- తుంగభద్ర నుంచి కేసీ కెనాల్ ద్వారా 36 ఏండ్లు లెక్కకు మించి ఏపీ తరలింపు
- సగటున ఏటా 54.53 టీఎంసీలు తీసుకెళ్లింది నిజం కాదా?
- ట్రిబ్యునల్‌లో ఏపీ సాక్షి క్రాస్ ఎగ్జామినేషన్‌లో తెలంగాణ అడ్వకేట్ ప్రశ్నలు
హైదరాబాద్, వెలుగు : తుంగభద్ర నది నుంచి కేసీ కెనాల్ ద్వారా ఏపీ 36 ఏండ్లు అధిక నీటని తరలించుకుందని తెలంగాణ వాదించింది. ఆ ప్రాజెక్టుకు కేటాయింపులు 31.9 టీఎంసీలే అయినా.. 1972 నుంచి 2008 మధ్యన ఏటా సగటున 54.53 టీఎంసీలను తోడుకుందని పేర్కొంది. అలాంటప్పుడు కేసీ కెనాల్‌పై ఎందుకు నియంత్రణ విధించకూడదని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 (కేడబ్ల్యూడీటీ 2)లో ఏపీ సాక్షి అనిల్ కుమార్ గోయల్ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా తెలంగాణ ప్రశ్నించింది.
కేసీ కెనాల్‌ను వదిలేసి కేవలం జూరాలపైనే 37.84 టీఎంసీలకు నియంత్రణ విధించాలని చెప్పడమేంటని నిలదీసింది. శుక్రవారం మూడో రోజు కేడబ్ల్యూడీటీ 2 లో ఏకే గోయల్ క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింది. కేసీ కెనాల్ కేటాయింపులను మోడర్నైజేషన్ తర్వాత 39.9 టీఎంసీల నుంచి 31.9 టీఎంసీలకు తగ్గించారా అని తెలంగాణ తరఫు అడ్వకేట్ ప్రశ్నించారు. కానీ, 36 ఏండ్లు కేసీ కెనాల్ ద్వారా ఏపీ సగటున 54.53 టీఎంసీల జలాలను వాడుకుంది కదా అని ప్రశ్నించగా.. ఒక ఏడాదిలో వచ్చే 75 శాతం వరద (75% డిపెండబిలిటీ) ఆధారంగా లెక్కిస్తే సగటు వినియోగంలో మార్పులు ఉండొచ్చని గోయల్ తెలిపారు.
10 టీఎంసీలను తుంగభద్ర నుంచి నేరుగా కేసీ కెనాల్‌కు విడుదల చేస్తారని, మరో 21.9 టీఎంసీల జలాలను తుంగభద్ర దిగువ నుంచి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. కానీ, 36 ఏండ్లలో లెక్కకు మించిన నీటిని కేసీ కెనాల్ ద్వారా వాడుకున్నారని, అలాంటప్పుడు కేసీ కెనాల్ నీటి వినియోగంపై ఎందుకు నియంత్రణ విధించొద్దని తెలంగాణ అడ్వకేట్ ప్రశ్నించారు. జూరాల విషయంలో మాత్రమే 37.84 టీఎంసీలకు నియంత్రణ విధించాలని ఎందుకు షరతు పెడుతున్నారని నిలదీశారు.
అయితే, కేడబ్ల్యూడీటీ 1 ఆదేశాలను పరిగణనలోకి తీసుకునే జూరాల వద్ద 342 టీఎంసీల జలాలు శ్రీశైలం వరకు చేరే దాకా.. 37.84 టీఎంసీలకు జూరాలపై నియంత్రణ విధించాలని చెప్పానని గోయల్ జవాబిచ్చారు. అయితే, శ్రీశైలానికి ఎగువ నుంచి వరద వచ్చే ప్రాజెక్టుల్లో కేవలం జూరాలపైనే నియంత్రణ విధించాలన్నదే మీ నిర్ణయమా.. కేసీ కెనాల్ పై మాత్రం నియంత్రణ వద్దంటారా అని అడ్వకేట్ ప్రశ్నించారు. కేసీ కెనాల్‌కు శ్రీశైలం, నాగార్జునసాగర్నుంచి ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో తాగు నీటికి నీళ్లు ఇవ్వొచ్చని ఎలా చెప్పారని ప్రశ్నించగా..
అయితే, ఏపీ అధికారుల చర్చల ప్రకారం అత్యంత లోటు సంవత్సరాల్లోనే ఆయా ప్రాజెక్టుల నుంచి తాగునీటికి వాడుకోవచ్చని పేర్కొన్నానని గోయల్ తెలిపారు. కేడబ్ల్యూడీటీ 2 రిపోర్ట్ ప్రకారం 1972, 1985, 1986, 1987, 1995, 2001, 2002. 2003, 2004 (9 ఏండ్లు)లలో వరద ప్రవాహాల్లో లోటున్నదని.. ఆయా సంవత్సరాల్లో కూడా కేసీ కెనాల్ ద్వారా ఏపీ అధిక నీటిని తరలించుకుపోయిందన్నారు.
గుంటూరు చానెల్‌కు సాగర్ నీళ్లెందుకు
కృష్ణా డెల్టాకు నీటిని ఇచ్చేందుకు తలపెట్టిన వైకుంఠపురం పంపింగ్ స్కీమ్‌కు తొలుత 2.6 టీఎంసీల కేటాయింపులు చేశారని, ఆ తర్వాత 2 టీఎంసీలకు తగ్గించారని అనిల్ కుమార్ గోయల్ చెప్పారు. ఏపీకి సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి పేర్కొన్న నీటి అవసరాలు 385.83 టీఎంసీల్లో ఈ వైకుంఠపురం కేటాయింపులను పేర్కొన్నారా అని తెలంగాణ తరఫు అడ్వకేట్ ప్రశ్నించారు. పదేండ్లపాటు వదిలేసిన ఆ స్కీము కేటాయింపులనూ ఎలా అందులో పేర్కొంటారు? అని నిలదీశారు. దీంతో అసలు ఆ ప్రాజెక్టును పక్కకు పడేశారన్న సంగతి తనకు తెలియదని గోయల్ చెప్పారు.
గుంటూరు చానెల్, వైకుంఠపురం స్కీములకు 6 టీఎంసీల జలాలు పులిచింతల దిగువ నుంచి తీర్చుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. పులిచింతల దిగువన 53 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నా కూడా.. గుంటూరు చానెల్, వైకుంఠపురం స్కీములకు ఉద్దేశపూర్వకంగానే నాగార్జునసాగర్‌ను సోర్సుగా చూపించారా అని అడ్వొకేట్ నిలదీశారు. అయితే వరద తక్కువున్న రోజుల్లో అది సాధ్యపడకపోవచ్చన్నారు.
మెమోస్ ఫైల్ చేసేందుకు చాన్స్
మూడు రోజులుగా కొనసాగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్‌ను శుక్రవారం ట్రిబ్యునల్ ముగించింది. వచ్చే నెల 5, 6వ తేదీల్లో క్రాస్ ఎగ్జామినేషన్‌ను పూర్తి చేయనుంది. ఈలోపు రెండు రాష్ట్రాలు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, విభజన చట్టంలోని సెక్షన్ 89కు సంబంధించిన దాఖలు చేసిన డాక్యుమెంట్లకు అదనంగా మెమో లేదా అప్లికేషన్లను దాఖలు చేసేందుకు ట్రిబ్యునల్ అవకాశం ఇచ్చింది.