![అన్ని అవార్డులను గెల్చుకునే స్థితిలో తెలంగాణ పల్లెలు : ఎర్రబెల్లి](https://static.v6velugu.com/uploads/2023/04/Telangana-village_Xb7B3TlDYd.jpg)
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోని ఉత్తమ గ్రామీణ స్థానిక సంస్థలకు మొత్తం 46 జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించగా.. వాటిలో 13 తెలంగాణ రాష్ట్రానికి దక్కాయి. రాష్ట్రానికి చెందిన 11 గ్రామ పంచాయతీలు, ఒక్కో మండల పరిషత్, జిల్లా పరిషత్ లు ఈ పురస్కారాలను కైవసం చేసుకున్నాయి. రాష్ట్రానికి 8 దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు, 5 నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు వచ్చాయి. ఏటా ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నిర్వహిస్తుంటారు. దీన్ని పురస్కరించుకొని సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ అవార్డులను ఆయా స్థానిక సంస్థలకు ప్రతినిధులకు ప్రదానం చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ చేతుల మీదుగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఆయా స్థానిక సంస్థల సర్పంచ్‌లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవార్డులను అందుకున్నారు. ఈ 13 అవార్డుల ద్వారా తెలంగాణకు చెందిన 13 స్థానిక సంస్థలకు కలిపి రూ.12.5 కోట్ల నగదు ప్రోత్సాహకం దక్కింది. అత్యధిక అవార్డులను సాధించిన తెలంగాణను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు.
దీన్ దయాళ్ పురస్కారాల్లో..
దీన్ దయాళ్‌ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో.. ఆరోగ్య పంచాయతీ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గౌతమ్ పూర్, తగినంత నీరు కలిగిన గ్రామ పంచాయతీ విభాగంలో జనగామ జిల్లా నెల్లుట్ల, సామాజిక భద్రత విభాగంలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొంగట్ పల్లి, మహిళా స్నేహపూర్వక విభాగంలో సూర్యాపేట జిల్లాలోని ఐపూర్ లకు ఫస్ట్ ప్లేస్ దక్కింది. ఆయా విభాగాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచిన ఈ పంచాయతీలకు మొత్తం రూ. కోటి నగదు పురస్కారం దక్కింది. పేదరికం లేని, మెరుగైన జీవనోపాధి కలిగిన పంచాయతీ విభాగంలో జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని మందొండి గ్రామ పంచాయతీ, పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్ విభాగంలో వికారాబాద్ జిల్లాలోని చీమల్దారిని రెండో స్థానం వరించింది. దీంతో ఈ గ్రామాలకు రూ. 75 లక్షల నగదు ప్రోత్సాహకం లభించింది. పచ్చదనం, పరిశుభ్రత విభాగంలో పెద్దపల్లి జిల్లాలోని సుల్తాన్ పురికి మూడో స్థానం దక్కింది. స్వయంసమృద్ధి మౌలిక సదుపాయాల విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట పంచాయతీ మూడో స్థానంలో నిలిచింది. ఈ పంచాయతీలు రూ. 50 లక్షలు అందుకున్నాయి. నాన్ ఫైనాన్షియల్ఇన్సెంటివ్ సర్టిఫికెట్ల విభాగంలో గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్‌కు ఎర్రవల్లి(సిద్దిపేట) ఎంపికైంది.
అన్ని అవార్డులను గెల్చుకునే స్థితిలో తెలంగాణ పల్లెలు : ఎర్రబెల్లి
కేంద్రం ప్రకటించిన 46కు 46 అవార్డులను గెల్చుకునే స్థితిలో తెలంగాణ పల్లెలు ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఓ వైపు రాష్ట్రానికి అవార్డులను ఇస్తూనే.. మరోవైపు నిధుల కేటాయింపును తగ్గిస్తోందని ఆరోపించారు. రూ.907 కోట్ల మెటీరియల్ కంపోనెంట్ నిధులు రిలీజ్ చేయాలన్నారు. .
నానాజీ దేశ్ ముఖ్ పురస్కారాల్లో..
నానాజీ దేశ్ ముఖ్ పురస్కారాల్లో ఉత్తమ జిల్లా పరిషత్ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన ములుగుకు రూ. 3 కోట్ల నగదు పురస్కారం లభించింది. బెస్ట్ బ్లాక్ పంచాయితీ కేటగిరిలో సెకండ్ ప్లేస్ లో నిలిచిన కరీంనగర్ కు రూ. 1.75 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. స్పెషల్ కేటగిరిలో థర్డ్ ప్లేస్ లో నిలిచిన ముక్రా పంచాయతీ( ఇచ్చోడ, ఆదిలాబాద్)కి రూ. 50 లక్షలు, సీఎన్వీపీపీ కేటగిరిలో రెండో స్థానంలో నిలిచిన కంబా గ్రామ పంచాయతీకి(నందిగామ, రంగారెడ్డి) రూ. 75 లక్షల పారితోషికం వచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ మండల పరిషత్గా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎంపికైంది.