రవారం ఇండియా, ఆస్ట్రేలియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు. వివిధ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, సుస్థిరతకు రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. గ్రీన్ ఎనర్జీ, స్థిరమైన టెక్నాలజీ, శాస్త్రీయ ఆవిష్కరణలలో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

దేశంలో ఎన్నో ఖనిజాలు ఉన్నాయని, వాటిని గుర్తించి దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా వినియోగించుకునేందుకు ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆవిష్కరణలు, అద్భుతమైన పనితీరుకు ఐఐటీ హైదరాబాద్ చిరునామా అని కొనియాడారు. తెలంగాణలో క్లిష్టమైన ఖనిజాలను వెలికి తీసేందుకు సమర్థవంతమైన మార్గాలు కనుగొనడం, స్థిరమైన మైనింగ్ పద్ధతులు అవసరమని ప్రభుత్వం గుర్తించిందన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు.