కేసీఆర్‌‌‌‌ వల్లే తెలంగాణ ప్రకటన

కేసీఆర్‌‌‌‌ వల్లే తెలంగాణ ప్రకటన
  • తెలంగాణకు నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ విలన్‌‌‌‌ కాంగ్రెస్సే..
  • రేవంత్ ఏనాడు జై తెలంగాణ అనలేదు.. ఉద్యమంలో పాల్గొనలేదు
  • సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు

సంగారెడ్డి, వెలుగు : ‘తెలంగాణకు నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ విలన్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ పార్టీయే.. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.. ఆయన తెలంగాణ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది... లేకుంటే రెండు కండ్ల సిద్ధాంతం గుర్తుకువస్తుంది’ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు విమర్శించారు. బుధవారం సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు.

2004 నుంచి 2009 వరకు మాతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌‌‌‌ తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. కేసీఆర్‌‌‌‌ కారణంగానే డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చిందన్నారు. ఎవరి దయతోనే తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ ఉద్యమాన్ని, ప్రాణత్యాగం చేసిన అమరులను అవమానించడమే అవుతుందన్నారు. రేవంత్‌‌‌‌రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అనలేదని, ఉద్యమంలో పాల్గొనలేదని, 2001లో కేసీఆర్‌‌‌‌ పార్టీ పెట్టకపోతే తెలంగాణ అనే మాటే లేదు కదా అని ప్రశ్నించారు. యాభై ఏండ్ల కాంగ్రెస్‌‌‌‌, 16 ఏండ్ల టీడీపీ పాలనలో తెలంగాణ అనే పదమే లేకుండా చేశారని మండిపడ్డారు.

తెలంగాణ కోసం రేవంత్‌‌‌‌రెడ్డి ఏనాడూ రాజీనామా చేయలేదని, చంద్రబాబుని రాజీనామా చేయమంటే రేవంత్‌‌‌‌రెడ్డి తుపాకీ పట్టుకొని వచ్చాడని చెప్పారు. కేసీఆర్‌‌‌‌ కేంద్రమంత్రిగా ఉండి ఢిల్లీలో 32 రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించారని గుర్తు చేశారు.

నవంబర్ 29 లేకపోతే.. డిసెంబర్ 9 ప్రకటన లేదు... డిసెంబర్ 9న ప్రకటన లేకపోతే.. జూన్‌‌‌‌ 2న అవతరణ లేదు.. చిదంబరం నుంచి తెలంగాణ ప్రకటన వచ్చిందంటే దానికి కారణం కేసీఆరే’ అని స్పష్టం చేశారు. ఈ సత్యాన్ని ఏమార్చేందుకు కాంగ్రెస్‌‌‌‌ కుట్ర చేస్తోందని మండిపడ్డారు.

తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తామే తెలంగాణ తెచ్చామని చెబితే ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. బీఆర్ఎస్ తరఫున గ్రామాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి తొలగిస్తారా ? అని ప్రశ్నించారు. మార్చాల్సింది ప్రజల బతుకులు తప్ప విగ్రహాలు కాదన్నారు. సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులు మాణిక్యం, మామిళ్ల రాజేందర్, ఆర్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.