చాకిరేవు స్ఫూర్తితో అభివృద్ధి కోసం పల్లెలు కొట్లాడాలె

తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అరవై ఒక్క శాతం ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం.. నిధులు మాత్రం ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఇప్పటికీ అనేక గ్రామాలు మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా10 గ్రామాలను ఎంపిక చేస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే ఏడు గ్రామాలు ఎంపికయ్యాయి. అయినా కనీస వసతులు లేని గ్రామాలు రాష్ట్రంలో ఇంకెన్నో ఉన్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం, నిర్మల్, మహబూబాబాద్, నల్గొండ, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వందలాది గ్రామాలు అభివృద్ధికి దూరంగానే ఉన్నాయి. ప్రతి పల్లె, గ్రామం, గూడెం, తండా గంగదేవిపల్లి లాగా గాంధీజీ కలలు కన్న ఆదర్శ గ్రామాలుగా  వెలుగొందినప్పుడే అది వాస్తవ అభివృద్ధిగా పరిగణించాలి. అన్నా హజారే లాంటి ఒక సామాజిక కార్యకర్త రాలెగావ్ సిద్ధి లాంటి ఒక ఎడారి ప్రాంతాన్ని వాటర్ షెడ్ల నిర్మాణంతో సస్యశ్యామలం చేస్తే ఇంత పెద్ద యంత్రాంగంతో ప్రభుత్వాలు గ్రామాలకు మౌలిక వసతులు ఎందుకు కల్పించలేవన్న  ప్రశ్నకు సమాధానం కావాలి.

యంత్రాంగాన్ని కదిలించిన తండా..

ఆజాది కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో  తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా పెంబి మండలం చాకిరేవు  ఆదివాసి తండా ప్రజలు 75 కిలో మీటర్లు నడిచి నిర్మల్ కలెక్టరేట్ కి చేరుకుని తమ గ్రామానికి రోడ్డు, కరెంట్, తాగునీరు, ఆశా వర్కర్ కావాలని అధికారులను కోరారు. మొర పెట్టుకోవడమే కాదు తమ గ్రామానికి అన్ని సౌలత్​లు కల్పించే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదన్నారు. ఊరి సమస్యలు అధికారులకు చెప్పడానికి పిల్లాపాపలతో, ముసలి ముతక ఊరు ఊరంతా కదిలింది. నిర్మల్ కలెక్టరేట్ ముందు నిరసన దీక్షకు దిగటం వల్ల ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. కలెక్టర్ చాకిరేవు గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామానికి మంచినీళ్ల సౌలత్​చేయడానికి హామీ ఇచ్చారు. చాకిరేవు గ్రామస్తులు చూపిన ఉద్యమ స్ఫూర్తి, చొరవ, పట్టుదల, త్యాగం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాల ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుంది. 

ఎన్నో పథకాలు తెచ్చినా..

స్వాతంత్ర్యానికి పూర్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం శ్రీనికేతన్, మార్తాండం, బరోడా గ్రామీణ పునర్ నిర్మాణ పథకం లాంటి కొన్ని ప్రయోగాలు జరిగాయి. అవి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తూ ముసాయిదాలను తయారు చేశాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, కరెంట్, తాగునీరు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, డ్రైనేజ్ లాంటి వసతుల కల్పన కోసం బడ్జెట్ లో కోట్లాది రూపాయల నిధులు కేటాయించింది. అయినా ఇప్పటికీ ఆదివాసి గ్రామాలు గుక్కెడు నీళ్ల కోసం, సదుపాయాల కోసం ఎదురు చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించడానికి జల్ జీవన్ మిషన్, రోడ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన లాంటి పథకాలు అమలు చేస్తున్నా, కరెంట్ కోసం సౌభాగ్య లాంటి పథకాలు ప్రవేశపెట్టినా, ఆరోగ్య పరిరక్షణ కోసం రూరల్ హెల్త్ మిషన్ ఏర్పాటు చేసినా వాటి ఫలాలు కింది స్థాయి వరకు పూర్తిగా వెళ్లడం లేదు. తమ గ్రామ సమస్యల పరిష్కారం కోసం చాకిరేవు గ్రామస్తులు చేసిన 75 కిలోమీటర్ల పాదయాత్ర స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో గాంధీజీ చేసిన దండి సత్యాగ్రహ యాత్ర, నాసిక్ నుంచి ముంబయి వరకు రైతులు చేసిన పాదయాత్ర అంత కాకపోవచ్చు కానీ తమ గ్రామ సమస్యల పరిష్కారం కోసం వారు చూపిన తెగువ, వారి ప్రయత్నం మిగతా గ్రామాల ప్రజలకు ఆదర్శంగా నిలిచింది. 

:: డాక్టర్ తిరునాహరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ