- 4 నెలల్లో జూరాల నుంచి కిందికి1,059 టీఎంసీలు
- అసంపూర్తిగా లిఫ్టు స్కీములు.. నీళ్లను లిఫ్ట్ చేసేందుకు నో చాన్స్
- ఏడేండ్లు అయితున్నా పూర్తికాని పాలమూరు- రంగారెడ్డి
- మన వాటా 289 టీఎంసీల్లో పావు వంతూ వాడుకోలే
మహబూబ్‌నగర్, వెలుగు: కృష్ణా నదికి ఫుల్లుగా వరద వస్తున్నా, తెలంగాణ వాటా నీటిని రాష్ట్ర సర్కారు ఎత్తిపోయలేకపోతోంది. మూడేండ్లుగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద రికార్డు స్థాయిలో వరద నమోదవుతున్నా, వచ్చిన నీళ్లను వచ్చినట్లే దిగువకు వదిలేస్తోంది. కృష్ణా నీళ్లను ఏపీ దోచుకుపోతోందని తరచూ చెప్పే సర్కారు పెద్దలు.. మన వాటా నీటిని వాడుకోవడంపై ఎనిమిదేండ్లుగా దృష్టిపెట్టింది లేదు. కృష్ణాపై లిఫ్టు స్కీముల్లో చాలావరకు అసంపూర్తిగా ఉండడం, రిజర్వాయర్లు సామర్థ్యానికి తగ్గట్లు లేకపోవడం, మెయిన్కెనాల్స్ బలహీనపడడం, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ఊసే లేకపోవడం లాంటి కారణాలతో లక్ష్యం మేరకు నీళ్లను ఎత్తిపోసుకోలేని పరిస్థితి ఉంది. ఈ ఏడాది జూన్ నుంచి జూరాల ద్వారా 1,059 టీఎంసీలు కిందికి పోగా, ఉమ్మడి మహబూబ్నగర్జిల్లాలోని వివిధ లిఫ్టు స్కీముల ద్వారా ఇప్పటివరకు ఎత్తిపోసుకున్నది 25 టీఎంసీలు మాత్రమే. సాగర్ ఎడమ కాల్వ ద్వారా వాడుకున్న 35 టీఎంసీలను కలిపినా కృష్ణా జలాల్లో మన వాటా(289 టీఎంసీలు)లో ఇది పావువంతు కూడా లేదు.
వాడింది 25 టీఎంసీలే
జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి కెపాసిటీ 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.869 టీఎంసీల నీళ్లున్నాయి. ఈ ఏడాది జూన్ రెండో వారం నుంచి పైన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులతోపాటు భీమా నది ద్వారా జూరాలకు కంటిన్యూగా వరద వస్తోంది. ఇరిగేషన్ ఆఫీసర్ల లెక్కల ప్రకారం ఈ సీజన్లో బుధవారం వరకు ప్రాజెక్టుకు1,059 టీఎంసీల నీరు ఇన్‌ఫ్లో వస్తే, 1,034 టీఎంసీలు ఔట్ ఫ్లోగా రికార్డ్ అయ్యింది. 9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ లెక్కన జూరాల నుంచి తెలంగాణ అవసరాల కోసం 16 టీఎంసీల నీరు మాత్రమే వాడుకున్నారు. ఇందులో నెట్టెంపాడు స్కీంకు 4 టీఎంసీలు, భీమాకు 6 టీఎంసీలు, కోయిల్‌సాగర్‌కు 0.4 టీఎంసీలు, మిగతా నీటిని కుడి, ఎడమ కాల్వలకు విడుదల చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా ఉన్న మహత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (ఎంజీకేఎల్ఐ) ద్వారా జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు కేవలం 9.1 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు ఆఫీసర్లు తెలిపారు.
స్కీంలన్నీ పెండింగ్‌లోనే
కృష్ణాబేసిన్‌లో తెలంగాణకు 289 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉన్నా, రాష్ట్రం వచ్చాక ఇప్పటి వరకు మన వాటా పూర్తిస్థాయిలో వాడుకున్నది లేదు. గత ప్రభుత్వాలు చేసిన పనులే తప్ప, తెలంగాణ వచ్చాక కొత్తగా రాష్ర్ట ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టలేదు. పాలమూరు-–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినా, ఇప్పటివరకు 30 శాతం పనులు కూడా జరగలేదు. ఎంజీకేఎల్ఐ కింద సగం పనులే జరిగాయి. గతేడాది ఎల్లూరు పంపులు మునిగిపోయి రిపేర్లకు వచ్చినా, ఇంత వరకు రిపేర్లు పూర్తిచేయలేదు. కోయిల్‌సాగర్ కింద ఆయకట్టు పెంచేందుకు కాల్వల రిపేర్లు జరుగుతున్నా, పనులు కంప్లీట్ కాలేదు. భీమా ఫేజ్-2 కింద సంగంబండ రిజర్వాయర్ రైట్ లో లెవెల్ కెనాల్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నెట్టెంపాడు కింద పిల్ల కాల్వల పనులు పూర్తి చేయలేదు.
పాలమూరుకు
న్యాయం చేయాలి
మూడు నెలలుగా ఎగువ నుంచి వస్తున్న వరద జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు పోతూనే ఉంది. ఉమ్మడి పాలమూరు ప్రాంతానికి న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. నీళ్లను వాడుకునేలా స్కీంలకు ప్లాన్ చేయాలి. జూరాల ఎగువన 200 టీఎంసీల సామర్థ్యంతో లిఫ్ట్‌ను ఏర్పాటు చేయాలి. బ్యాక్ వాటర్ ఆధారంగా పీఆర్ఎల్ఐలో భాగమైన లక్ష్మీదేవిపల్లికి నీటిని తీసుకుపోవాలి.
- రాఘవాచారి, కన్వీనర్,
పాలమూరు అధ్యయన వేదిక