- అన్ని గ్రామాల వివరాలు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలని సర్కార్ ఆదేశం
- అదే పనిలో బిజీగా పంచాయతీ ఉద్యోగులు
- 2 వారాలుగా రేయింబవళ్లు పనిచేయిస్తున్న ఆఫీసర్లు
- ఊర్లలో ఆగిపోతున్న రెగ్యులర్ పనులు
- కొన్ని గ్రామాలను ఎంపిక చేసే దానికి.. అన్నింటి వివరాలు ఎందుకని సిబ్బంది ఫైర్
ఈ ఫొటోలో కనిపిస్తున్న వారంతా కరీంనగర్ జిల్లా పంచాయతీరాజ్ ఉద్యోగులు. వీళ్లంతా గడిచిన వారం, పది రోజులుగా తమ గ్రామాలను, మండలాలను వదిలి ఇదిగో ఇలా జిల్లా పంచాయతీ రాజ్రీసోర్స్ సెంటర్(డీపీఆర్ఎస్)లో రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. అది కూడా కేంద్రం ఇచ్చే అవార్డుల కోసం తమ గ్రామ పంచాయతీల వివరాలను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేస్తున్నారు.
కరీంనగర్/జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: పంచాయతీ సెక్రటరీలకు రాష్ట్ర సర్కార్ కొత్త పని అప్పగించింది. ఆదర్శ గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పంచాయత్అవార్డుల కోసం రాష్ట్రంలోని అన్ని జీపీలు పోటీ పడాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 594 మండలాల పరిధిలో 12,769 జీపీలుండగా అన్ని గ్రామాల సెక్రటరీలు, మండల, జిల్లా కేంద్రాల్లోని పంచాయతీ సిబ్బంది గడిచిన 2వారాలుగా గ్రామాల వివరాలను అప్ లోడ్ చేయడంలో బిజీ అయ్యారు. దీంతో రెగ్యులర్పనులన్నీ పెండింగ్ పడుతున్నాయి. గ్రామ పంచాయతీలకు 2నెలలుగా రాష్ట్ర సర్కార్ ఎస్ఎఫ్సీ (స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్) ఫండ్స్ ఇవ్వడం లేదు. దీంతో సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, కరెంట్ బిల్లులు, ట్రాక్టర్ల ఈఎంఐలు కట్టలేక సెక్రటరీలు ఇబ్బందులు పడుతున్నారు.
అవార్డుల కోసం తిప్పలు..
ప్రతి ఏటా కేంద్రం 9 కేటగిరీల్లో జాతీయ పంచా యత్అవార్డులు ఇస్తోంది. పేదరికం మెరుగైన జీవనోపాధి, ఆరోగ్యం, చైల్డ్ ఫ్రెండ్లీ, స్వచ్ఛమైన తాగునీరు, క్లీన్అండ్ గ్రీన్, స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, గుడ్ గవర్నెన్స్, విమెన్ ఫ్రెండ్లీ.. ఇలా తొమ్మిది కేటగిరీల్లో 113 ప్రశ్నలకు ఆన్‌లైన్‌లో రిప్లై ఇవ్వడంతో పాటు పూర్తి వివరాలను ‘నేషనల్ పంచాయతీ అవార్డ్స్-2022’ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో కేటగిరీ కింద జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిలో మూడు చొప్పున రూ.30లక్షల నుంచి రూ.3కోట్ల దాకా క్యాష్ప్రైజ్లుంటాయి. గతంలో జిల్లాల వారీగా కొన్ని గ్రామాలను మాత్రమే ఎంపిక చేసి పోటీలకు పంపేవారు. కానీ ఈసారి బీఆర్ఎస్తో దేశరాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న సీఎం కేసీఆర్.. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు 113 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను, డాక్యుమెంట్లను గ్రామ పంచాయతీ లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ద్వారా నమోదు చేస్తున్నారు. అది అక్కడి నుంచి ఎంపీవోల ద్వారా జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో ) లాగిన్ కు వస్తుంది. అక్కడ పరిశీలన చేసి రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్‌కు పంపుతున్నారు. ఈ ప్రాసెస్ చాలా లేటవుతోంది. అన్ని జీపీలు ఇందులో పాల్గొన్నప్పటికీ మండలానికి మూడు, నాలుగు గ్రామ పంచాయతీల చొప్పున జిల్లాకు, అక్కడ స్క్రూటినీ చేసి స్టేట్ లెవల్‌కు, అక్కడ స్క్రూ టినీ చేసి కేంద్రానికి సిఫారసు చేయనున్నారు. ఆ మేరకు అన్ని గ్రామాల వివరాలను ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేయిస్తుండటంతో రెండు వారాలుగా సెక్రటరీలు, ఇతర పంచాయతీరాజ్ సిబ్బంది బిజీగా మారారు. అన్నీ సక్రమంగా ఉన్న గ్రామాలను మాత్రమే పోటీలో నిలిపితే బాగుండేదని.. కానీ ఉన్న గ్రామాలన్నింటినీ, అందులోనూ కనీస మౌలిక వసతులు లేని గ్రామాలను సైతం పోటీలో నిలపడంపై పంచాయతీరాజ్ సిబ్బంది ఫైర్ అవుతున్నారు.
జనానికి తప్పని ఇబ్బందులు..
సర్కారు గ్రామపంచాయతీలకు రెండు నెలలుగా ఎస్ఎఫ్సీ ఫండ్స్ఇవ్వడం లేదు. దీంతో పారిశుధ్య సిబ్బందికి జీతాలు అందడం లేదు. ఈ ఎఫెక్ట్ చెత్త సేకరణ, డ్రైనేజీల పూడికతీత లాంటి పనులపై పడుతోంది. చాలా గ్రామాల్లో వివిధ సమస్యలతో మిషన్‌భగీరథ నీళ్లు అందడం లేదు. కరెంట్ బిల్లులు, ట్రాక్టర్ల ఈఎంఐలు ఆగిపోయాయి. ఆస్తి పన్నులు కూడా వసూలు కావడం లేదు. వానకు దెబ్బతిన్న రోడ్లపై జనం నరకం చూస్తున్నారు. ఇక బర్త్, డెత్సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం అవుతోంది. ఇంటి అనుమతులు సైతం పెండింగ్ పడ్తున్నాయని జనం అంటున్నారు.
జీతాలే లేవు.. అవార్డులు ఎందుకు?
జీపీలకు 3నెలల నుంచి ఫండ్స్ రావట్లేదు. సిబ్బందికి జీతాలు ఇవ్వ లేకపోతున్నం. ట్రాక్టర్ ఈఎంఐలు, కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నం. రోడ్ల మరమ్మతులు చేయలేకపో తున్నం. కొత్త పనులు చేయాలని ప్రజల నుంచి ఒత్తిడి వస్తోంది. దీంతో ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉన్నది. ప్రజల సమస్యలు పరిష్కరించలేనప్పుడు ఎన్ని అవార్డులు వచ్చినా ఎందుకు?
- కర్ర సత్యప్రసన్నరెడ్డి, సర్పంచి, గోపాల్ రావుపేట, కరీంనగర్ జిల్లా