మమ్మల్ని రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేయాలి

  • రాష్ట్ర వీఆర్వోల సంక్షేమ సంఘం డిమాండ్ 
  • 1న మేడ్చల్ లో వీఆర్వోల ఆత్మీయ సమ్మేళనం

శామీర్​పేట, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని 5,139 మంది వీఆర్వోలను ఎటువంటి షరతులు లేకుండా రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేయాలని..అందరికి “పే” ప్రొటక్షన్, “సర్వీస్” ప్రొటక్షన్ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. డిసెంబర్1న మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం తూంకుంటలోని మెగుళ్ల వెంకటరెడ్డి గార్డెన్ లో  వీఆర్వోల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

దీనికి రాష్ట్రంలోని వీఆర్వోలు తరలిరావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం తూంకుంటలో  కమిటీ అధ్యక్షుడు గరికె ఉపేంద్ర రావు మీడియాతో మాట్లాడారు." గత బీఆర్ఎస్ సర్కార్ వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. అనంతరం వీఆర్వోలను లాటరీ పద్ధతి ద్వారా ప్రభుత్వంలోని వివిధ శాఖల్లోకి, అటనమస్ బాడీస్ ల్లోకి బలవంతపు సర్దుబాటు చేసింది. దాంతో ఉద్యోగుల హక్కులు, మానవ హక్కులు కోల్పోయాం. గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన పనివల్ల ఒక మహిళా తహసీల్దారు హత్యకు గురయ్యారు. 

మరో తహసీల్దార్ ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం178 మంది వీఆర్వోలు మృతి చెందారు. ఇవన్నీ గత ప్రభుత్వ హత్యలే" అని గరికె ఉపేంద్ర రావు ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వోలు పే ప్రొటక్షన్, సర్వీస్ ప్రొటక్షన్ కోల్పోయారని తెలిపారు. కాంగ్రెస్ సర్కారైనా తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీ. మోహన్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడు దేశ్ పాండే  ప్రకాష్ రావు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు దుబాసి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.